గుజరాత్ బీజేపీ కీలక నిర్ణయం..60 ఏళ్లు పైబడినోళ్లకు ఎన్నికల్లో టిక్కెట్లివ్వం

గుజరాత్ బీజేపీ కీలక నిర్ణయం..60 ఏళ్లు పైబడినోళ్లకు ఎన్నికల్లో టిక్కెట్లివ్వం

BJP tickets గుజరాత్‌ బీజేపీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు రాజకీయనాయకుల బంధువులకు, ఇప్పటికే మూడుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారికి పార్టీ తరపున నిల్చునేందుకు టికెట్లు ఇచ్చేది లేదని సోమవారం(ఫిబ్రవరి-1,2021) గుజరాత్ బీజేపీ ప్రెసిడెంట్ సీఆర్ పాటిల్ తెలిపారు.

రాష్ట్రంలో త్వరలో జరగబోయే మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి గుజరాత్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం గాంధీనగర్‌లోని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నివాసంలో జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, జిల్లా, తాలూకా, పంచాయతీల ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఎంపికచేయడానికి కసరత్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ టికెట్ల కోసం ఒత్తిడి పెరుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి.

కాగా, గుజరాత్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్థానిక సంస్థలకు పోలింగ్ తేదీలను ప్రకటించింది. మునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21 న పోలింగ్‌ జరుగుతుండగా..మునిసిపాలిటీలు,పంచాయతీలకు ఫిబ్రవరి-28 న ఎన్నికలు నిర్వహించనున్నారు. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 23న, మునిసిపాలిటీలు, పంచాయతీల ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి.