రాజధానిలో తగ్గిన ఉష్ణోగ్రతలు….71 ఏళ్ల కనిష్టానికి నమోదు

  • Published By: murthy ,Published On : November 30, 2020 / 11:07 PM IST
రాజధానిలో తగ్గిన ఉష్ణోగ్రతలు….71 ఏళ్ల కనిష్టానికి నమోదు

lowest temperature recorded in new delhi : దేశ రాజధానిని చలిపులి వణికిస్తోంది. నవంబర్ నెలలో గత 71 ఏళ్ళ లో ఎన్నడూ నమోదు కాని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనెలలో ఢిల్లీలో సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ)తెలిపింది. ఏడు దశాబ్దాల తర్వాత ఈ ఏడాది నవంబర్‌ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని..రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు సూచించారు.

సాధారణంగా ఢిల్లీలో నవంబర్‌ నెలలో సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12.9గా నమోదవుతూ ఉంటాయి. ఇప్పటివరకు నవంబర్‌లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు 1949 సంవత్సరంలో రికార్డయ్యాయి. అప్పుడు సరాసరి అత్యల్ప ఉష్ణోగ్రత 10.2 డిగ్రీలుగా ఉండగా….1938లో అత్యంత తక్కువగా 9.6 డిగ్రీలు, నమోదైంది. ఇక 1930లో 8.9 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.



గత సంవత్సరం నవంబర్‌ లో 15డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, 2018లో 13.4డిగ్రీలు, 2016, 2017లలో 12.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. 71ఏళ్ల తర్వాత ప్రస్తుతం అత్యల్ప ఉష్ణోగ్రతలతో ఈ నవంబర్‌ నెలలో రికార్డు అయ్యాయి. కాగా సోమవారం ఢిల్లీలో అత్యల్పంగా 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నవంబర్ లో ఇప్పటికే 8 సార్లు పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.



మరోవైపు రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూలో అత్యల్పంగా 2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చురు (5.5డిగ్రీలు), సిఖర్‌ (6.0డిగ్రీలు), బిల్వారా (8.0 డిగ్రీలు)లలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో ఉత్తర, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోవడంతో పాటు శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.