Elections 2022: అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్.. కరెంట్ బిల్లులు చింపేయండి

ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(యూపీ ఎన్నికలు-2022) రాబోయే ఎన్నికలలో 100 మంది అభ్యర్థుల పేర్లను కూడా పార్టీ ప్రకటించింది.

10TV Telugu News

Uttar Pradesh polls 2022: ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(యూపీ ఎన్నికలు-2022) రాబోయే ఎన్నికలలో 100 మంది అభ్యర్థుల పేర్లను కూడా పార్టీ ప్రకటించింది. ఈ సంధర్భంగా ఆప్ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. 38 లక్షల కుటుంబాల విద్యుత్ బకాయి బిల్లులను మినహాయించి, 24గంటల విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది.

వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఉత్తరాఖండ్ మరియు గోవాలలో ఆప్ ఇదే వాగ్దానం చేసింది. ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోయాయని, ప్రజలకు కరెండ్ బిల్లులు చెల్లించడం చాలా కష్టంగా మారుతోందని, ఇటువంటి పరిస్థితిలో ప్రజలకు విద్యుత్తును ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మనీష్ సిసోడియా.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోయిన పేదలపై కఠినమైన నేరపూరిత కేసులను బనాయించారని, ఉత్తర ప్రదేశ్‌లో వందలాది కేసులు ఈమేరకు నమోదై ఉన్నాయని, విద్యుత్ బిల్లులు అందుకున్న తర్వాత సాధారణ ప్రజలు కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని పేర్కొన్నారు సిసోడియా. ఉత్తర ప్రదేశ్‌లో 38 లక్షల కుటుంబాలు విద్యుత్ బిల్లులు కట్టలేదని, వారిని నేరస్థులుగా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు సిసోడియా. ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేసి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అప్పటివరకు వచ్చిన కరెంటు బిల్లులు ఏవీ కట్టక్కర్లేదని సిసోడియా చెప్పారు.

రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం, ఆమ్ ఆద్మీ పార్టీ 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం ఇన్‌ఛార్జ్‌ల జాబితాను విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ఈ ఇన్‌ఛార్జ్‌లు కూడా అభ్యర్థులు కావచ్చునని సంజయ్ సింగ్ వెల్లడించారు. యూపీలో ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అత్యంత వెనుకబడిన అభ్యర్థులను 35 శాతం సీట్లలో నిలబెట్టింది, 16 మంది అభ్యర్థులను షెడ్యూల్డ్ కులాల నుంచి ప్రకటించగా, 20 మంది బ్రాహ్మణులు మరియు ముస్లిం అభ్యర్థులకు 5 స్థానాల్లో టిక్కెట్లు ఇచ్చారు.