Statue of Equity: ఫిబ్రవరి 2 నుంచి.. వైభవంగా రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగ..!

కుల, మతాల జాఢ్యం నుంచి సమాజాన్ని మేల్కొలిపిన రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగను.. ఫిబ్రవరి 2 నుంచి వైభవంగా నిర్వహించనున్నట్టు ఆధ్యాత్మిక వేత్త.. చిన్నజీయర్ స్వామి తెలిపారు.

Statue of Equity: ఫిబ్రవరి 2 నుంచి.. వైభవంగా రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగ..!

Chinna Jeeyar Swamy

Statue of Equity: కుల, మతాల జాఢ్యం నుంచి సమాజాన్ని మేల్కొలిపిన రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగను.. ఫిబ్రవరి 2 నుంచి వైభవంగా నిర్వహించనున్నట్టు ఆధ్యాత్మిక వేత్త.. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వెల్లడించారు. దేశ చరిత్రలో బంగారు ఇతిహాసాన్ని రచించిన మహానుభావుడు శ్రీ రామానుజాచార్యులు అని చెప్పారు. సమతా స్ఫూర్తికి ఆకారం రామానుజాచార్యులని అన్నారు. కొవిడ్ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి 1035 కుండాలతో మహా యజ్ఞాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు.

మనుషులు, మతాల మధ్య ఉన్న అంతరాలపై జీయర్ స్వామి.. ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక వ్యక్తి.. మరో వ్యక్తిని గౌరవించుకోలేకపోతున్నారు. మతాల మధ్య గౌరవం, ఆదరణ లేకుండా పోతోంది. ఒకే మతానికి చెందినవారైనా.. కలిసి జీవించలేకపోతున్నారు. అందుకే.. శతాబ్దాల క్రితం రామానుజాచార్యులు.. సమానత అనే వ్యాక్సిన్ ను సమాజానికి అందించారు. సమాజంలో రకరకాల విశ్వాసాలు ఉంటాయి. కానీ.. మనిషి లోపని అహంకారం వల్లే రుగ్మతలు బయటపడతాయి.” అని చిన్న జీయర్ స్వామి చెప్పారు.

ప్రతి ఒక్కరి సిద్ధాంతం శ్రమించడం, సాధించడంగా ఉండాలని రామానుజాచార్యులు చెప్పారన్నారు. అబద్ధాల సమాజంలో బతకొద్దని.. మానవ సేవతో పాటు.. నీటిని కాపాడాలని, భూమిని కలుషితం చేయవద్దని.. సర్వప్రాణి సేవ చేయాలని రామానుజాచార్యులు బోధించారని తెలిపారు. మన శరీరంలో ఏ భాగాన్నీ తక్కువ చేసుకోము అని.. అలాంటప్పుడు ప్రపంచంలో ప్రతి విషయం ముఖ్యమైనదే అని స్పష్టం చేశారు.

“భగవంతుడి దృష్టిలో మనమంతా సమానమే. ఒకరిపై ఉదాసీనత, మరొకరిపై పక్షపాతం అనేది భగవంతుడు చూపడు. ప్రజలందరినీ ఒకేలా చూసే భగవంతుడు.. అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తాడు. ఇదే విషయాన్ని రామానుజాచార్యులు ప్రపంచానికి తెలిపారు. అందుకే.. ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకే.. 216 అడుగుల ఎత్తైన రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెస్తున్నాం. రామానుజాచార్యులు రచించిన గ్రంథాలన్నింటినీ సులభంగా అర్థమయ్యే ఏర్పాటు చేస్తున్నాం. రామానుజులవారు అంత మహోన్నత వ్యక్తిగా ఎదగడానికి శ్రీ వైష్ణవ దివ్యదేశాలైన 108 క్షేత్రాలు స్ఫూర్తి కలిగించాయి. ఆ స్ఫూర్తి మరింతమందికి కలిగించాలన్న లక్ష్యంతో.. రామానుజుల మహా విగ్రహం చుట్టూ ఆ ఆలయాల నమూనాలను ఏర్పాటు చేస్తున్నాం. ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యాచరణ చేశాం. ఇది సామాన్యమైన విషయం కాదు” అని చిన జీయర్ స్వామి తెలిపారు.

ఫిబ్రవరి 2 నుంచి రామానుజుల సహస్రాబ్ది వేడుకను శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్ గ్రామంలో ఉన్న తన ఆశ్రమంలో.. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి నిర్వహించనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. మరింత మంది ప్రముఖులు హాజరు కానున్నారు. రామానుజుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణంలో నిర్మించిన శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల ఆలయాల నమూనాలను.. భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వేడుకల్లో భాగంగా… భారీ ఏర్పాట్ల నడుమ.. వేలాది మంది రుత్వికులు మహా యాగాన్ని నిర్వహించనున్నారు. లోకకల్యాణార్థం ఈ మహా క్రతువును నిర్వహిస్తున్న చిన్న జీయర్ స్వామి.. కార్యక్రమ విశేషాలను, అంతరార్థాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు.