సుప్రీం సంచలన తీర్పు : భ‌ర్త‌ను ఆ సందర్భంలో చంపితే హత్యకాదు

  • Published By: veegamteam ,Published On : January 28, 2019 / 12:15 PM IST
సుప్రీం సంచలన తీర్పు : భ‌ర్త‌ను ఆ సందర్భంలో చంపితే హత్యకాదు

తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
కుమార్తె ముందే భార్యను తిట్టిన భర్త
వ్యభిచారి అని తిడితే నేరం
భర్తను భార్య చంపేస్తే అది హత్య కాదు
అది ఓ నరహత్య అంతే..మర్డర్ కాదు

ఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ సందర్భంలో భ‌ర్త‌ను భార్య చంపితే అది మ‌ర్డ‌ర్ కాదని..దాన్ని ఓ న‌ర‌హ‌త్య‌గా మాత్రమే భావించాలని చెప్పింది. తమిళ‌నాడుకు సంబంధించిన ఓ కేసులో సుప్రీం ఈ తీర్పును ఇచ్చింది. కన్నకూతురు ముందే భార్యను అనరాని మాటలు అంటూ..భార్య‌ను కట్టుకున్న భర్తే వ్య‌భిచారి అని నిందించిన‌ప్పుడు.. ఆ మ‌హిళ త‌న భ‌ర్త‌ను చంపేస్తే అప్పుడు అది హ‌త్య కాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత స‌మాజంలో ఏ మ‌హిళ కూడా వ్య‌భిచారిని అని అనిపించుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌దని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

 

ఓ మ‌హిళ వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి భర్త భార్యతో ఘర్షణ పడ్డాడు. కూతురు ముందే తిరుగుబోతు, వ్యభిచారి అని భార్యను తిట్టాడు. దీంతో సదరు మహిళ, తన ప్రియుడితో కలిసి భర్తతో ఘర్షణ పడింది. భ‌ర్త‌ను హ‌త్య చేసింది. ఈ నేరాన్ని కోర్టు ముందు ఒప్పుకుంది. చెన్నై హైకోర్టు ఆ మ‌హిళ‌కు, ప్రియుడికి జైలు శిక్ష విధించింది. దీన్ని స‌వాల్ చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్ర‌యించింది.

ఆ కేసును విచారించిన జస్టిస్ శంత‌న్‌గౌడ‌ర్‌, దినేశ్ మ‌హేశ్వ‌రిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం జనవరి 28న సంచలన తీర్పునిచ్చింది. వ్యభిచారి అని సంబోధించడంతో మ‌హిళ ఆవేశానికి లోనైంద‌ని, భ‌ర్త‌పై దాడి చేసింద‌ని చెప్పింది. ఆ మ‌హిళ‌పై న‌మోదైన మ‌ర్డ‌ర్ కేసును కొట్టివేస్తూ దాన్ని క‌ల్ప‌బుల్ హోమిసైడ్‌గా తీర్పును మార్చింది. జైలు శిక్ష‌ను కూడా ప‌దేళ్ల‌కు త‌గ్గించింది.