ఎంగిలి పూల బతుకమ్మ అంటే తెలుసా?

  • Published By: veegamteam ,Published On : September 27, 2019 / 11:36 AM IST
ఎంగిలి పూల బతుకమ్మ అంటే తెలుసా?

ఆడవారు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. సెప్టెంబర్ 28, 2019, శనివారం రోజు బతుకమ్మ వేడుకలు ప్రారంభమౌతాయి. అందరూ.. ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ అలరించే అరుదైన వేడుక ఈ బతుకమ్మ పండగ. మహాలయ అమవాస్యతో ప్రారంభమై 9 రోజుల పాటు ఘనంగా జరుగుతోంది. అయితే పరమేశ్వరుని సతి పార్వతిని దేశమంతా శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. ఒక తెలంగాణలో మాత్రం బతుకమ్మ రూపంలో ప్రకృతి మాతగా పూజిస్తారు.  
 
ఎంగిలి పూల బతుకమ్మ అంటే….?
బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను పవిత్రమైనవిగా భావిస్తారు. ఆ పూలను సమానంగా ఉండేలా పేర్చుతూ.. కాడలు నోటితో సమానంగా చించి బతుకమ్మను పేరుస్తారు. అలా చేసినప్పుడు పూలు ఎంగిలౌతాయి. ఇలా పూర్వ కాలంలో కూడా కొందరు మహిళలు నోటితో కొరికి పేర్చడంతో అప్పటి నుంచి పెత్రామాస సందర్భంగా ఆడే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. ఈ రోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. 

బతుకమ్మ రూపం ఇలా:
ప్లేట్లు లేదా తంబాలంలో బతుకమ్మను పేరుస్తారు. కింద గుమ్మడి లేదా బీర ఆకులను పరిచిన తర్వాత తంగేడు పూలను, గునుగు, గడ్డి, చామంతి తదితర తీరొక్క పూలతో పేరుస్తుంటారు. ఇలా పేర్చిన బతుకమ్మను పూజ గది ముందు ఉంచుతారు. సాయంత్రం వేళలో గల్లీల వద్ద పెట్టి మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుంటారు. ఇలా ఆడిన తర్వాత బతుకమ్మను తీసుకుని చెరువు గట్టు వద్దకు వెళ్లి మళ్లీ చెరువు గట్టు దగ్గర ఆడుతారు. అలా కాసేపు ఆడిన తర్వాత బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.