అంతా సిద్ధం : త్వరలో మార్కెట్‌లోకి కరోనా మెడిసిన్ “ఫవిపిరవిర్‌”

  • Published By: venkaiahnaidu ,Published On : July 24, 2020 / 03:11 PM IST
అంతా సిద్ధం : త్వరలో మార్కెట్‌లోకి కరోనా మెడిసిన్ “ఫవిపిరవిర్‌”

కోవిడ్‌-19 ట్రీట్మెంట్ లో ఉపయోగించే కీలక ఔషధం ఫవిపిరవిర్(Favipiravir) ‌ను ముంబైకి చెందిన ఫార్మా కంపెనీ- సిప్లా త్వరలో మార్కెట్‌లో ప్రవేశపెట్టనుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ( CSIR ) తెలిపింది.

వాస్తవానికి తక్కువ ఖర్చుతో కరోనా ఔషధాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎస్‌ఐఆర్‌ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. స్ధానికంగా లభ్యమయ్యే కెమికల్స్‌తో ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసిన సీఎస్‌ఐఆర్‌ ఆ తర్వాత దీని సాంకేతికతను సిప్లాకు బదలాయించింది.

అయితే.. ఈ మందు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉందని గురువారం సీఎస్ఐఆర్ అధికారికంగా తెలిపింది. ఈ మేరకు సీఎస్‌ఐఆర్‌-ఐఐసీఆర్‌ డైరెక్టర్‌ ఎస్‌. చంద్రశేఖర్‌ దినిపై మాట్లాడుతూ.. తాము అభివృద్ధి చేసిన ఔషధం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. తక్కువ వ్యవధిలోనే డ్రగ్‌ తయారీదారులు పెద్దసంఖ్యలో ఉత్పత్తి చేపట్టేందుకు ఈ ఔషధం అనువైనదని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌ బారినపడి స్వల్ప, మధ్యస్థ లక్షణాతో ఉండే రోగుల చికిత్సలో ఫవిపిరవిర్‌ మంచి ఫలితాలను అందిస్తున్నట్టు తెలిపారు. అయితే.. ఇది క్లినికల్‌ ట్రయల్స్‌‌లో కూడా మంచి ఫలితాలను కనబర్చింది

అయితే సిప్లా సంస్థ… ఈ ఔషధం ఫవిపిరవిర్‌ ఉత్పత్తిని ప్రారంభించేందుకు అనుమతుల కోసం డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ( DCGI )ను సంప్రదించింది. అంతకు ముందు డీసీజీఐ ఫవిపిరవిర్‌‌ను కరోనా అత్యవసర చికిత్సలో ఉపయోగించవచ్చని అదేశాలు ఇచ్చింది. కావున కోవిడ్ రోగులకు సాయమందించడానికి ఈ ఔషధం ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిప్లా తెలిపింది.