Pinarayi Vijayan : కేరళ సీఎంగా పినరయి విజయన్ ప్రమాణం
కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు.

Pinarayi Vijayan
Pinarayi Vijayan కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. కొవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో విజయన్ చేత గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు. సీఎంతో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) నాయకులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్- యూడీఎఫ్ నేతలు సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉన్నారు.
ఈ సందర్భంగా సీఎం విజయన్‌తో పాటు మంత్రులకు గవర్నర్, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కేరళ సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన పినరయ్ విజయన్‌కి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కేరళ ముఖ్యమంత్రిగా విజయన్ బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా రెండోసారి. 76 ఏళ్ల విజయన్..కేరళలో నాలుగు దశాబ్దాల సంప్రదాయానికి కళ్లెం వేసి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ను వరుసగా రెండోసారి విజయతీరాలకు చేర్చి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ఇక, ఎల్డీఎఫ్లో భాగస్వామ్యపక్షాలైన జేడీఎస్, ఎన్సీపీకి చెందిన ఇద్దరు తప్ప.. మంత్రులంతా కొత్త వారే. ముగ్గురు మహిళలు విజయన్ కేబినెట్‌లో చేరారు. విజయన్ మేనల్లుడు పీఏ.మహమ్మద్ రియాజ్ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. కేరళ శాసనసభ చరిత్రలో మామ, అల్లుడు మంత్రివర్గంలో ఉండడం ఇదే తొలిసారి.