మోడీకి మమత లేఖ..ఆక్సిజన్ ట్యాంకులు,కోవిడ్ డ్రగ్స్ ను ట్యాక్స్ నుంచి మినహాయించండి

కోవిడ్ చికిత్సకు దిగుమతి చేసుకునే ఔషధాలు, వైద్య పరికరాలపై పన్నులను రద్దుచేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం

మోడీకి మమత లేఖ..ఆక్సిజన్ ట్యాంకులు,కోవిడ్ డ్రగ్స్ ను ట్యాక్స్ నుంచి మినహాయించండి

Mamata Banerjee

Mamata Banerjee కోవిడ్ చికిత్సకు దిగుమతి చేసుకునే ఔషధాలు, వైద్య పరికరాలపై పన్నులను రద్దుచేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, స్టోరేజ్ ట్యాంకర్లు, కోవిడ్ ఔషధాలను అందజేయడానికి పలు సంస్థలు, ధార్మిక సంఘాలు, వ్యక్తిగతంగానూ ముందుకొస్తున్నారని..ప్రైవేటు వ్యక్తుల సాయాన్ని ప్రోత్సహించడానికి వీటిపై జీఎస్టీ, కస్టమ్స్ సుంకం మినహాయించాలని ఆమె లేఖలో కోరారు.

ఈ వస్తువులను కస్టమ్స్ , ఎస్జీఎస్టీ, సీజీఎస్టీ,ఐజీఎస్టీ నుంచి మినహాయించాలని చాలా మంది దాతలు, ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాయి. ఈ ధరల విధించడమనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తున్నందున… ప్రాణాలను నిలిపే ఇటువంటి వాటిపై విధిస్తున్న పన్నులకు మినహాయింపునివ్వాలని తాను కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి విరాళాలు వైద్య వనరుల డిమాండ్, సరఫరాలో భారీ అంతరాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎంతో తోడ్పడతాయని మమతా నొక్కి చెప్పారు.

మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజుల్లోనే ప్రధాని మోడీకి మమతా రాసిన మూడో లేఖ ఇది. శుక్రవారం కూడా ఆక్సిజన్ కొరత గురించి మోడీకి ఓ లేఖ రాశారు. ఆరోగ్య మౌలిక పదుపాయాలను బలోపేతం చేసి, బెంగాల్ సహా దేశంలో కోవిడ్ రోగులకు అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని మమత కోరారు. తమ రాష్ట్రంలో ప్రస్తుతం మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ 470 మెట్రిక్ టన్నులకు చేరిందని, రాబోయే వారం పది రోజుల్లో ఇది 550 మెట్రిక్ టన్నులకు చేరుతుందని దీదీ రెండు రోజుల కింద రాసిన లేఖలో వివరించారు. రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను అంచనా వేసి, కేటాయింపులు చేసే కేంద్రం.. తమ అవసరాలను గుర్తించకుండా బెంగాల్‌లో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు పంపుతోందన్నారు.