Chandrayaan 3: జాబిల్లిపై అటు చైనా రోవర్ కదలికలు.. ఇటు భారత రోవర్.. ఏం జరుగుతోంది?

యుటు 2కి సంబంధించిన సమాచారాన్ని సేకరించి బ్లూమ్‌బర్గ్ పలు వివరాలు తెలిపింది. చైనా రోవర్ ఇప్పటికీ చంద్రుడిపై తిరుగుతోందని..

Chandrayaan 3: జాబిల్లిపై అటు చైనా రోవర్ కదలికలు.. ఇటు భారత రోవర్.. ఏం జరుగుతోంది?

Chandrayaan 3 - China

Chandrayaan 3 – China: చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా జాబిల్లి దక్షిణ ధ్రువం (South pole)పై ఇస్రో దింపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan rover) సమర్థంగా పరిశోధన కొనసాగిస్తున్నాయి. ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి పరిసరాల్లో తిరిగి డేటాను విక్రమ్ ల్యాండర్ కు పంపుతుంది. ఆ డేటాను ఇస్రో విశ్లేషిస్తోంది.

ప్రస్తుతం జాబిల్లిపై భారత్, చైనాకు చెందిన రోవర్లు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) 2019 జనవరి 3న చాంగ్-4 మిషన్‌లో భాగంగా యుటు 2 రోవర్ ను జాబిల్లిపైకి పంపింది. యుటు 2 రోవర్ తాజా సమాచారాన్ని చైనా కొద్దికొద్దిగా మాత్రమే ప్రకటిస్తోంది.

అయినప్పటికీ యుటు 2కి సంబంధించిన సమాచారాన్ని సేకరించి బ్లూమ్‌బర్గ్ పలు వివరాలు తెలిపింది. చైనా రోవర్ ఇప్పటికీ చంద్రుడిపై తిరుగుతోందని చెప్పింది. చైనా రోవర్ ప్రస్తుతం జాబిల్లి దక్షిణ ధ్రువానికి చెందిన ఐట్‌కెన్ బేసిన్‌లోని వాన్ కర్మాన్ క్రాటర్ (బిలం)లో ఉంది. 45.4561 ఎస్ అక్షాంశం, 177.5885 ఈ రేఖాంశం వద్ద అది ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పేర్కొంది.

China Yutu-2 rover on lunar surface

విక్రమ్ ల్యాండర్‌ను 69.367621 ఎస్, 32.348126 ఈ వద్ద ఇస్రో దింపింది. దీంతో చైనా యుటు 2 రోవర్, భారత్ ప్రజ్ఞాన్ మధ్య దూరం దాదాపు 1,948 కిలోమీటర్లని ఓ శాస్త్రవేత్త తెలిపారు. మరో శాస్త్రవేత్త తెలిపిన వివరాల ప్రకారం… చైనా, భారత్ రోవర్ల మధ్య దాదాపు 1,891 కిలోమీటర్ల దూరం ఉంది.

అయితే, ఈ రెండు రోవర్లు కలిసే అవకాశం లేదు. మన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై 500 మీటర్లు మాత్రమే తిరుగుతుంది. చైనా రోవర్ కూడా దిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఉంది. 2019 జనవరి 3 నుంచి చైనా రోవర్ యాక్టివ్ గా ఉన్నప్పటికీ, మన ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజులు మాత్రమే పనిచేస్తుంది.

చైనా జాబిల్లిపై శాంపిల్స్ సేకరించే ఉద్దేశంతో వచ్చే ఏడాది చాంగ్-6 మిషన్‌ చేపట్టనుంది. జాబిల్లిపై ప్రస్తుతం చంద్రయాన్-2 ఆర్బిటర్ తో పాటు మరో 5 ఆర్బిటర్లు పనిచేస్తున్నాయి. అందులో నాసా ఆర్టెమిస్ పీ1, పీ2 ప్రోబ్స్, లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్, దక్షిణ కొరియా పాత్‌ ఫైండర్ లూనార్ ఆర్బిటర్, నాసా క్యాప్‌ స్టోన్ ఉన్నాయి.

Chandrayaan 3: గుండె ఆగిపోయినంత పనైంది.. గోతిలో పడబోయిన రోవర్.. ఇస్రోతో ఆటలా చందమామ?