Beware Of Children : టీవీ, సెల్ ఫోన్లతో గడిపే చిన్నారులతో జాగ్రత్త! ఎందుకంటే..?

టీవీలు, కంప్యూటర్లు చూసే సమయం పెరగటంతో పాటు గంట కన్నా తక్కువసేపు వ్యాయామం చేస్తుంటే కూడా మానసిక సమస్యలు ఎక్కువగానే చుట్టుముడుతున్నాయి.

Beware Of Children : టీవీ, సెల్ ఫోన్లతో గడిపే చిన్నారులతో జాగ్రత్త! ఎందుకంటే..?

Computer (1)

Beware Of Children : పిల్లలు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం,సెల్ ఫోన్, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటం వంటివి చేస్తుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిల్లలకు మానసిక సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని బ్రిటన్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. టీవీ చూడటం, కంప్యూటర్‌ ముందు గడపటం వంటివి చెడు ప్రవర్తనకు కారణమవుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది. గంటల కొద్ది ఫోన్ చూస్తున్న విద్యార్థులు క్రమంగా వాటికి బానిసలవుతున్నారు. వద్దని తల్లిదండ్రులు మందలిస్తే.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ప్రస్తుతం సైకియాట్రిస్టులు, సైకాలజిస్టుల వద్దకు వచ్చే ప్రతి పది మందిలో ఎనిమిది కేసులు చిన్నారుల మానసిక సమస్యలకు సంబంధించినవే…చేతిలో మొబైల్‌ లేనిదే నిద్ర పట్టని పరిస్థితి. దీంతో మానసికంగా అనేక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. విచ్చలవిడి వాడకం కారణంగా మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుండడం, నిద్రకు దూరమవడం వంటికి ప్రధానంగా కనిపిస్తున్నాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడంతో మొండితనం, చిరాకు, అసహనం, కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతోంది.

అయితే శారీరక శ్రమ చేసే సమయాన్ని పొడిగించటం ద్వారా టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడపటం వల్ల కలిగే నష్టాన్ని పూరించుకోవటంపై అంతగా దృష్టి పెట్టలేదు. దీనిని గుర్తించటానికే బ్రిటన్‌ పరిశోధకులు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు వెయ్యి మంది 10-11 ఏళ్ల పిల్లలు టీవీ చూస్తున్న విధానంతో పాటు వారి శారీరకశ్రమ పద్ధతులనూ పరిశీలించారు. అనంతరం వారి భావోద్వేగాలు, ప్రవర్తన, తోటివారితో సమస్యలు వంటి వాటిని తెలుసుకున్నారు. మిగతా పిల్లలతో పోలిస్తే టీవీలు, కంప్యూటర్ల ముందు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నవారిలో మానసిక సమస్యలు సుమారు 60 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

టీవీని వీక్షించే సమయం పగటి పూట అయితే ఈ సమస్యలు రెట్టింపు కన్నా అధికంగా ఉంటున్నాయి. టీవీలు, కంప్యూటర్లు చూసే సమయం పెరగటంతో పాటు గంట కన్నా తక్కువసేపు వ్యాయామం చేస్తుంటే కూడా మానసిక సమస్యలు ఎక్కువగానే చుట్టుముడుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని పూరించుకోవటం శారీరక శ్రమ ద్వారా సాధ్యం కాదనీ తేలటం గమనార్హం. అందుకే పిల్లలను రోజుకి గంట కన్నా ఎక్కువసేపు టీవీలు, కంప్యూటర్ల ముందు గడపకుండా చూడటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో కుటుంబంతో పిల్లలు కలిసి గడిపే సమయం పెరగటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు.

అదే క్రమంలో మొబైల్‌ వినియోగాన్ని కట్టడి చేసి, అవసరానికి తగ్గట్లు వాడుకుంటే చక్కని ఫలితాలు సాధించవచ్చని పిల్లలకు అర్ధమయ్యేలా వివరించాలి. అనేక మంది తల్లిదండ్రులు ఉద్యోగాలు, ఇతర వ్యాపకాల్లో తలమునకలై పిల్లలను పట్టించుకోకుండా వదిలేస్తే వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. మానసిక సమస్యలకు తొలినాళ్ళల్లోనే అడ్డుకట్ట వేయకపోతే, భవిష్యత్తులో చిన్నారులు మరింత కుంగుబాటుకు గురయ్యే అవకాశాలు ఉంటాయి.