మమతా బెనర్జీ ఆస్పత్రిలో చేరడంతో టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల వాయిదా

అసెంబ్లీ ఎన్నికల వేళ నందిగ్రామ్‌ ఘటన... బెంగాల్‌ పాలిటిక్స్‌ను కుదిపేస్తోంది. రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శివరాత్రి కావడంతో...ఇవాళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న టీఎంసీ.. ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.

మమతా బెనర్జీ ఆస్పత్రిలో చేరడంతో టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల వాయిదా

The release of the TMC manifesto postponed : నందిగ్రామ్‌లో జరిగిన తోపులాట, దాడిలో… బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి పలుచోట్ల గాయాలయ్యాయి. దీదీకి.. ఎడమ చీలమండ, పాదం, కుడి భుజం, ముంజేయి, మెడపై గాయాలున్నాయని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి SSKM వైద్యులు ధృవీకరించారు. ఎంఆర్‌ఐ స్కానింగ్ తీశాక గాయాలను నిర్ధారించిన వైద్యులు… ముఖ్యమంత్రి మమతా బెనర్జీని 48 గంటల పాటు పరిశీలనలో ఉంచుతామన్నారు. ఛాతి నొప్పితో బాధపడుతున్నట్లు, ఊపిరి పీల్చకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు దీదీ చెబుతున్నారని వైద్యులు తెలిపారు.

దాడి ఘటనలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి తీవ్రగాయాలయ్యాయని ఆ పార్టీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ కూడా ప్రకటించారు. దీదీ..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోను షేర్‌ చేసిన ఆయన… బీజేపీపై విరుచుకుపడ్డారు. బెంగాల్‌ ప్రజల శక్తిని మే 2 న వెల్లడయ్యే ఫలితాల్లో చూడాలన్నారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ నందిగ్రామ్‌ ఘటన… బెంగాల్‌ పాలిటిక్స్‌ను కుదిపేస్తోంది. రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శివరాత్రి కావడంతో…ఇవాళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న టీఎంసీ.. ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. షెడ్యూల్‌ ప్రకారం కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఇవాళ పార్టీ మేనిఫెస్టోను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రిలీజ్‌ చేయాల్సి ఉంది. అయితే.. నిన్న ఆమెపై దాడి జరగడం, ఆసుపత్రిలో వైద్య చికిత్స కొనసాగుతున్న తరుణంలో మేనిఫెస్టో విడుదల వాయిదాపడింది.

నిన్న నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసిన సీఎం మమతాబెనర్జీ.. శివాలయంలో పూజలు చేసి కారు ఎక్కేందుకు యత్నిస్తున్న సమయంలో తోపులాట జరగడం, ఆ తోపులాటలో మమతా కాలుకు గాయం కావడంతో దాడి జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. నలుగురైదుగురు వ్యక్తులు బలవంతంగా తనను తోసేసి కార్‌ డోర్‌ వేశారని, దీంతో కాలికి, పాదానికి బలమైన గాయమైందని దీదీ ఆరోపించారు. కాలు వాపుతో పాటు జ్వరం, గుండెనొప్పి లక్షణాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఈ ఘటన జరిగినప్పుడు జిల్లా ఎస్పీ, స్థానిక పోలీసులు లేరంటూ మమతా చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం చెలరేగింది.

తోపులాట, దాడి జరిగిన వెంటనే టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి జెడ్ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించారు. మమత ఎలా ప్రమాదానికి గురయ్యారో వెంటనే నివేదిక సమర్పించాలని సీఎస్‌ అలపన్‌ బందోపాధ్యాయను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మరోవైపు రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగాన్ని కూడా నివేదిక కోరింది. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు …నేడు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. ఇంతకీ తోపులాట జరిగిందా? దాడి జరిగిందా? ఏది నిజమనేది ఈ నివేదికలో తేలనుంది.

కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ వెళ్లి…ముఖ్యమంత్రిని పరామర్శించారు. ఆ సమయంలో గవర్నర్‌కు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీఎంసీ కార్యకర్తలు. గవర్నర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు మార్మోగాయి. టీఎంసీ ఆందోళనలపై బీజేపీ.. ఎదురుదాడికి దిగింది. ప్రజల్లో సానుభూతి పొందేందుకు చిన్న ప్రమాదాన్ని పెద్దదిగా చేసి చూపుతున్నారని మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు కమలనాథులు. మమతను ఎవరూ బలవంతంగా తోయలేదని, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు మమతా బెనర్జీపై ఎవ్వరూ దాడి చేయలేదని ప్రత్యక్ష సాక్షులు అభిప్రాయపడుతున్నారు. కారు డోరు తగలడంతోనే దీదీ కాలుకు గాయమైందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనాస్థలిలో ఏం జరిగిందన్నదానిపై దర్యాప్తు చేసిన పోలీసులు…నేడు ఇవ్వనున్న నివేదికలో ఏం ఉంటుందనేదే ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది.