Pigeon Droppings : పావురాల వ్యర్ధాలతో శ్వాసకోశ జబ్బులు!

పావురాల రెట్టలు మనుషుల ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడటానికి దారితీసే ఫంగస్‌ను కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు వీటి వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు.

Pigeon Droppings : పావురాల వ్యర్ధాలతో శ్వాసకోశ జబ్బులు!

Pigeon Droppings

Pigeon Droppings : ఇల్లు, ఆఫీసు ఏదైనా సరే ఆ పరిసరాలలో పావురాలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయా! అయితే మీ ఆరోగ్యం రిస్క్ లో పడ్డట్టే.. ఎందుకంటే పావురాల రెట్టల వ్యర్ధాలు మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్నే చూపిస్తున్నాయి. ఇప్పటికే ముంబాయి, హైదరాబాద్ తోపాటు అనేక నగరాల్లో పావురాల కారణంగా అనేక మంది శ్వాసకోస సమస్యల బారిన పడుతూ చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సినీనటి మీన భర్త మరణానికి పావురాల వ్యర్ధాలే కారణమని వైద్యులు నిర్ధారణకు రావటం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

పావురాలు సాధారణంగా ఇంటి పైకప్పుల మీద విసర్జిస్తాయి. నేలపై పడితే మట్టిలో కలిసిపోయి మొక్కలకు ఎరువుగా మారే అవకాశం ఉంటుంది. కాని ఇంటి పై కప్పులపై, కిటికీల్లో రెట్టలు వేయటం వల్ల ఆ రెట్టల్లోని పరాన్న జీవులు ఇంటిలోకి వివిధ మార్గాల్లో చేరే అవకాశం ఉంటుంది. ఇలా చేరిన వైరస్ లో మనుషుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. పావురాల రెట్టలు మనుషుల ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడటానికి దారితీసే ఫంగస్‌ను కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు వీటి వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు. వృద్ధులు, అవయవ మార్పిడి చేయించుకున్న వారు, పిల్లలు, ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు వ్యాధి సంక్రమణకు గురయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది రోగులలో పావురం వ్యర్ధాల వాసనలను పీల్చటం ద్వారానే న్యుమోనియా అభివృద్ధి చెందడానికి కారణమని వైద్యులు అంటున్నారు.

పావురాల రెట్టల్లో ఉండే హిస్టాప్లాస్మా అనే ఫంగస్ కారణంగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. గబ్బిలాల రెట్టల్లోనూ ఈ ఫంగస్ ఉంటుందట. పావురాల్లో శరీరం మొత్తం రకరకాల వైరస్‌లకు ఆవాసంగా ఉంటం కారణంగా ఈ వైరస్ల వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే కొంతమందిలో ముందస్తుగా కొన్ని లక్షణాలు కనిపించే అవకాశాలు ఉంటాయి. తలనొప్పి, జ్వరం, పొడి దగ్గు , అలసట వంటి లక్షణాలు పావురాల వ్యర్ధాలు కలిగించే ఇన్ఫెక్షన్ కారణంగా కనిపిస్తాయి. కలుషితమైన పక్షి రెట్టల దుమ్ము, నీటి బిందువులను పీల్చడం వలన పిట్టకోసిస్ అనే ఫ్లూ లాంటి అనారోగ్యంతో సహా అనేక వ్యాధులకు దారితీయవచ్చు. కొన్ని రకాల పక్షుల రెట్టల కారణంగా సాల్మోనెల్లా అతిసారం కలిగించే బ్యాక్టీరియా సంక్రమించే అవకాశాలు ఉంటాయి.

పావురాల రెట్టలు వేసిన ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని శుభ్రంచేసిన అనంతరం చేతులను శుభ్రంచేసుకోవాలి. పావురాలకు ఆహారం ఇస్తూ వాటికి దగ్గరగా మసలుతుంటే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండటం మంచిదికాదు. ఇంటి పరిసరాల్లో పావురాలు ఆవాసం ఏర్పటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి.