ప్రైవసీ అప్‌డేట్ : ఎలాంటి ప్రశ్నలకైనా ఓపెన్‌గా సమాధానమిస్తాం: వాట్సాప్

ప్రైవసీ అప్‌డేట్ : ఎలాంటి ప్రశ్నలకైనా ఓపెన్‌గా సమాధానమిస్తాం: వాట్సాప్

WhatsApp Privacy Policy Update : యూజర్లు తమ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించాల్సిందేనని పట్టుబడుతున్న సోషల్ నెట్‌ వర్కింగ్ యాప్ వాట్సాప్ తాజా పరిణామాలపై స్పందించింది. కొత్తగా విడుదల చేసిన ప్రైవసీ పాలసీపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ప్రశ్నలకైనా వివరణ ఇస్తామని వాట్సాప్ వెల్లడించింది. భారత్ లో తమ యూజర్ల ప్రైవసీకి, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాత్ కార్ట్ స్పష్టం చేశారు.

మున్ముందు ప్రైవసీ అనేది మరింత వ్యక్తిగత విషయంగా మారుతుందని వివరించారు. ఇటు వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ యూజర్ల వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేదిగా ఉందని ఢిల్లీకి చెందిన చైతన్య రోహిల్లా అనే లాయర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. యూజర్ల వర్చువల్ కార్యకలాపాలపై వాట్సాప్ ఓ కన్నేసేందుకు నూతన ప్రైవసీ పాలసీ వీలు కల్పిస్తోందని ఆరోపించారు.

వాట్సాప్ ప్రైవసీ పాలసీపై తక్షణమే స్టే ఇవ్వాలంటూ పిటిషన్ లో కోరారు. వాట్సాప్ గతవారమే తన ప్రైవసీ పాలసీని అప్ డేట్ చేసింది. ఈ పాలసీని యూజర్లు అంగీకరించకపోతే ఫిబ్రవరి 8 నుంచి వారి మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది.