హిట్ కోసం వెయిటింగ్.. హీరోల తిప్పలు అంతా ఇంతా కాదయ్యా..

హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు హీరోలు..

  • Published By: sekhar ,Published On : January 28, 2020 / 12:51 PM IST
హిట్ కోసం వెయిటింగ్.. హీరోల తిప్పలు అంతా ఇంతా కాదయ్యా..

హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు హీరోలు..

సినిమా ఇండస్ట్రీలో హిట్ ఇచ్చిన వారే స్టార్‌లు. వరుసగా రెండు ఫ్లాప్‌‌లు పడితే స్టార్ హీరోలు కూడా జీరోలే. ఇక్కడ ప్రతీ శుక్రవారం జాతకాలు మారిపోతాయి. ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో కొంతమంది హీరోలు ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. హిట్ కోసం దండయాత్ర చేస్తూ పట్టువదలని విక్రమార్కుల్లా  పోరాడుతున్నారు. ఆ లిస్టులో ఉన్న హీరోలను ఓ సారి చూద్దాం..
బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులతో హిట్ కోసం బాగా ట్రై చేస్తున్న రవితేజకు ‘డిస్కోరాజా’తో మళ్లీ ఇంచుమించు అలాంటి దెబ్బే తగిలింది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈసినిమా అబ్బో.. అదిరిపోతుందని యూనిట్ మొత్తం తెగ ప్రమోట్ చెయ్యడంతో.. చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్లిన ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు.
ఈ సినిమానే కాదు.. అసలు ‘రాజా ది గ్రేట్’ తరువాత రవితేజవి వరుసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పల్టీలు కొట్టాయి. ఎన్ని డిఫరెంట్ స్టోరీస్ ట్రై చేసినా లాభం లేకుండా పోయింది. లాస్ట్ ఇయర్ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ కూడా అద్భుతంగా ఆడుతుంది అనుకుంటే.. నిండా ముంచింది. మరి ఇప్పుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న ‘క్రాక్’ సినిమాతో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి..

యంగ్ హీరో నాగశౌర్య ఈ హిట్ ఫీట్ ఎలా అయినా సాధించాలని బాగా ట్రై చేస్తున్నాడు. ‘ఛలో’ సినిమాతో అటు హీరోగా.. ఇటు నిర్మాతగా డబుల్ హిట్ కొట్టిన శౌర్య.. ఆ తరువాత ‘నర్తనశాల’ సినిమాతో చేతులు కాల్చుకున్నాడు. ఇక ఈ మధ్య వచ్చిన ‘ఓ బేబి’ హిట్ అయినా.. ఆ క్రెడిట్ అంతా సమంతకే వెళ్లిపోయింది. ఇక లాభం లేదు అనుకుని సిక్స్ ప్యాక్‌తో.. తనే స్టోరీ రాసుకుని కొత్త దర్శకుడితో ‘అశ్వథ్థామ’ సినిమాని తెరకెక్కించాడు. ఈనెల 31న రిలీజ్ అవుతున్న ఈ సినమాతో అయినా హిట్ కోరిక తీర్చుకుంటాడేమో చూడాలి.
మరోవైపు శర్వానంద్ పరిస్థితి కూడా అలానే ఉంది. ‘పడిపడి లేచే మనసు’ డిజాస్టర్ అవడంతో.. డిసప్పాయింట్ అయిన శర్వా.. కొంచెం డిఫరెంట్‌గా సుధీర్ వర్మ డైరెక్షన్‌లో గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించిన ‘రణరంగం’ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ రెండు సినిమాలు  హిట్ అవకపోవడంతో ఈ సారి ఎలా అయినా సక్సెస్ కొట్టాలని తమిళ్‌లో బ్లాక్ బస్టర్  హిట్ అయిన ‘96’ సినిమా రీమేక్‌లో సమంతతో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలవుతుండగా.. కొత్త దర్శకుడు కిషోర్‌తో చేస్తున్న ‘శ్రీకారం’ వేసవిలో రిలీజవనుంది.
ప్రస్తుతం ‘96’ హిట్ మీదనే శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. 

