జగన్ ప్రభుత్వం పరువు తీస్తున్నారు, వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేత తీవ్ర ఆరోపణలు

జగన్ ప్రభుత్వం పరువు తీస్తున్నారు, వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేత తీవ్ర ఆరోపణలు

ysrcp

ysrcp leader allegations on gudur mla: నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. నేతల మధ్య వివాదం ముదురుతోంది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావుపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. గూడూరు అభివృద్ధికి ఎమ్మెల్యే వరప్రసాద్ సహకరించకుండా జగన్ ప్రభుత్వం పరువు తీస్తున్నారని హరిశ్చంద్రారెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఎమ్మెల్యే వరప్రసాద్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతి చర్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. దాతలకు తెలియకుండా పురాతన కట్టడాలను ఎమ్మెల్యే వరప్రసాద్ కూల్చేయడం దారుణం అన్నారు.

బస్ షెల్టర్ నిర్మిస్తానని చెప్పి తన దగ్గరే ఎమ్మెల్యే వరప్రసాద్ 10 లక్షలు తీసుకున్నారని హరిశ్చంద్రారెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఆ డబ్బులు ఏమయ్యాయని ఆయన ఎమ్మెల్యేను ప్రశ్నించారు. గూడూరు శివారులో సర్కిల్ తొలగింపు వివాదంపైనా ఎమ్మెల్యే తీరుని ఆయన తప్పుపట్టారు. సరైన ప్లాన్ లేకుండా ఎలా తొలస్తారని నిలదీశారు. గూడూరులో నిజమైన వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని హరిశ్చంద్రారెడ్డి వాపోయారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వరప్రసాద్.. తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వివరణ ఇచ్చారు. గూడూరు అభివృద్ధి విషయంలో హరిశ్చంద్రారెడ్డిని తాను అనేకసార్లు సంప్రదించినట్టు తెలిపారు. అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.

తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన తన దగ్గరకు రెండు మూడు సార్లు వచ్చారని.. కానీ తాను మాత్రం ఆయన దగ్గరకు అనేకసార్లు వెళ్లానని తెలిపారు. ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చానని వెల్లడించారు. హరిశ్చంద్రారెడ్డి మంచి కాంట్రాక్టర్ కావడంతో అనేక టెండర్ల సమయంలోనూ ఆయనను సంప్రదించానని వరప్రసాద్ తెలిపారు. ఇప్పుడీ వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో, విబేధాలకు ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.