MLC Kavitha On ED Notice : టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.. ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ నుంచే దుష్ప్రచారం అని ఆగ్రహం

తనకెవరూ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచే దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించిన కవిత.. మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.

MLC Kavitha On ED Notice : టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.. ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ నుంచే దుష్ప్రచారం అని ఆగ్రహం

MLC Kavitha On ED Notice : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకెవరూ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచే దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించిన కవిత.. మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. మీడియా తమ టైమ్ వేస్ట్ చేసుకోకుండా నిజాలను ప్రసారం చేయాలని రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్సీ కవిత.

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సీఎం కేసీఆర్​ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందనే వార్తలు సంచలనం రేపాయి. కవిత ప్రస్తుతం కరోనాతో క్వారంటైన్ లో ఉండటంతో ఆ నోటీసులను కవిత సహాయకులకు అందజేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఈడీ అధికారులు నోరు విప్పలేదు. కాగా, తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ మీడియాలో వార్తలు రావడంపై ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. అసలు తనకు ఈడీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ట్విటర్ లో తేల్చి చెప్పారు. మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన కవిత.. మీడియా నిజాలు రాయాలని రిక్వెస్ట్ చేశారు.

”ఈడీ నుంచి నాకు ఎలాంటి నోటీసులు అందలేదు. ఈ వాస్తవాన్ని వెల్లడించడం ద్వారా టీవీ ప్రేక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేయాలనుకుంటున్నా. ఢిల్లీలో కూర్చుని దుష్ప్రచారం చేస్తున్న కొందరు వ్యక్తులు మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసేకంటే వాస్తవాలనే ప్రచారం చేస్తూ మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా సంస్థలన్నింటిని కోరుతున్నా” అని కవిత అభ్యర్థించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా ఏక కాలంలో ఐదు రాష్ట్రాల్లో 40కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వీటిలో 20 స్థానాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నెల్లూరులో మద్యం వ్యాపారులు, పంపిణీదారులు, సరఫరా గొలుసు నెట్‌వర్క్‌లకు సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల బృందాలు హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నాయి. తాజా సోదాలకు అనుబంధంగా మొత్తం 12 మంది వ్యక్తులకు, 18 కంపెనీలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అందులో కవిత పేరు కూడా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. రైడ్స్ కోసం ఢిల్లీ నుండి మొత్తం 68మంది ఈడీ అధికారులు వచ్చారు. ఈడీ నుంచి నోటీసులు జారీ అయిన వారిలో 11 మంది పేర్లు బయటకు తెలిశాయి. కాగా, 12వ వ్యక్తి వివరాలు మాత్రం బయటకు తెలియనీయడం లేదు.

 

ఈడీ నోటీసులపై కవిత రియాక్షన్