Sengol: రాజదండం వెనుక రాజకీయ అడుగులు.. మోదీ పొలిటికల్ స్కెచ్.. అందుకేనా?

ప్రధాని మోదీ, బీజేపీ పొలిటికల్ స్కెచ్ తెలిసిన వారు రాజదండం ప్రతిష్ట.. ఆ సందర్భంగా జరిగిన తమిళ సంప్రదాయ పూజలను గమనిస్తే ఇదేదో పొలిటికల్ గేమ్ గా కనిపిస్తోందని అంటున్నారు.

Sengol: రాజదండం వెనుక రాజకీయ అడుగులు.. మోదీ పొలిటికల్ స్కెచ్.. అందుకేనా?

Sengol Political Strategy : కొత్త పార్లమెంట్లో ఠీవిగా కనిపిస్తున్న రాజదండం నిజంగా అధికార మార్పిడి చిహ్నమేనా? చోళుల హయాంలో అధికార మార్పిడికి సూచనగా వాడిన రాజదండం కొత్త పార్లమెంట్లో ప్రతిష్టించడానికి కారణమేమిటి? కొత్త పార్లమెంట్ (New Parliament) కు చోళుల పాలనకు ఉన్న లింకేంటి? దేశంలో ఎన్నో రాజ్యాలు.. సంప్రదాయాలు ఉండగా చోళ రాజుల(chola)పై ప్రధాని మోదీ (PM Modi)కి.. అధికార బీజేపీ (BJP)కి ఉన్న ఇంట్రెస్టేమిటి? ఉన్నపళంగా తమిళ సంప్రదాయం (Tamil Culture)పై కేంద్ర పెద్దలకు అంత మక్కువ ఎందుకొచ్చింది?

కొత్త పార్లమెంట్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్టించిన రాజ దండం పొలిటికల్ గా హాట్ టాపిక్ (hot topic) గా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాజదండంపై రకరకాల ప్రచారాలు జరిగాయి. బ్రిటిష్ పాలన (british rule) ముగింపు గుర్తుగా తొలి ప్రధాని నెహ్రూకు ఈ రాజదండాన్ని నాటి గవర్నర్ జనరల్ ఇచ్చారని కొందరు.. అది నెహ్రూ చేతి కర్ర అంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, సెంగోల్ గా చెప్పే ఈ రాజదండం చోళరాజుల పాలన కాలంలో అధికార మార్పిడి చిహ్నంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా.. చోళ రాజుల కాలంలో అధికార మార్పిడి చిహ్నంగా సెంగోల్ ను వాడినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తమిళ సంప్రదాయంలో భాగమైన ఈ సెంగోల్ ను ఇప్పుడు కొత్త పార్లమెంట్ లో ప్రతిష్టించాల్సిన అవసరమేమిటి అన్నదే ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న అతిపెద్ద.. ఆసక్తికరమైన అంశం.. ఒక భవనం నుంచి మరో భవనంలోకి పార్లమెంట్ మారుతుందని.. కాని… ఈ రాజదండం పార్లమెంట్లోకి అడుగు పెట్టడానికి అంతకు మించిన తంత్రమే ఉన్నదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ పొలిటికల్ స్కెచ్ తెలిసిన వారు రాజదండం ప్రతిష్ట.. ఆ సందర్భంగా జరిగిన తమిళ సంప్రదాయ పూజలను గమనిస్తే ఇదేదో పొలిటికల్ గేమ్ గా కనిపిస్తోందని అంటున్నారు.

బెంగాల్ మాదిరిగా తమిళనాడులోనూ..
మోదీ మార్కు రాజకీయం కోసం బాగా తెలిసిన వారు కూడా రాజదండం వెనుక రాజకీయ అడుగులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దేశం నలుమూలలా విస్తరించిన బీజేపీకి దక్షిణాదిలో బలపడటం చాలా పెద్ద సవాల్గా మారింది. ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకను కోల్పోయింది. కేరళ, తమిళనాడుల్లో బీజేపీ రాజకీయాలకు అసలు ఎలాంటి స్కోప్ కనిపించడం లేదు. కేరళలో వామపక్షం.. తమిళనాడులో హిందీ వ్యతిరేక భావజాలం బీజేపీని ఆయా రాష్ట్రాల్లో ఎదగనీయడం లేదు. గత 50 ఏళ్లలో తమిళనాడులో బీజేపీకి రెండు ఎంపీ సీట్లే దక్కాయి. ప్రస్తుత అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇలాంటి చోట పార్టీ విస్తరణపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి ప్రస్తుతం సమర్థుడైన అధ్యక్షుడిగా మాజీ పోలీసు అధికారి అన్నామలై దొరికారు. అన్నామలై దెబ్బతో ఈ మధ్యే డీఎంకే పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి అడ్డంగా బుక్కై.. రాజీనామా చేశాడు. బలమైన నేత ఉన్న చోట కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తే బెంగాల్ మాదిరిగా తమిళనాడులో కూడా బలపడొచ్చని భావిస్తోంది బీజేపీ.

