Mega Star Chiru: మా ఎన్నికల గురించి మెగాస్టార్ లేఖ.. జరగాల్సిందే

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు వెంటనే ఎన్నికలు జరపాలిని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. ప్రస్తుత కమిటీ పదవి కాలం ముగిసిందని.. దీని వల్ల సభ్యుల కోసం చేపట్టాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Mega Star Chiru: మా ఎన్నికల గురించి మెగాస్టార్ లేఖ.. జరగాల్సిందే

Megastar Chiranjeevi Writes To Krishnam Raju Over Maa Election

Mega Star Chiru: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు వెంటనే ఎన్నికలు జరపాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. ప్రస్తుత కమిటీ పదవి కాలం ముగిసిందని.. దీని వల్ల సభ్యుల కోసం చేపట్టాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన రాసిన లేఖలో వివరాలిలా ఉన్నాయి. క్రమశిక్షణా సంఘ అధ్యక్షుడు కృష్ణం రాజుకు నమస్కరిస్తూ మొదలుపెట్టి.. ‘మీకు తెలుసు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా తెలుగు సినీ రంగానికి సంబంధించిన ఓ విశిష్ట సంస్థ. సమున్నత లక్ష్యాల సాధన కోసం అందరూ సమిష్టిగా తమతమ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకొని ‘మా’ను ఏర్పాటు చేసుకున్నాం. ‘మా’కు నేను వ్యవస్థాప అధ్యక్షుడిని అయినందుకు ఇప్పటికీ ఓ సభ్యుడిగా కొనసాగుతున్నందుకు దానిని గౌరవంగా పరిగణిస్తుంటాను.

ప్రతిఒక్కరిలో అదే భావన:
‘మా’సభ్యత్వం కలిగిన ప్రతిఒక్కరిలో అదే భావన ఉంటుంది. ‘మా’కు కొన్ని విధివిధానాలను ఏర్పర్చుకునొని నిర్ణీత కాలవ్యవధికి పనిచేసే కార్యవర్గాన్ని సభ్యుల ఓటింగ్ ద్వారా ఎన్నుకొనే ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తున్నాం.

రెండేళ్లకు మార్చి నెలలో నిర్వహించుకొనే ‘మా’ కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ ఈ సారి కొవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కొనసాగుతుంది ఆపద్ధర్మ కార్యవర్గమే. ఎన్నికల నిర్వహించకుండా ఆపద్ధర్మ కార్యవర్గాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు. ప్రస్తుత కార్యవర్గానికి నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఉండదు కనుక వీలైనంత త్వరగా మనం కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

వీలైనంత త్వరగా:
జాప్యం లేకుండా ‘మా’ ఎన్నికల వెంటనే జరగాలి. తెలుగు సినీ రంగంలో గౌరవనీయ వ్యక్తి, సీనియర్ గా, డిసిప్లినరీ కమిటీ ఛైర్మన్ గా మీ మార్గదర్శకత్వంలో ‘మా’ ఎన్నికలు సజావుగా వీలైనంత త్వరగా జరుగుతాయనే నమ్మకం నాకుంది.

ప్రస్తుత పరిస్థితులు ‘మా’ ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలంగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో బార్ కౌన్సిల్ ఎన్నికలు.. ఇంకా మరికొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థల ఎన్నికల కొవిడ్ ప్రోటాకాల్స్ ను పాటిస్తూ విజయవంతంగా నిర్వహించుకొన్నారని నాకు తెలిసింది.

ఎన్నికల తర్వాత ఏర్పడే నూతన కార్యవర్గం ‘మా’ కు సంబంధించిన అజెండాలో పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించడానికి కృషి చేస్తుంది. ఆచరణాత్మకమైన విధానంలో వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. ఏ విధంగా చూసినా.. తక్షణం ‘మా’ కు ఎన్నికలు జరగడం అనివార్యం.

మళ్లీ పూర్వపు విధానంలోనే:
కొవిడ్ వల్ల మార్చి నెలలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. కనుక సెప్టెంబర్ మాసంలో జరిగే ఎన్నికల తర్వాత ఏర్పడే నూతన కార్యవర్గం కాలవ్యవధిని 2024మార్చి వరకూ కొనసాగించి, మళ్లీ అక్కడ నుంచి పూర్వపు విధానంలోనే రెండేళ్లకు మార్చి నెలలలో ‘మా’ ఎన్నికలు జరిగే విధంగా మీరు నిర్ణయం చేయాలని కోరుతున్నాను. ఈ సూచనను పరిశీలించగలరు.

‘మా’ విధివిధానాలకు కట్టుబడి ఉండాలి:
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రంగాలలలో సినీ రంగం ప్రధానమైంది. ఇక్కడ కూడా సినీరంగంలో జరిగే పరిణామాల పట్ల ప్రజలు ఆసక్తిని ప్రదర్శించడం సహజం. అందువల్ల ‘మా’ వంటి సంస్థలు చేపట్టే కార్యక్రమాలు ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ఉండాలి. సినీరంగం ప్రతిష్టను పెంచే విధంగా ‘మా’ పనితీరు ఉండాలి. సంస్థలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. ‘మా’ విధివిధానాలకు అందరూ కట్టుబడి ఉండాలి.

సామరస్యపూర్వగా పరిష్కరించుకోవాలే తప్ప:
ఇటీవల ‘మా’ సభ్యులు కొందరు మీడియా ముందుకెళ్లి తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చడం వల్ల గందరగోళం ఏర్పడింది. ఈ పద్ధతిని క్రమబద్ధీకరించాలి. తెలుగు సినీ పరిశ్రమకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం లభించాయంటే అందుకు ఏ ఒక్కరో కారణం కాదు. అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. అది కొనసాగాలని, చిన్నచిన్న అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు ఉంటే వాటిని సామరస్యపూర్వగా పరిష్కరించుకోవాలే తప్ప ఒకరినొకరు బహిరంగంగా విమర్శించుకోవడం ఏ ఒక్కరికీ సరైంది కాదనేది నా అభిప్రాయం.

మీకు అన్ని విషయాలు తెలుసు. మీ మాటకు తెలుగు చిత్రసీమ ఎనలేని గౌరవం ఇస్తుంది. మీ మార్గదర్శకత్వంలో మా చుట్టూ నెలకొన్న చిన్నచిన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, అందరి మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపి డా. కె. చిరంజీవి ముగించారు.