Operation Lotus In Goa : గోవాలో ఆపరేషన్ లోటస్ .. బీజేపీలో చేరిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఓ వైపు.. రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ యాత్ర చేస్తుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ చోడో అనుకుంటూ కమలదళంలో చేరిపోతున్నారు. హస్తం పార్టీ ఉనికే లేకుండా చేసే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ గోవాలో ఆపరేషన్ లోటస్ అమలు చేసింది చివరి నిమిషం దాకా ఎవరికీ డౌట్ రాకుండా.. 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగేసింది.

Operation Lotus In Goa : గోవాలో ఆపరేషన్ లోటస్ .. బీజేపీలో చేరిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Operation Lotus In Goa

Operation Lotus In Goa : ఓ వైపు.. రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ యాత్ర చేస్తుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ చోడో అనుకుంటూ కమలదళంలో చేరిపోతున్నారు. మరోవైపు.. బీజేపీ కూడా కాంగ్రెస్ తోడో పేరుతో.. హస్తం పార్టీ ఉనికే లేకుండా చేసే ప్రయత్నాల్లో ఉంది. లేటెస్ట్‌గా.. గోవాలో ఆపరేషన్ లోటస్ అమలు చేసింది బీజేపీ. చివరి నిమిషం దాకా ఎవరికీ డౌట్ రాకుండా.. 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగేశారు.

నార్త్ ఇండియా.. సౌతిండియా అనే తేడా లేదు.. కశ్మీర్‌, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలనూ వదల్లేదు. మహారాష్ట్ర, మణిపూర్, మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటక, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా.. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ అదే తీరు. అదే వ్యూహం. అదే రాజకీయం. ప్రాంతమేదైనా పొలిటికల్ పాలసీ ఒక్కటే. అధికారంలో ఉన్నామా? లేదా? అన్నదానితో సంబంధం లేదు. అసెంబ్లీలో బలాబలాలతో అవసరం లేదు. ఉన్నదల్లా ఒకటే టార్గెట్. అదే.. ఢిల్లీ నుంచి దేశంలోని ప్రతి గల్లీ దాకా కమల వికాసం. ప్రతిపక్ష పార్టీల నుంచి వీలైనంత మంది ఎమ్మెల్యేలను, నాయకులను కమలదళంలో చేర్చుకోవాలి. మిగతా అన్ని పార్టీలను బలహీనపర్చాలి. వీలైతే.. వాటి ఉనికినే లేకుండా చేయాలి. మొత్తం దేశంలో.. బీజేపీయే అత్యంత బలమైన పార్టీగా అవతరించాలి. పార్టీలో అత్యంత కీలకంగా, అత్యున్నత స్థానాల్లో ఉన్న నరేంద్రమోదీ, అమిత్ షా, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో.. కాషాయం పార్టీ అనుసరిస్తున్న అల్టిమేట్ స్ట్రాటజీ ఇది.

దక్షిణాదిలో ఒక్క కర్ణాటక మినహా.. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో ఆపరేషన్ లోటస్ అప్రతిహతంగా కొనసాగుతోంది. కమలం పార్టీ దెబ్బకు.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కకావికలమవుతోంది. ఢిల్లీ నుంచి ఇప్పుడిప్పుడే పక్క రాష్ట్రాల్లో బలపడుతున్న ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది. తాజాగా.. బీజేపీ నాయకత్వం కన్ను గోవాపై పడింది. ఆపరేషన్ లోటస్‌తో.. ఆ రాష్ట్రంలో మొత్తం పొలిటికల్ సీన్‌నే మార్చేసింది. కాంగ్రెస్‌కు ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోయారు. దీంతో.. అనర్హత వేటు కూడా వేసే వీలు లేకుండా పోయింది. వీరిలో గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్, అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్ మైఖేల్ లోబో కూడా ఉండడం హస్తం పార్టీలో కలకలం రేపుతోంది.

Kejriwal Fired Purchase Of Goa MLAs : గోవా ఎమ్మెల్యేల కొనుగోలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఫైర్

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత.. బీజేపీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో.. అధికార పార్టీ.. ఇక కాంగ్రెస్ జోలికి రాదని అంతా అమాయకంగా నమ్మారు. కానీ.. పవర్‌లోకి వచ్చిన కొన్ని నెలల్లోనే.. ఆపరేషన్ లోటస్ మొదలు పెట్టింది. రెండు నెలల క్రితమే.. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. హస్తానికి హ్యాండ్ ఇచ్చి.. కాషాయ కండువా కప్పుకునేందుకు తెగ ఉత్సాహం చూపించారు. అయితే.. హైకమాండ్ జోక్యంతో.. ఆ సంక్షోభం అప్పటి పూర్తికి చల్లారిపోయింది. కానీ.. మళ్లీ రెండు నెలలు తిరిగే సరికి.. సీన్, సిచ్యువేషన్.. రెండూ పూర్తిగా మారిపోయాయ్. దేశంలో ఐక్యత కోసం.. ఓ పక్క రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తుంటే.. గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం.. పార్టీ చోడో అనుకుంటూ.. కమలం పార్టీలో చేరిపోయారు.

కొన్ని నెలల క్రితమే గోవాలో మొదలుపెట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమవడంతో.. ఈసారి పక్కా స్కెచ్‌తో.. 8 మంది ఎమ్మెల్యేలను లాగేసింది బీజేపీ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీజేపీ సీఎం ప్రమోద్ సావంత్‌ను కలిసే దాకా.. ఎవ్వరికీ అనుమానం కూడా రాలేదు. అంత సీక్రెట్‌గా ఆపరేషన్ లోటస్ అమలు చేసేసింది కమలదళం. గోవాకు ముందు కూడా చాలా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నాలే చేసింది బీజేపీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సమయంలోనే.. దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల దాకా ఆఫర్ చేశారని.. అయినా తమ ఎమ్మెల్యేలు.. ఆప్‌ని వీడి వెళ్లలేదన్నారు కేజ్రీవాల్. చివరకు.. తనపై తానే విశ్వాస తీర్మానం పెట్టుకొని.. అసెంబ్లీ ఫ్లోర్ టెస్టులో.. మెజారిటీ నిరూపించుకున్నారు. ఆపరేషన్ లోటస్.. ఢిల్లీలో ఫెయిలైందని ప్రకటించారు.

తాజాగా.. పంజాబ్ విషయంలోనూ.. కేజ్రీవాల్ ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు. అక్కడున్న ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు.. కేంద్రం కుట్ర పన్నిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ లోటస్ కోసం.. ఢిల్లీ ఎమ్మెల్యేలకు ఇస్తామన్న మొత్తం కంటే ఎక్కువ.. పంజాబ్ ఎమ్మెల్యేలకు ఆఫర్ చేశారని తెలిపారు. ఒక్కో.. ఆప్ ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇస్తామని.. అలా పది మంది ఎమ్మెల్యేలకు బీజేపీ ఆఫర్ ఇచ్చిందని విమర్శించారు. కేజ్రీవాల్ ఆరోపణలను పక్కనబెడితే.. ఢిల్లీ, పంజాబ్‌లో తెరవెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ.. మహారాష్ట్రలో మాత్రం ఆపరేషన్ లోటస్ సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసింది కమలదళం. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో.. భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసేలా చేసి.. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేసి.. ఏక్ నాథ్ షిండేతో కలిసి కొత్త ప్రభుత్వం భాగస్వామ్యమైంది బీజేపీ.

ఇక.. మణిపూర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్.. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ కీలక పార్టీల్లో నాయకులను.. బీజేపీ లాగేస్తోంది. కండువా కప్పేస్తోంది. బీహార్‌లో నితీశ్ కుమార్ బీజేపీకి టాటా చెప్పి.. కాంగ్రెస్‌తో చేయి కలిపి.. కేంద్రంలో ఎన్డీయేకు తమ మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో.. బీహార్‌లో కొట్టిన దెబ్బకు.. మణిపూర్‌లో రివేంజ్ తీర్చుకుంది బీజేపీ. మణిపూర్‌లో గెలిచిన ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో.. ఐదుగురిని తమ పార్టీలోకి లాగేసింది కమలదళం. అలాగే.. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఏకైక జేడీయూ ఎమ్మెల్యే టెకా కాసో కూడా బీజేపీలో చేరిపోయారు.