Bathukamma 2023 : తెలంగాణలో మొదలైన పూల సంబురం..మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆ పేరు ఎలా వచ్చింది..?

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 14 నుంచి మొదలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఈ రోజుకో పేరుతో బతుకమ్మ సంబురాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజులు బతుకమ్మ సంబరాలు ఏరోజుకారోజే ప్రత్యేకం అన్నట్టు సాగిపోతుంటాయి. ఒక్కోరోజు బతుకమ్మను ఒక్కోపేరు పెట్టి పిలుస్తారు. వివిధ వాయనాలు, ప్రసాదాలు సమర్పిస్తారు. అలా బతుకమ్మ సంబురాల్లో మొదటి రోజు ‘ఎంగిలిపూల బతుకమ్మ’ ప్రారంభమైంది.

Bathukamma 2023 : తెలంగాణలో మొదలైన పూల సంబురం..మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆ పేరు ఎలా వచ్చింది..?

Bathukamma Festival 2023

Updated On : October 14, 2023 / 11:31 AM IST

Bathukamma 2023 : దేవుళ్లను పూలతో పూజిస్తారు. కానీ పూలనే పూజించే అరుదైన అద్భుతమైన..ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ. గడ్డి పూలు కూడా బతుకమ్మలో ఇమిడిపోయి మమేకమైపోయే ఆనందాల పండుగ బతుకమ్మ పండుగ. పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ.. బతుకమ్మ. ప్రకృతినిఆరాధిస్తూ సాగే పూల పండుగలో బతుకమ్మలో ఒదిగిపోయే పువ్వులు ఎన్నో ఎన్నెన్నో..అటువంటి బతుకమ్మ పండుగ సంబురాలు తెలంగాణలో మొదలయ్యాయి.

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 14 నుంచి మొదలయ్యాయి. అక్టోబర్ 22 వరకు కొనసాగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఈ రోజుకో పేరుతో బతుకమ్మ సంబురాలు జరుగనున్నాయి. బతుకమ్మ పండగంటే వాడ వాడంతా సందడిగా మారిపోతుంది. బతుకమ్మ పాటలతో, ఆటలతో హడావుడి వాతావరణం ఉంటుంది. తొమ్మిది రోజులు బతుకమ్మ సంబరాలు ఏరోజుకారోజే ప్రత్యేకం అన్నట్టు సాగిపోతుంటాయి. ఆటపాటలతో ఆడబిడ్డలు సందడి సందడిగా గడిపేస్తుంటారు. ఒక్కోరోజు బతుకమ్మను ఒక్కోపేరు పెట్టి పిలుస్తారు. వివిధ వాయనాలు, ప్రసాదాలు సమర్పిస్తారు. అలా బతుకమ్మ సంబురాల్లో మొదటి రోజు ‘ఎంగిలిపూల బతుకమ్మ’ ఈరోజే ప్రారంభమైంది.

తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మ సంబురాలు..
మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ట బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా జరిగే ఈ తొమ్మిది రోజుల సంబురాల్లో మొదటి రోజు ‘ఎంగిలి బతుకమ్మ’ సంబురంతో బతుకమ్మ ప్రారంభమైంది..

ఎంగిలిపూల బతుకమ్మ పేరు ఎందుకొచ్చింది…?
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు ఎందుకొచ్చింది…?అనేదానికి భిన్న ప్రాంతాల్లో భిన్నమైన కారణాలున్నాయి. బతుకమ్మను అందంగా పేర్చడం ఒక కళ. పూల కాడలన్నీ సమానంగా ఉండేలా కత్తిరిస్తూ బతుకమ్మను అందంగా ఆకర్షణీయంగా రంగు రంగుల పూలతో పేరుస్తారు. అప్పుడు పూల కాడల్ని కత్తెరతో గానీ, చేత్తో గానీ తీసేస్తారు. దానికి బదులుగా కొంతమంది నోటితో కాడల్ని తెంపి బతుకమ్మ పేర్చడం వల్ల ఈ రోజున బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని చెబుతారు.

అలాగే ఒకరోజు ముందు సేకరించి తెచ్చిన పూలతో బతుకమ్మ పేరుస్తారు కాబట్టి.. పూలను ఒకరోజు నిద్ర తర్వాత వాడటం వల్ల కూడా ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. అలాగే మొదటి రోజు బతుకమ్మ పెత్ర అమావాస్య రోజు వస్తుంది. దీంతో ఈ రోజు ఉదయాన్నే పెద్దల ఆత్మకు శాంతి కలగాలని వివిధ వంటలు చేసి తర్పనాలు ఇస్తారు. అలా ఉదయాన్నే కాస్త భోజనం చేసి.. అంటే ఎంగిలి పడి బతుకమ్మ పేరుస్తారు కాబట్టి కొన్ని చోట్ల ఈ కారణంగా ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఇలా కారణం ఏదైనా బతుకమ్మ సంబురాల్లో మాత్రం ఆడబిడ్డకు సంతోషంగా ఆడిపాడుతారు. సంతోషాల్లో మునిగి తేలిపోతుంటారు. బతుకమ్మ పేరుతో ఎన్నో అర్ధాలు వచ్చే పాటల్ని పాడుతారు. అందరు తమ తమ బతుకమ్మలను ఒకచోట చేర్చి చుట్టు తిరుగుతు చప్పట్లు కొడుతు పాటలు పాడుతారు.

ఎంగిలి పూల బతుకమ్మ నైవేద్యం…
మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మ : మొదటి రోజు వేడుక అమావాస్య రోజున మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

గడ్డిపూలు కూడా బతుకమ్మలో మమేకమైపోయే సంబరాల పండుగ 
చేలల్లోను, చెలకల్లోను, పొలం గట్లపైనా, తుప్పల్లోను, గుట్టల్లోను ముళ్ల కంచెల్లోను, రాళ్లల్లోను ఎక్కడపడితే అక్కడ బతుకమ్మ పూలు విరబూస్తాయి. రంగు రంగులుగా వికసిస్తాయి.తీరొక్క పూలే.. బతుకమ్మలో అందంగా ఒదిగిపోతాయి. నేలపైనే రంగుల హరివిల్లును తలపిస్తాయి. తంగేడు, గునుగు, సీతమ్మ కుచ్చులు, బంతులు,చేమంతులు, కట్లపూలు,తామరపూలు,బీరపూలు, గుమ్మడి పూలు.. ఒక్కటేమిటి తీరొక్క పూలు, బతుకమ్మను వర్ణశోభితం చేస్తాయి.