CSKvsMI: చెన్నైపై ముంబై భారీ విజయం

CSKvsMI: చెన్నైపై ముంబై భారీ విజయం

చేధనలో విఫలమైన చెన్నై.. ముంబై చేతిలో సొంతగడ్డపై చిత్తుగా ఓడింది. 156 పరుగుల లక్ష్య చేధనకు దిగిన చెన్నైను కట్టడి చేసిన ముంబై 46 పరుగుల తేడాతో గెలిచింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 10 వికెట్లు కోల్పోయి 109పరుగులు మాత్రమే చేయగలిగింది. టీంలో ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మురళీ విజయ్(38), బ్రావో(20), మిచెల్ శాంతర్(22) మాత్రమే పరవాలేదననిపించే స్కోరు నమోదు చేశారు. 

మిగిలిన బ్యాట్స్‌మెన్ షేన్ వాట్సన్(8), సురేశ్ రైనా(2), అంబటి రాయుడు(0), కేదర్ జాదవ్(6), ధ్రువ్ షోరె(5), దీపక్ చాహర్(0), హర్భజన్ సింగ్(1), ఇమ్రాన్ తాహిర్(0)లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమైయ్యారు. 

ముంబై బౌలర్లలో లసిత్ మలింగ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టగా, కృనాల్ పాండ్యా, బుమ్రా చెరో 2వికెట్లు తీయగలిగారు. హార్దిక్ పాండ్యా, అనుకుల్ రాయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ముంబై ఇన్నింగ్స్: 
అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు నష్టపోయి 155 పరుగులు బాదింది. ఓపెనర్‌గా దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (67; 48బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సులు)తో హై స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ క్వింటాన్ డికాక్(15), ఎవిన్ లూయీస్(32)పరుగులు చేశారు.

మిగిలిన బ్యాట్స్‌మెన్ కృనాల్ పాండ్యా(1), హార్దిక్ పాండ్యా(23), కీరన్ పొలార్డ్(13)పరుగులతో సరిపెట్టుకున్నారు. చెన్నై బౌలర్లు దీపక్ చాహర్(1), ఇమ్రాన్ తాహిర్(1), మిచెల్ శాంతర్(2) వికెట్లు తీయగలిగారు.