Ind VS Pak : ఆసియా కప్.. ఉత్కంఠపోరులో భారత్‌పై పాకిస్తాన్ విజయం

భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఇంట్రస్టింగ్ ఫైట్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Ind VS Pak : ఆసియా కప్.. ఉత్కంఠపోరులో భారత్‌పై పాకిస్తాన్ విజయం

Ind VS Pak : ఆసియా కప్ 2022 టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఇంట్రస్టింగ్ ఫైట్ జరిగింది. సూపర్-4లో చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్.. మరో బంతి మిగిలుండగా విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ 19.5ఓవర్లలో 182 పరుగులు చేసింది.

భారీ లక్ష్యఛేదనను పాక్ ధాటిగా ఆరంభించింది. పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మహమ్మద్ నవాజ్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. రిజ్వాన్ 51 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. నవాజ్ 20 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. వీరిద్దరూ పాక్ విజయంలో కీ రోల్ ప్లే చేశారు.

కెప్టెన్ బాబర్ అజామ్ 14, ఫకార్ జమాన్ 15 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, రవి బిష్ణోయ్, హార్ధిక్ పాండ్యా, యజువేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.

ఆఖరి ఓవర్‌లో పాక్ విజయానికి ఏడు పరుగులు అవసరం కాగా.. తొలి రెండు బంతులకే ఐదు పరుగులు రావడంతో భారత శిబిరంలో ఆశలు గల్లంతయ్యాయి. అయితే మూడో బంతికి పరుగు రాలేదు. నాలుగో బంతికి అసిఫ్ అలీని (16) అర్ష్‌దీప్‌ ఔట్ చేశాడు. దీంతో భారత శిబిరంలో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే ఐదో బంతికి ఇఫ్తికార్‌ అహ్మద్ (2*) రెండు పరుగులు చేయడంతో పాక్‌ విజయం ఖరారైంది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (60) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్‌ (28), కెప్టెన్ రోహిత్‌ శర్మ (28) ఫర్వాలేదనిపించినప్పటికీ భారీ స్కోర్‌ చేయలేకపోయారు. మధ్య ఓవర్లలో భారత బ్యాటర్లు వేగంగా పరుగులు చేయలేకపోయారు. దీంతో పాక్ పై మరింత భారీ స్కోర్ చేయడంలో విఫలం అయ్యారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్‌ రెండు వికెట్లు తీశాడు.

కాగా.. గ్రూప్ దశలోనూ ఇరు జట్ల మధ్య ఉత్కంఠభరితంగా పోరు సాగింది. ఆ మ్యాచ్ లో విజయం భారత్ నే వరించింది. కాగా, అప్పుడు ఎదురైన ఓటమికి సూపర్ 4లో ప్రతీకారం తీర్చుకుంది పాక్. సూపర్-4 దశలో టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను సెప్టెంబర్ 6న శ్రీలంకతో ఆడనుంది.