kidney Cells : దెబ్బతిన్న కిడ్నీ కణాలను తిరిగి యాక్టివేట్ చేయడంలో శాస్త్రవేత్తల సక్సెస్! దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి చికిత్సలో గేమ్ ఛేంజర్

ఎలుకల మాదిరిగానే మునుషులపై అధ్యయనం చేపట్టనున్నారు. మనుషులపై సేఫ్టీ ట్రయల్స్ 2023లో ప్రారంభమవుతాయి. అన్నీ సవ్యంగా జరిగితే, వచ్చే రెండు మూడు సంవత్సరాలలో రోగులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.

kidney Cells : దెబ్బతిన్న కిడ్నీ కణాలను తిరిగి యాక్టివేట్ చేయడంలో శాస్త్రవేత్తల సక్సెస్! దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి చికిత్సలో గేమ్ ఛేంజర్

kidney Cells : జీవనశైలి ,ఆహారంలో అలవాట్ల కారణంగా ఇటీవలి కాలంలో కిడ్నీ జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. మనిషి శరీరంలోని అంతర్గత భాగాల్లో కిడ్నీలు చాలా కీలకమైనవి. దేహంలోని మలినాలను బయటకు విసర్జించడంతోపాటు సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, క్యాల్షియం, విటమిన్‌-డి వంటి లవణాలు, ఖనిజాలు, విటమిన్లతోపాటు ఎరిథ్రోపాయిటన్‌ అనే హార్మోన్‌ను కూడా కిడ్నీలు నియంత్రణలో ఉంచుతాయి. ఈ ప్రక్రియ సజావుగా జరగకపోతే దేహంలో సోడియం తగ్గిపోవడం, పొటాషియం, ఫాస్ఫరస్‌ మోతాదు పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. ఇలా జరిగితే గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారిలో 40 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

కిడ్నీలు దీర్ఘకాలంపాటు సరిగా పనిచేయని పరిస్థితే క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌గా చెప్పవచ్చు. కిడ్నీలకు సంబంధించిన జబ్బు ముఖ్యంగా డయాబెటిస్‌ , హైపర్‌ టెన్షన్‌ , కిడ్నీలో రాళ్లు , మల్ట్టిపుల్‌ యూరిన్‌ ఇన్ఫెక్షన్లు , మూత్రంలో ప్రొటీన్‌ మోతాదులు ఎక్కువగా ఉండటం , మూత్రంలో రక్తం , మాంసాహారం, ఉప్పు ఎక్కువగా తినడం వల్ల వస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధ పడేవారు కాళ్ల వాపులు, ముఖం వాపు, పొట్ట ఉబ్బరం, నీరసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉండారు. నీరసం , నిలబడినా, కూర్చున్నా ఆయాసం ఉటుంది. ఎముకలు బలహీనపడటం, గుండెతోపాటు ఊపిరితిత్తుల్లోనూ నీరుచేరడం వంటి సమస్యలకు దారి తీయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రోగికి డయాలసిస్‌ తప్పనిసరవుతుంది.

కిడ్నీ వైద్య రంగంలో కొత్త మలుపు ;

దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సింగ పూర్ లోని డ్యూక్ ఎన్ యూఎస్ మెడికల్ స్కూల్, నేషనల్ హర్ట్ సెంటర్ సింగపూర్, జర్మనీకి చెందిన సైంటిస్టుల టీమ్ చేసిన రీసెర్చ్ పరిశోధకులు శుభవార్తనందించారు. పూర్తిగా దెబ్బతిన్న కిడ్నీ కణాలను రిపేర్ చేసి, తిరిగి యాక్టివేట్ చేయెచ్చని శాస్త్రవేత్తలు తొలిసారిగా నిరూపించారు. తమ పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నట్లు ప్రకటించటంతో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఈ పరిశోధనలో కిడ్నీలోని ఇంటర్ ల్యూకిన్ -11 అనే ప్రోటీన్ ను బ్లాక్ చేయడం ద్వారా డ్యామేజ్ అయిన కిడ్నీ కణాలను మళ్లీ యాక్టివేట్ చేయగలిగినట్లు పరిశోధకులు చెబుతున్నారు. అంతకుముందు పరిశోధనల్లో కిడ్నీ దెబ్బతినడంలో ఇంటర్ ల్యూకిన్ -11 అనే ప్రోటీన్ పాత్ర ఎక్కువగా ఉందని గుర్తించగా, ఇంటర్ ల్యూకిన్ -11 వల్ల కిడ్నీలలో ఫైబ్రోసిస్, ఇన్ ఫ్లమేషన్ వస్తున్నట్లు నిర్ధారించారు. ఎలుకలపై పరిశోధనల్లో భాగంగా వాటి కిడ్నీలలోని ఇంటర్ ల్యూకిన్ -11 యాక్టివిటీస్ ను బ్లాక్ చేశారు. ఇంటర్‌లుకిన్-11 ప్రోటీన్‌కు వ్యతిరేకంగా మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఎలుకలకు న్యూట్రలైజింగ్ యాంటీబాడీని ఇచ్చారు. దీంతో అప్పటివరకు వాటి కిడ్నీలో పూర్తిగా దెబ్బతిన్న కణాలు మళ్లీ యాక్టివేట్ అయ్యాయని తేలింది. క్రానిక్ కిడ్నీ వ్యాధుల చికిత్సా పద్ధతులను కనుగొనే దిశగా జరుపుతున్న ప్రయోగాల్లో ఇదొక కీలక మలుపుగా అంతా భావిస్తున్నారు.

ఇంటర్ ల్యూకిన్ -11 అంటే ?

దీని గురించి చెప్పాలంటే ఇది ఒక ప్లయో ట్రోఫిక్ రకం సైటోకైన్. ఇంటర్ ల్యూకిన్ -11 ప్రధానంగా మెగా కార్యో సైటోపోయెసిస్ విడుదలయ్యేలా చేస్తుంది. దీని వల్ల ఎముక మజ్జ నుంచి రక్తంలోకి ప్లేట్ లెట్స్ విడుదల ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతోపాటు ఎముక మజ్జకు నష్టం చేసే ఆస్టియో క్లాస్ట్స్అనే సమస్యను ఇంటర్ ల్యూకిన్ -11 కలిగిస్తుంది. ఆస్టియో పోరోసిస్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అదే క్రమంలో ఇంటర్ ల్యూకిన్ -11 ప్రోటీన్స్ ను వాపును తగ్గించేందుకు, రూమటైడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధుల చికిత్సలోనూ ఉపయోగిస్తారు.

మనుషులపైనా ప్రయోగాలకు సన్నద్ధం ;

ఎలుకల మాదిరిగానే మునుషులపై అధ్యయనం చేపట్టనున్నారు. మనుషులపై సేఫ్టీ ట్రయల్స్ 2023లో ప్రారంభమవుతాయి. అన్నీ సవ్యంగా జరిగితే, వచ్చే రెండు మూడు సంవత్సరాలలో రోగులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఆవిష్కరణ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి చికిత్సలో నిజమైన గేమ్-ఛేంజర్ కావచ్చన్న డ్యూక్-NUS మెడికల్ స్కూల్ డీన్ మరియు పరిశోధనా బృందం సభ్యుడు ప్రొఫెసర్ థామస్ కాఫ్‌మన్ అంటున్నారు.

పాడైన కిడ్నీలు పునరుత్పత్తి అయ్యేలా చికిత్స అందించడం ప్రపంచంలో ఇదే మొదటిసారని బృందం తెలిపింది. ఒక దశాబ్దానికి పైగా ఈ ప్రాజెక్ట్‌పై ఈ బృందం పనిచేస్తుంది. కేవలం మూత్రపిండాలలో మాత్రమే కాకుండా ఊపిరితిత్తులు మరియు కాలేయం వంటి ఇతర అవయవాలకు కూడా ఈ పరిశోధన దోహదపడుతుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. మూత్రపిండాలకు పునరుత్పత్తి చేసే సహజసిద్ధమైన సామర్థ్యం ఉందని పరిశోధకులు తెలిపారు.