Telugu Academy : తెలుగు అకాడమీ కేసు విచారణలో నిందితుల కట్టుకథలు

తెలుగు అకాడమీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితులు... అధికారులకు 70ఎంఎం స్థాయిలో కట్టుకథలు చెప్పారు... వారు చెప్పిన వెర్షన్ వింటే ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే.

10TV Telugu News

Accused of lying in case trial : తెలుగు అకాడమీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితులు… అధికారులకు 70ఎంఎం స్థాయిలో కట్టుకథలు చెప్పారు… వారు చెప్పిన వెర్షన్ వింటే ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే. వారందరూ చెప్పిన కథలు, ఇచ్చిన కలరింగ్స్‌ చూస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే. ఖాకీల చెవుల్లోనూ పువ్వులు పెట్టేందుకు వారు చేసిన ప్రయత్నాలు గురించి తెలుసుకుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే.. క్యాష్‌ను కాల్చేశానని ఒకరు.. ఫ్రెండ్‌కు పెద్దమొత్తంలో అప్పుగా ఇస్తే అతడు పత్తా లేకుండాపోయాడని మరొకరు.. ఐదేళ్ల క్రితం చేసిన అప్పు అరకోటి అయిందని ఇంకొకరు.. ఇలా ఎవరికి తోచిన కథలు వాళ్లు అల్లేశారు. అబద్దాలను కూడా పోలీసులకు చాలా అందంగా వినిపించారు.

ఇప్పటివరకు అగ్నిప్రమాదాలు జరిగి ఇంట్లో దాచిన కరెన్సీ కాలిపోయిన విషయాల గురించి విన్నాం.. చూశాం. కానీ.. స్వయంగా తన స్వహస్తాలతో కరెన్సీ కట్టలను కాల్చేసిన మనిషిని మాత్రం చూడలేదు. అయితే.. ఆ పని తాను చేశానంటున్నాడు తెలుగు అకాడమీ కేసులో అరెస్టయిన ఓ నిందితుడు. వెయ్యి, రెండు వేలు కాదు.. ఏకంగా 80 లక్షల నగదును కాల్చేశానని చెబుతున్నాడు. ఖాకీలకే కట్టుకథలు వినిపించాడు.

China : చైనాలో వాట్సాప్‌, మెయిల్స్ వాడినందుకు ముస్లిం మహిళలు అరెస్ట్‌

సాయికుమార్‌ ముఠాతో తనకు పెద్దగా సంబంధాలు లేవంటూనే… తన వాటాగా వచ్చిన డబ్బును నెల రోజులు ఇంట్లోనే దాచుకున్నానని, అకాడమీ నిధుల గోల్‌మాల్‌పై పోలీసులు ఫోకస్ పెట్టడంతో అక్షరాలా 80 లక్షల నోట్ల కట్టలను కాల్చేశానని చెబుతున్నాడు. ఎవరూ నమ్మలేని ఈ కథను.. నిజమని నమ్మించే ప్రయత్నం చేశాడు. కరెన్సీని కాల్చేయాల్సిన అవసరమేంటని విచారణ అధికారులు ప్రశ్నిస్తే.. ఏమో అప్పుడలా అనిపించిందంతే అంటూ సింపుల్‌గా తేల్చేశాడు.

అతడొక్కడే కాదు.. విచారణకు హాజరైన నిందితులందరూ ఇలాంటి నమ్మశక్యంకాని విషయాలే చెప్పినట్టు సమాచారం. ఓ స్నేహితుడికి అవసరానికి 20 లక్షలిస్తే… ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడని ఒకరు… ఐదేళ్ల క్రితం చేసిన అప్పు ఇప్పుడు 50 లక్షల రూపాయలయిందని.. దానిని ఇటీవలే చెల్లించానని ఇంకొకరు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వీరంతా.. ఆస్తుల సీజ్‌కు భయపడే ఇలాంటి అబద్ధాలను అవలీలగా చెప్పేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. వారిని మళ్లీ కస్టడీకి తీసుకుని వారి నుంచి నిజాలు కక్కించాలని నిర్ణయించారు.

Tragedy : పండగ పూట విషాదం.. జలపాతంలో దిగి ఇద్దరు విద్యార్థులు మృతి

మరోవైపు నిందితులు దారిమళ్లించిన సొమ్ము స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిందితులు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో వేర్వేరు మార్గాల్లో వివరాలు సేకరించారు. కొందరు ఫ్లాట్లు, స్థలాలు కొనుగోలు చేసినట్టు, మరికొందరు వారి పిల్లల పేర్లమీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసినట్టు తెలుసుకున్నారు. ఇంకొందరు నగదును వేర్వేరు బ్యాంకుల్లో తమ స్నేహితులు, పరిచయస్తుల ఖాతాల్లో జమ చేసినట్టు గుర్తించారు. మొత్తంగా 14 మంది నిందితుల నుంచి 17 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తి పత్రాలు, 3 కోట్ల నగదును ఇప్పటివరకు దర్యాప్తు బృందం స్వాధీనంచేసుకుంది