Chandrayaan-3: టైం మార్చేసిన ఇస్రో.. 23న సాయంత్రం 6.04 గంటలకు ఏం జరుగుతుంది.. సర్వత్రా ఉత్కంఠ .. లైవ్‌లో వీక్షించే అవకాశం

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్ -3 మరికొద్ది గంటల్లో జాబిల్లి దక్షిణ ఉపరితలంపై అడుగుపెట్టనుంది. అయితే, జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టే అద్భుత దృశ్యాలను ప్రతీఒక్కరూ వీక్షించే అకాశాన్ని ఇస్రో కల్పించింది.

Chandrayaan-3: టైం మార్చేసిన ఇస్రో.. 23న సాయంత్రం 6.04 గంటలకు ఏం జరుగుతుంది.. సర్వత్రా ఉత్కంఠ .. లైవ్‌లో వీక్షించే అవకాశం

Chandrayaan-3

ISRO Chandrayaan-3: జాబిల్లి ఉపరితలం దక్షిణ ధ్రువంపై అందరికంటే ముందే అడుగుపెట్టి చరిత్ర సృష్టించాలని భావించిన రష్యా అంతరిక్ష శాస్త్రవేత్తల ఆశలు అడియాశలయ్యాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యే సమయంలో రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్‌కాస్మోస్’ ప్రయోగించిన లూనా-25 విఫలమైంది. ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిపోయింది. అయితే, రష్యా అంతరిక్ష సంస్థ కంటే ముందే చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఇస్రో చంద్రయాన్-3ను పంపించింది. ఈనెల 23న సాయంత్రం ఇది చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కావాల్సి ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ అంటే చిన్నవిషయం కాదు.. కొంచెం తేడావచ్చినా ప్రయోగం విఫలం అవుతుంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే సమయంలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు చేపట్టారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈనెల 23న సాయంత్రం ఇస్రో సరికొత్త చరిత్రను సృష్టించనుంది.

ISRO Chandrayaan-3

ISRO Chandrayaan-3

జాబిల్లిపై ల్యాండింగ్ సమయం మారింది..

జాబిల్లిపై చంద్రయాన్-3 కాలుమోపే చారిత్రక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. అయితే, ఇస్రో తొలుత ఈనెల 23న సాయంత్రం 5.47గంటలకు సాప్ట్ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించింది. అయితే, తాజాగా ఆ సమయంలో మార్పు చేసింది. 17 నిమిషాలు ఆలస్యంగా అంటే.. 23వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టనుంది. అయితే, తాజాగా రష్యా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలడం.. 23న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 జాబిల్లిపై కాలుమోపేందుకు రెడీ అవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 వైపే చూస్తున్నాయి.

ISRO Chandrayaan-3

ISRO Chandrayaan-3

ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు..

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్ -3 మరికొద్ది గంటల్లో జాబిల్లి దక్షిణ ఉపరితలంపై అడుగుపెట్టనుంది. అయితే, జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టే అద్భుత దృశ్యాలను ప్రతీఒక్కరూ వీక్షించే అవకాశాన్ని ఇస్రో కల్పించింది. అందరూ ఆ అద్భుత ఘట్టాన్ని తిలకించేలా లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించాలని ఇస్రో నిర్ణయించింది. 23వ తేదీ సాయంత్రం 5.27 గంటల నుంచి లైవ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్ చానల్, ఫేస్‌బుక్ పేజీ, డీడీ నేషనల్ చానల్ లో ఈ దృశ్యాలను వీక్షించవచ్చు.

 

మరోవైపు.. చంద్రయాన్ -3లోని ప్రొపల్షన్ మాడ్యూల్ శాస్త్రవేత్తల లక్ష్యానికి మించి సేవలు అందించనుంది. అందులో ఇంకా 150 కిలోల ఇంధనం మిగిలి ఉంది. ఇది ఇస్రో శాస్త్రవేత్తల అంచనాల కంటే చాలా ఎక్కువ. దీంతో ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలో సుదీర్ఘకాలం సేవలు అందించనుంది. చంద్రుడిని చేరే క్రమంలో దిద్దుబాట్లు అవసరమయ్యే ఆకస్మిక పరిస్థితులు చాలా వరకు ఎదురుకాకపోవడంతోనే ఇంధనం ఆదా అయినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.