మనుషులకు అది పోలీసు సైరన్, వీధి కుక్కలకు మాత్రం ఆహారానికి పిలుపు.. గుండెలు పిండే దృశ్యం

మనుషులకు అది పోలీసు సైరన్, వీధి కుక్కలకు మాత్రం ఆహారానికి పిలుపు.. గుండెలు పిండే దృశ్యం

లాక్ డౌన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ కారణంగా మనుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా వలస కూలీలు, నిరు పేదలు. ఉపాధి లేక ఆదాయం లేక తినడానికి తిండి కూడా కరువైంది. రోజంతా కష్టపడి పని చేస్తేనే వారి కడుపులు నిండుతాయి. నాలుగు వేళ్లు నోట్లోకి పోతాయి. కానీ లాక్ డౌన్ తర్వాత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పూట తిండి దొరకడం కూడా కష్టంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. నోరున్న మనుషుల పరిస్థితే ఇంత దయనీంగా ఉంటే మరి మూగజీవాలు, వీధి కుక్కల పరిస్థితి ఏంటి?

వీధుల్లో ఉండే కుక్కలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆకలితో, దాహంతో బాధ పడుతున్నాయి. లాక్ డౌన్ తో రోడ్లపై మనుషుల రాకపోకలు లేవు. దీంతో వాటిని పట్టించుకునే వారు కరవయ్యారు. ఈ పరిస్థితుల్లో మనసున్న కొందరు వ్యక్తులు మూగ జీవాలను ఆదుకుంటున్నారు. వీధి కుక్కలను చేరదీసి వాటి ఆకలి బాధ తీరుస్తున్నారు. చండీఘడ్ లో గుండెలను పిండే దృశ్యం ఒకటి చోటు చేసుకుంది.

ఓ పోలీసు పెద్ద మనసు చూపించాడు. లాక్ డౌన్ లో వీధి కుక్కల ఆకలి తీరుస్తున్నాడు. రోజూ పోలీస్ వాహనంలో ఆయన వస్తాడు. సైరన్ మోగిస్తాడు. మనుషులకు అది పోలీసు సైరన్ కావొచ్చు. కానీ ఆ వీధి కుక్కలకు మాత్రం అది సైరన్ కాదు. అది ఆహారానికి పిలుపు లాంటి. ఆ సైరన్ శబ్దం వినగానే ఎక్కడెక్కడో ఉన్న శునకాలన్నీ పరుగు పరుగున వాహనం దగ్గరకి వస్తాయి. ఆ వాహనంలో ఉన్న పోలీసు కిందకు దిగుతాడు. తన వెంట తెచ్చిన ఆహారాన్ని వాటికి ఇస్తాడు. ఈ దృశ్యాలను ఓ జర్నలిస్ట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో అందరి మనసులను కదిలిస్తోంది. కాగా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇలా వీధి కుక్కల ఆకలి తీరుస్తున్నారు.

లాక్ డౌన్ వేళ వీధి కుక్కల ఆకలి తీరుస్తున్న పోలీస్ ను అందరూ అభినందించారు. మీరు గ్రేట్ అని, మనసున్న మారాజు అని ప్రశంసలు కురిపించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మనుషులతో పాటు మూగ జీవాలను కూడా ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నెటిజన్లు కామెంట్ చేశారు.