BARC సంచలన నిర్ణయం : న్యూస్ ఛానల్స్ TRP రేటింగ్స్ నిలిపివేత

  • Published By: venkaiahnaidu ,Published On : October 15, 2020 / 03:11 PM IST
BARC సంచలన నిర్ణయం : న్యూస్ ఛానల్స్ TRP రేటింగ్స్  నిలిపివేత

News Channel Ratings pause by BARC టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీ BARC(బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) సంచలన నిర్ణయం తీసుకుంది. పలు వార్తా ఛానళ్లు టీఆర్​పీ స్కామ్ కు పాల్పడినట్లు కొద్ది రోజుల క్రితం ముంబై పోలీస్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ముంబై పోలీసులు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో న్యూస్ ఛానల్స్ యొక్క వీక్లీ రేటింగ్స్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బార్క్​(Broadcast Audience Research Council)ప్రకటించింది.



12వారాల(3నెలలు) పాటు టెలివిజన్ వ్యూయర్షిప్ రేటింగ్స్ ఇవ్వడాన్ని నిలుపుదల చేస్తున్నట్లు బార్క్ గురువారం(అక్టోబర్-15,2020)బార్క్ ప్రకటించింది. ఈ మూడు నెలల కాలంలో అన్ని వార్తా ఛానెల్‌ల రేటింగ్‌లను బార్క్ ప్రచురించదని స్పష్టం చేసింది. అన్ని హిందీ, ప్రాంతీయ, ఇంగ్లీష్ న్యూస్ మరియు బిజినెస్ న్యూస్ ఛానెళ్లకు ఇది వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొంది. రేటింగ్​ గణాంకాలను మెరుగుపరచడానికి ప్రస్తుత ప్రమాణాలను సమీక్షించి, వాటిలో మార్పులు చేర్పులు చేయాలని బార్క్​ భావిస్తోంది.


బార్క్ నిర్ణయాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) స్వాగతించింది. బార్క్ లో ముఖ్యమైన సంస్కరణలను అమలు చేయడానికి సస్పెన్షన్ కాలం ఉపయోగపడుతుందని ఎన్‌బిఎ ప్రెసిడెంట్ రజత్ శర్మ అన్నారు.

కాగా న్యూస్, మరియు ఎంటర్టైన్మెంట్ చానళ్లకు ఈ రేటింగ్ ఆధారంగానే యాడ్స్ వస్తుంటాయి. అయితే, కొంతకాలంగా ఛానల్ రేటింగ్ ను కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలుమార్లు బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ వివరణ ఇస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ముంబైలో రేటింగ్ కుంభకోణం వెలుగులోకి రావడం చర్చనీయాంశం అయింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పలు చానళ్ళు పోలీసులను కోరుతున్నాయి.