Wrestlers detained: రెజ్లర్ల అరెస్టుపై తీవ్ర వ్యతిరేకత.. ఎవరెవరు ఏమన్నారంటే?

గతంలో మెడల్స్ సాధించినప్పుడు రెజ్లర్లతో మోదీ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోను షేర్ చేసిన ఆప్ ‘‘సిగ్గు తెచ్చుకోండి మోదీ. దేశం కోసం ప్రాణాలర్పించి పతకాలు సాధించిన క్రీడాకారులతో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?’’ అని ట్వీట్ చేశారు.

Wrestlers detained: రెజ్లర్ల అరెస్టుపై తీవ్ర వ్యతిరేకత.. ఎవరెవరు ఏమన్నారంటే?

Jantar Mantar: దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేస్తున్న రెజ్లర్లపై పోలీసుల అణచివేత, అరెస్టును నిరసిస్తూ విపక్షాలు సహా దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రెజ్లర్లను అరెస్ట్ చేసిన తీరు, వారితో పోలీసులు వ్యవహరించిన విధానంపై నెట్టింట్లో విమర్శలు కురపిపిస్తున్నారు. వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఛాంపియన్లను ప్రభుత్వం అవమానిస్తోందని, ఇబ్బందులకు గురి చేస్తోందంటూ మండిపడుతున్నారు.

ఎవరెవరు ఏమన్నారు?
ఢిల్లీ వుమెన్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ స్పందిస్తూ ‘‘విదేశీ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఈ కూతుళ్లను నేడు ఇలా ఈడ్చుకెళ్లి త్రివర్ణ పతాకాన్ని నడిరోడ్డుపై ఇలా అవమానిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు.

సాక్షి మాలిక్ ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘మన ఛాంపియన్లతో వ్యవహరిస్తున్న తీరు ఇది. ప్రపంచమంతా మనల్ని చూస్తోంది’’ అని ట్వీట్ చేశారు.

గతంలో మెడల్స్ సాధించినప్పుడు రెజ్లర్లతో మోదీ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోను షేర్ చేసిన ఆప్ ‘‘సిగ్గు తెచ్చుకోండి మోదీ. దేశం కోసం ప్రాణాలర్పించి పతకాలు సాధించిన క్రీడాకారులతో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?’’ అని ట్వీట్ చేశారు.

ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా స్పందిస్తూ ‘‘ఇది చూసి నాకు చాలా బాధగా ఉంది. వీరితో ఇంకోలా ప్రవర్తించాల్సి ఉంది’’ అని అన్నారు.

రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘‘పట్టాభిషేకం అయిపోయింది. ‘అహంకారి రాజు’ వీధుల్లో ప్రజావాణిని నలిపేస్తున్నారు!’’ అని రాసుకొచ్చారు.

‘‘ప్రపంచ విజేతలు, భారత పుత్రికలు, తమ ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారు. అయినా నిందితుడు అయిన రక్షణ పొందుతున్నాడు. భారత ప్రభుత్వం సిగ్గుపడాలి’’ అని శివసేన నేత ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.