ఇల్లు కొనాలనుకునేవారికి సువర్ణ అవకాశం..ఇంటిరుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు

ఇల్లు కొనాలనుకునేవారికి సువర్ణ అవకాశం..ఇంటిరుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు

interest-rates-on-home-loans

Banks lowering interest rates on home loans : సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా….వడ్డీ రేట్లు చూసి ఇంతకాలం భయపడ్డారా..అయితే ఇక ఏ మాత్రం ఆలోచించకండి..ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకండి. ఇంతకంటే సువర్ణావకాశం మళ్లీ మళ్లీ రాదు. ఎందుకంటే..బ్యాంకులన్నీ వరుస పెట్టి ఇంటి రుణాల వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. కరోనాకు ముందు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వడ్డీ రేట్లు ఇప్పుడు కాస్త అందుబాటులోకొచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వడ్డీరేట్లు 15 ఏళ్ల కనిష్టస్థాయికి తగ్గాయి. ఈ వడ్డీరేట్లు కొత్తగా ఇల్లుకొనేవారిపై భారం తగ్గించనున్నాయి.

75లక్షల వరకు ఇంటిరుణం తీసుకునేవారికి వడ్డీ రేటు 6.70శాతానికి తగ్గిస్తున్నట్టు ఐసీఐసీఐ ప్రకటించింది. ఇవాళ్టి నుంచే ఇది అమలవుతుందని తెలిపింది. పదేళ్లలో ఐసీఐసీఐ వడ్డీ రేట్లు ఇంత తక్కువగా ఉండడం ఇదే తొలిసారి. 75లక్షల పై బడిన రుణాలకు మాత్రం వడ్డీ రేటు 6.75శాతం కన్నా ఎక్కువ ఉంటుంది. 2021 మార్చి 31 వరకు సవరించిన వడ్డీరేట్లు అందుబాటులో ఉండనున్నాయి.

ఇప్పటికే ఎస్‌బీఐ, కొటక్ మహీంద్ర బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఇంటి రుణాల వడ్డీరేట్లు తగ్గించాయి. 75లక్షల లోపు ఇంటి రుణాలపై వడ్డీ రేట్లను ఎస్‌బీఐ 6.7శాతానికి తగ్గించింది. కొటక్ మహీంద్ర బ్యాంక్ 6.65శాతానికి తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ రీటైల్ ప్రైమ్ లెండింగ్‌ రేట్‌ను ఐదు పాయింట్లు తగ్గించింది. మార్చి 4 నుంచి తగ్గించిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి. మహిళల కోసం ఎస్‌బీఐ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఇంటిరుణాలు తీసుకునే మహిళలకు ఐదు బేసిస్ పాయింట్ల రాయితీ ఇచ్చింది.

యోనో యాప్‌ ద్వారా 30లక్షల వరకు ఇంటి రుణం తీసుకునే ఉద్యోగినులకు ఎస్‌బీఐ వడ్డీ రేట్లు 6.6శాతానికి తగ్గించింది. యోనో యాప్‌ ద్వారా లోన్ తీసుకునే ఉద్యోగులకు 6.65శాతం వడ్డీ వసూలు చేయనుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్ర బ్యాంకులు ఇంత తక్కువ వడ్డీ రేట్లు అమలు చేయడం 15 ఏళ్లలో ఇదే తొలిసారి.

తగ్గించిన వడ్డీ రేట్లను కొన్ని బ్యాంకులు కొత్తగా ఇంటి రుణాలు తీసుకునేవారికి మాత్రమే వర్తింప చేస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు మాత్రం పాత రుణగ్రహీతలకు కూడా లబ్ధి కలిగిస్తున్నాయి.