World Cup 2023 IND vs AFG ODI : రోహిత్ పెను విధ్వంసం.. అఫ్గానిస్థాన్ పై భార‌త్ ఘ‌న విజ‌యం..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని సాధించింది.

World Cup 2023 IND vs AFG ODI : రోహిత్ పెను విధ్వంసం.. అఫ్గానిస్థాన్ పై భార‌త్ ఘ‌న విజ‌యం..

World Cup 2023 IND vs AFG ODI

World Cup 2023 IND vs AFG : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 273 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 35 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ (131; 84 బంతుల్లో 16 ఫోర్లు, 5సిక్స‌ర్లు) సూప‌ర్ శ‌త‌కంతో అఫ్గాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. విరాట్ కోహ్లీ (55 నాటౌట్‌; 56 బంతుల్లో 6ఫోర్లు) హాప్ సెంచ‌రీతో రాణించ‌గా.. ఇషాన్ కిష‌న్ (47 ; 47 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. అఫ్గానిస్థాన్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు.

63 బంతుల్లోనే శ‌త‌కం.. ప్ర‌పంచ రికార్డులు..

ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు ఇషాన్ కిష‌న్‌తో క‌లిసి రోహిత్ శ‌ర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. మొద‌టి రెండు ఓవ‌ర్లు ఆచితూచి ఆడిన రోహిత్ మూడో ఓవ‌ర్‌లోని రెండో బంతికి ఫోర్ కొట్టి త‌న ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ఈ క్ర‌మంలో ఫారూఖీ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవ‌ర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్.. ఎనిమిదో ఓవ‌ర్ వేసిన‌ న‌వీస్ ఉల్ హ‌క్ బౌలింగ్‌లో ఓఫోర్ బాది 30 బంతుల్లోనే అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు.  ఆ త‌రువాత రోహిత్ మ‌రింత చెల‌రేగిపోయాడు.

ఎడాపెడా సిక్స‌ర్లు, ఫోర్లు బాదాడు. 63 బంతుల్లోనే సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. వ‌న్డేల్లో ఇది రోహిత్ శ‌ర్మ‌కు 31వ శ‌త‌కం కాగా.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో 7వది. ఈ శ‌త‌కంతో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక శ‌త‌కాలు చేసిన ఆట‌గాడిగా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. అంతేకాకుండా ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్యంత వేగంగా సెంచ‌రీ చేసిన భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

Rohit Sharma : సెంచరీల మోత.. స‌చిన్ రికార్డు బ్రేక్‌.. తుడిచిపెట్టుకుపోయిన క‌పిల్ దేవ్ 40 సంవ‌త్స‌రాల రికార్డు

ఓ వైపు రోహిత్ శ‌ర్మ దూకుడ‌గా ఆడుతుంటే మ‌రో వైపు ఇషాన్ కిష‌న్ స్ట్రైక్ రొటేట్ చేసే బాధ్య‌త‌ను తీసుకుని వీలైనంత ఎక్కువ‌గా రోహిత్ స్ట్రైకింగ్‌లో ఉండేలా చేశాడు. ఈ క్ర‌మంలో అర్థ‌శ‌త‌కానికి మూడు పరుగుల దూరంలో ఇషాన్ కిష‌న్ ఔట్ అయ్యాడు. ఇషాన్‌-రోహిత్ జోడి మొద‌టి వికెట్ కు 156 ప‌రుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. శ‌త‌కం త‌రువాత కూడా రోహిత్ అదే జోరును కొన‌సాగించాడు. అయితే.. 26వ ఓవ‌ర్‌లో భారీ షాట్‌కు య‌త్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ రెండు వికెట్లను కూడా ర‌షీద్ ఖాన్ ప‌డ‌గొట్టాడు. రోహిత్ ఔట్ అయ్యే స‌మ‌యానికి భార‌త స్కోరు 25.4 ఓవ‌ర్ల‌లో 205/2.

Pic @Bcci Twitter

Pic @Bcci Twitter

రోహిత్ ఔటైన‌ప్ప‌టికీ భార‌త్‌కు చింతించాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. అప్ప‌టికే భార‌త విజ‌యం ఖ‌రారైపోయింది. మిగిలిన లాంఛ‌నాన్ని శ్రేయ‌స్ అయ్య‌ర్‌ (25 నాటౌట్‌) తో క‌లిసి విరాట్ కోహ్లీ పూర్తి చేశాడు.

ఆదుకున్న హష్మతుల్లా, అజ్మతుల్లా..

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 272 ప‌రుగులు చేసింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో హష్మతుల్లా షాహిదీ (80; 88 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్ (62; 69 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్స‌ర్లు) లు హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా నాలుగు వికెట్లు తీయ‌గా, హార్ధిక్ పాండ్య రెండు, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాద‌వ్‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

Virat Kohli : న‌వీన్ ఉల్ హ‌క్ ర‌నౌట్ ఛాన్స్‌ను మిస్ చేసిన రాహుల్‌.. కోహ్లీ రియాక్ష‌న్ వైర‌ల్‌

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. రహ్మానుల్లా గుర్బాజ్(21), ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (16)లు త‌క్కువ స్కోరుకే వెనుదిర‌గ‌డంతో 63 ప‌రుగులకే మూడు వికెట్లు కోల్పోయి అఫ్గాన్ జ‌ట్టు క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ లు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్య‌త‌ను భుజాల‌పై వేసుకున్నారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడి నిల‌దొక్కుకున్నాక ప‌రుగులు వేట మొద‌లెట్టింది. వీరిద్ద‌రూ నాలుగో వికెట్ 121 ప‌రుగులు జోడించారు. ఆఖ‌ర్లో మ‌హ్మ‌ద్ న‌బీ (19), ర‌షీద్ ఖాన్ (16), ముజీబుర్ రెహ్మ‌న్ (10 నాటౌట్‌) త‌లా ఓ చేయి వేయ‌డంతో ఓ మోస్తరు ల‌క్ష్యాన్ని భార‌త్ ముందు ఉంచింది అఫ్గాన్.