చోళ సంస్కృతికి బీజేపీ పెద్ద పీట
బెంగాల్ థియరీ ఆశలు రేకెత్తించడంతో తమిళనాడులో బలపడే విషయమై ప్రయత్నిస్తున్న బీజేపీకి రాజదండం ఐడియా తోచిందని చెబుతున్నారు. చోళులు తమిళనాడు కేంద్రంగా సుమారు 1500 ఏళ్లు పాలించారని చెబుతున్నారు. శ్రీలంక, థాయ్లాండ్, మలేషియా, ఇండోనేషియాలను ఏలిన చోళులపై తమిళనాడు వాసులకు ఎంతో భక్తి, గౌరవం. అంతేకాదు హిందీ వ్యతిరేక భావజాలం ఉన్నా తమిళనాడులో 87 శాతం మంది హిందువులే ఉన్నారు. హిందుత్వ సిద్ధాంతాన్ని నమ్ముకున్న బీజేపీ తమిళనాడులో ఎదగాలనే ఆకాంక్షకు అధిక శాతం హిందువులు ప్రేరణగా నిలుస్తున్నారు. ఇన్నాళ్లు సమర్థుడైన నాయకుడు.. సరైన కారణం లేక ద్రవిడ రాజ్యంలో అడుగు పెట్టలేకపోయింది బీజేపీ. ఇదే సమయంలో తన ప్రయత్నాలను మాత్రం విరామం లేకుండా కొనసాగించింది. 2015 నుంచి తమిళనాడులో విస్తృత కార్యక్రమాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ కూడా తరచూ చోళ రాజుల ప్రస్తావన తెస్తోంది. చోళ సంస్కృతి హిందూ రాజ్య స్థాపనకు మూలమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా గతంలో పదేపదే చెబుతుండేవారు. ఇప్పుడు సమయం చూసుకుని చోళ సంస్కృతికి బీజేపీ పెద్ద పీట వేస్తుందని చాటిచెప్పేందుకు రాజదండాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ.

తమిళనాడులో బీజేపీ అడుగులకు దారులు
రాజదండం ప్రతిష్ట సందర్భంగా తమిళ పీఠాధిపతులతో ప్రత్యేక పూజలు చేయించడం.. తమిళ సంప్రదాన్ని పాటించడంతోపాటు తమిళంలో మాట్లాడి మోదీ ఆకట్టుకున్నారు. ఇంతకు ముందు కూడా మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కాశీ తమిళ సంగమం.. సౌరాష్ట్ర సదస్సు నిర్వహించి తమిళనాడులో బీజేపీ అడుగులకు దారులు వేసే ప్రయత్నాలు చేశారు ప్రధాని మోదీ. కర్ణాటక ఓటమితో నిరుత్సాహ పడకుండా.. అక్కడ పోతే.. ఇంకో చోట వెతుక్కోవచ్చని ఆ పని మరో దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో ప్రారంభించినట్లు చెబుతున్నారు పరిశీలకులు. అయితే గ్రామస్థాయిలో పార్టీ పునాధులు బలంగా లేకపోవడం వల్ల బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై 13 క్రిమినల్ కేసులు, డీకేపై 19 క్రిమినల్ కేసులు

బెంగాల్ ఫార్ములా ప్రకారం ప్రస్తుతానికి బలపడకపోయినా.. తన ప్రయత్నం ద్వారా తన మిత్రపక్షాన్ని ఈ ఎన్నికలకు బలోపేతం చేసి.. వచ్చే ఎన్నికల నాటికి ఆ స్థానం తాను ఆక్రమించుకోవాలని చూస్తోంది బీజేపీ. బెంగాల్లో కూడా వామపక్షాల స్థానాన్ని ఆక్రమించిన బీజేపీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా.. పార్లమెంట్ ఎన్నికల నాటికి గట్టిపోటీ ఇచ్చేస్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడంతో.. ఆ ఫార్ములా తమిళనాడులో కూడా వర్క్అవుట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. అందుకే తమిళనాడులో తమ అస్త్రశస్త్రాలను చాలా నేర్పుగా ప్రయోగిస్తోంది కమలదళం.

ఒక్కోరాష్ట్రంలో ఒక్కో ప్లాన్‌తో బీజేపీ అడుగులు.. వివరాలకు ఈ వీడియో చూడండి..