భారత్‌కు ‘క్వాడ్‌’ కానుక : ప్రపంచానికి ఇండియా టీకా

చైనాకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా జరిగిన క్వాడ్‌ మీటింగ్‌లో భారత్‌ వ్యూహం ఫలించింది. జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ప్రధానుల మధ్య వర్చువల్‌ గా జరిగిన ఈ సమావేశంలో భారత్‌కు కానుక అందించాయి మిగిలిన దేశాలు.

భారత్‌కు ‘క్వాడ్‌’ కానుక : ప్రపంచానికి ఇండియా టీకా

India

quad summit : చైనాకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా జరిగిన క్వాడ్‌ మీటింగ్‌లో భారత్‌ వ్యూహం ఫలించింది. జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ప్రధానుల మధ్య వర్చువల్‌ గా జరిగిన ఈ సమావేశంలో భారత్‌కు కానుక అందించాయి మిగిలిన దేశాలు. జాన్స్‌న్‌ అండ్‌ జాన్సన్‌ రూపొందించిన సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ని ఇండియాలో ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. ఉత్పత్తి బాధ్యతలు భారత్‌ తీసుకోగా దీనికి అవసరమైన నిధులను అమెరికా, జపాన్‌లు సమకూర్చనున్నాయి. మరో సభ్యదేశమైన ఆస్ట్రేలియా ఈ వ్యాక్సిన్‌ డోసులను ఇండో, పసిఫిక్‌ దేశాలకు సరఫరా చేయనుంది.

ఇండో – పసిఫిక్‌ ప్రాంతంలోని దేశాల అవసరాలను తీర్చేందుకు 2022 నాటికి వంద కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులలను ఉత్పత్తి చేయాలని క్వాడ్‌ సమావేశంలో తీర్మానించారు దేశాధినేతలు. అయితే క్వాడ్‌ పరిధిలో పనిచేసే వ్యాక్సిన్‌ యంత్రాంగం స్వతంత్రంగా పని చేయాలా? లేక ప్రపంచ ఆరోగ్యసంస్థ అమలుచేస్తున్న ‘కోవ్యాక్స్‌’ కార్యక్రమంలో భాగం కావాలా అనే అంశంపై దేశాలు నిర్ణయం తీసుకోలేదు. వ్యాక్సిన్‌ ఉత్పత్తితో పాటు వాతావరణ మార్పులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాబోతున్న నూతన టెక్నాలజీలను ఎలా వినియోగించాలనే అంశాలపై చర్చలు జరిగినట్టు ప్రధానీ మోదీ సమావేశం తర్వాత తెలిపారు. క్వాడ్ సభ్యదేశాలు ఏ పని చేసినా నాలుగు దేశాలకు లాభం చేకూర్చే విధంగానే ఉంటుందని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇండో – పసిఫిక్‌ రీజియన్‌లో చైనా దూకుడుకు కళ్లెం వేయడం లక్ష్యంగా క్వాడ్‌ దేశాలు పావులు కదుపుతున్నాయి.