మాస్ యాక్షన్‌హీరోగా మంచి ఇమేజ్‌తెచ్చుకున్న గోపిచంద్‌, సక్సెస్‌ఫుల్‌హీరో అని మాత్రం  అనిపించుకోలేకపోతున్నాడు. ఈ హీరో కూడా నాన్ స్టాప్ ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఎంత ట్రై చేసినా.. ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసినా.. హిట్ కొట్టలేకపోతున్నాడు. అప్పుడెప్పుడో 2015లో ‘జిల్’ సినిమాతో కాస్త.. ఫామ్‌లోకి వచ్చినా.. తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపే. ‘ఆరడుగుల బుల్లెట్’, ‘ఆక్సిజన్’ తోపాటు లాస్ట్ ఇయర్ ‘సైరా’ కు పోటీగా ‘చాణక్య’ సినిమాను రిలీజ్ చేసి దెబ్బతిన్న గోపీచంద్ కొంచెం ట్రాక్ మార్చి ఈసారి స్పోర్ట్స్ మూవీ చేస్తున్నాడు. సంపత్ నంది డైరెక్షన్‌లో కబడ్డీ బేస్డ్ మూవీ ‘సీటీమార్’ లో నటిస్తున్నాడు. రొటీన్ యాక్షన్‌ను పక్కన పెట్టి పర్ఫార్మెన్స్‌ని ఎలివేట్ చేసే దిశగా.. సక్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు గోపీచంద్. 

ఒక్క సినిమా కూడా రిలీజ్‌కాకుండానే స్టార్‌ఇమేజ్‌అందుకున్న హీరో అఖిల్‌అక్కినేని. భారీ బడ్జెట్‌‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘అఖిల్’ బాక్సాఫీస్‌ముందు చతికిల పడింది. తరువాత కూల్‌ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘హలో’ కూడా అఖిల్‌కు నిరాశే మిగిల్చింది. మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’ కూడా సేమ్ ఫ్లాప్ మెయింటెన్ చేసింది. ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలని విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫామ్‌లో లేని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్.. ఈ సినిమా హిట్ అవడం హీరో, దర్శకుడు ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్.
ఒక్క హిట్ కోసం.. లేని పోని ప్రయోగాలు చేస్తున్న నితిన్ కూడా ఇదే లిస్ట్‌లో ఉన్నాడు. సక్సెస్ మొహం చూసి చాన్నాళ్లయిన నితిన్‌కు ఈ మధ్య ఏ సినిమా చేసినా.. ఏ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నా హిట్ రావట్లేదు. ఎప్పుడో 2016 లో ‘అ..ఆ’.. సినిమా పర్వాలేదనిపించినా.. తర్వాత వచ్చిన ‘లై’, ‘శ్రీనివాస కళ్యాణం’, ‘చల్ మోహన రంగ’ సినిమాలన్నీ ఫ్లాపే. 
గతంలో చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా పర్లేదు.. హిట్ కొట్టేవరకూ నిద్రపోను అనుకుంటూ.. ఒకేసారి మూడునాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు. చంద్రశేఖర్ యేలేటి సినిమాతో పాటు, ‘రంగ్ దే’, వెంకీ కుడుములతో లవ్ఎంటర్‌టైనర్ ‘భీష్మ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలతో హిట్ రాకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు నితిన్. 

డిఫరెంట్ సినిమాలను సెలక్ట్ చేసుకునే సందీప్ కిషన్ కూడా ప్లాపుల్ని ఫేస్ చేస్తున్నాడు. నిజానికి తెలుగులో హిట్ కొట్టి చాలారోజులైంది సందీప్. ‘నక్షత్రం’, ‘మనసుకు నచ్చింది’, ‘నెక్ట్స్ ఏంటి’? ఇలా అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. తర్వాత చేసిన థ్రిల్లర్ మూవీ ‘నిను వీడని నీడని నేనే’ సినిమాతో పాటు కామెడీ ఎంటర్‌టైనర్ అయిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలు కూడా అదే ఫ్లాప్‌ను కంటిన్యూ చేశాయి. అయినా అస్సలు ఏమాత్రం డిస్పాయింట్ కాకుండా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘A1 ఎక్స్‌ప్రెస్’ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇలా హిట్ల కోసం థియేటర్లలో దండయాత్ర చేస్తూనే ఉన్నారు హీరోలు.