పచ్చి బాలింతను ఊళ్లోకి రానివ్వని గ్రామస్తులు..పసిగుడ్డుతో 6 రోజులు చెట్టుకిందే: వివక్షకు పరాకాష్ట 

  • Published By: nagamani ,Published On : May 21, 2020 / 08:16 AM IST
పచ్చి బాలింతను ఊళ్లోకి రానివ్వని గ్రామస్తులు..పసిగుడ్డుతో 6 రోజులు చెట్టుకిందే: వివక్షకు పరాకాష్ట 

అమ్మపై ఆంక్షలు. పసిగుడ్డును ఎత్తుకుని సొంత ఇంటికి వస్తున్న ఓ పచ్చి బాలింతను ఊర్లో అడుగు పెడితే ఊరుకునేది లేదని..వస్తే ఊరుకోమని కఠినంగా చెప్పి ఊరు పొలిమేరల్లోనే అడ్డుకున్నారు గ్రామస్తులు. దీనికంతటికి కరోనా భయమేనంటు ఓ అమ్మపట్ల కఠినాతికఠినంగా ప్రవర్తించారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాజులగూడవాసులు. 

కరోనా భయంతో కొంతమంది మానవత్వాన్నే మరచిపోతున్నారు. కరోనా రోగులపై వివక్ష చూపిస్తున్న ఘటనల గురించి వింటున్నాం. కానీ అప్పుడే పుట్టిన పసిగుడ్డుని తీసుకుని ఇంటికి వస్తున్న మహిళను ఊరి బైటే అడ్డుకున్నారు గ్రామస్తులు. బొప్పరికుంట పంచాయతీలోని రాజులగూడకు చెందిన జైతు, అనసూయలు పొట్టకూటికోసం  కరీంనగర్ వలస వెళ్లారు. 

మే 14న కరీంనగర్ లోనే అనసూయ  పాప పుట్టింది. లాక్ డౌన్ తో ఉపాధి కరువై సొంత ఊరికి చేరుకుందామని బయలుదేరారు. అలా నడుచుకుంటూ..15కి సొంతూరు చేరుకోగా.. స్థానికులు వారిని గ్రామంలోకి రానివ్వలేదు. 

మీకు కరోనా ఉందేమో..మీ పాపకు కూడా ఉందేమో..మీరిప్పుడు ఊర్లోకి వస్తే మాక్కూడా వస్తుంది. కాబట్టి మీరు ఊర్లోకి రావటానికి వీల్లేదని తెగేసి చెప్పేశారు. దీంతో దంపతులిద్దరు ‘‘పసిబిడ్డతో మళ్లీ వెనక్కి వెళ్లలేం..అలాగని ఇలా ఇక్కడ ఉండలేం..దయచేసి మా ఇంటికి మమ్మల్నిపోనీయండి’’..అంటూ బతిమాలుకున్నారు. కానీ గ్రామస్తులు వినలేదు.  రావటానికి వీల్లేదన్నారు. దీంతో ఊరి చివరన ఓ చెట్టు కింద గుడారం వేసుకొని గత ఆరు రోజులు ఉన్నారు. 

ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైద్య సిబ్బంది బుధవారం (మే 20,2020)న రాజులగూడకు చేరుకుని ..తల్లీబిడ్డకు వైద్యపరీక్షలు చేశారు. వాళ్లు పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని తేల్చారు. తరువాత  గ్రామస్థులను ఒప్పించి ఇంట్లోనే క్వారంటైన్లో ఉండే ఏర్పాట్లు చేశారు. అనసూయ, జైతు దంపతులకు క్వారంటైన్ ముద్ర వేసి ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించటం పరిస్థితి చక్కబడింది.