Justice Nariman : జస్టిస్ నారీమన్ పదవీవిరమణ..న్యాయ సింహాన్ని కోల్పోయామన్న సీజేఐ

పలు కీలక తీర్పుల్లో భాగస్వామైన సుప్రీంకోర్టు సీనియ‌ర్ జడ్జి..జస్టిస్ రోహింగ్ట‌న్ ఫాలీ నారీమ‌న్ ఇవాళ రిటైర్ అయ్యారు.

Justice Nariman : జస్టిస్ నారీమన్ పదవీవిరమణ..న్యాయ సింహాన్ని కోల్పోయామన్న సీజేఐ

Nariman

Justice RF Nariman పలు కీలక తీర్పుల్లో భాగస్వామైన సుప్రీంకోర్టు సీనియ‌ర్ జడ్జి..జస్టిస్ రోహింగ్ట‌న్ ఫాలీ నారీమ‌న్ ఇవాళ రిటైర్ అయ్యారు.చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి అయిన నారీమన్.. తన పదవీకాలం చివరిరోజైన ఈరోజు(ఆగస్టు-12,2021) సీజేఐ ఎన్వీ రమణతో కలిసి కోర్టు హాల్ నంబర్-1లో కూర్చున్నారు. రిటైర్ అవుతున్న జడ్జిలు తమ చివరి రోజున ఈ హాల్లో కూర్చోవడం ఆనవాయతీగా వస్తోంది.

జస్టిస్ నారీమన్ కు వీడ్కోలు పలికే కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్ష‌ణం కొంత ఉద్విగ్నంగా ఉంద‌ని, నా ఆలోచ‌న‌ల్ని వ్య‌క్త‌ప‌ర‌చ‌డం ఇబ్బందిగా ఉంద‌ని సీజే ర‌మ‌ణ అన్నారు. నారీమన్​ పదవీ విరమణతో న్యాయవ్యవస్థకు రక్షణగా ఉన్న సింహాల్లో ఒకదాన్ని కోల్పోయినట్లు తాను భావిస్తున్నాని ఎన్వీ రమణ తెలిపారు. జస్టిస్‌ ఆర్​ఎఫ్​ నారీమన్‌ రూపంలో భారత న్యాయవ్యవస్థ అపార అనుభవమున్న ఓ న్యాయమూర్తిని కోల్పోయిందని ఎన్వీ రమణ అన్నారు. మన బలమైన న్యాయ వ్యవస్థకు ఆయ‌న ఒక పిల్ల‌ర్ అన్నారు. నారీమ‌న్‌ ఎల్ల‌ప్పుడూ న్యాయం వైపు నిల‌బ‌డ్డ‌ట్లు సీజేఐ చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన ఏడేళ్ల పదవీకాలంలో ఎన్నో చారిత్రక తీర్పులను నారీమన్​ వెలువరించారని పేర్కొన్నారు. 35 ఏళ్లపాటు విజయవంతంగా న్యాయవాదిగా సేవలందించిన జస్టిస్‌ నారీమన్‌.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఐదో లాయర్ అని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేశారు.

కాగా, ప్ర‌ఖ్యాత న్యాయ‌వాది ఫాలీ నారీమ‌న్ కుమారుడే రోహింగ్ట‌న్ నారీమ‌న్‌. హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దివిన జ‌స్టిస్ నారీమ‌న్ 35 ఏళ్ల పాటు న్యాయ‌వృత్తిలో కొన‌సాగారు. 37 ఏళ్ల వ‌య‌సులో సీనియ‌ర్ లాయ‌ర్‌గా సుప్రీంకోర్టులో రోహింగ్ట‌న్ నియ‌మితులైయ్యారు. 2011లో ఆయ‌న్ను సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియాగా నియ‌మించారు. 2014 జులై 7న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ నారీమన్‌.. తన ఏడేళ్ల కాలంలో 13,500 కేసులను పరిష్కరించారు. అందులో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి పోలీసులకు అరెస్ట్‌ చేసే అధికారమిచ్చే ఐటీ చట్టంలోని నిబంధన కొట్టివేత, స్వలింగ సంపర్కం నేరం కాదని, శబరిమల ఆలయంలో అన్ని వయసు మహిళల ప్రవేశం,క‌స్ట‌డీ మ‌ర‌ణాల విష‌యంలో పోలీసు స్టేష‌న్ల‌లో సీసీటీవీలు అమ‌ర్చడం వంటి చారిత్రక తీర్పులు ఉన్నాయి. కాగా,నేరుగా సుప్రీం జ‌డ్జిగా నియ‌మితులైన అయిద‌వ లాయ‌ర్ నారీమన్. భారత చరిత్రలో నేరుగా సుప్రీంకోర్టు జడ్జీలుగా ఇంతవరకు ఎనిమిది మంది లాయర్లు మాత్రమే నియమితులు కాగా, జస్టిస్ నారీమన్ వారిలో ఐదవ వ్యక్తి.