Amit Shah On Dalit CM : టీఆర్ఎస్‌ను గెలిపిస్తే దళితుడు సీఎం కాడు.. కేటీఆర్ సీఎం అవుతాడు-అమిత్ షా

అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని, దళితులను మోసం చేశారని అమిత్ షా ఆరోపించారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే దళితుడు ముఖ్యమంత్రి కాడని, కేటీఆర్ సీఎం అవుతాడని అమిత్ షా అన్నారు.

Amit Shah On Dalit CM : టీఆర్ఎస్‌ను గెలిపిస్తే దళితుడు సీఎం కాడు.. కేటీఆర్ సీఎం అవుతాడు-అమిత్ షా

Amit Shah On Dalit CM : మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. అధికార, విపక్షాల మధ్య మాటల యద్ధం తారస్థాయికి చేరింది. అధికార, విపక్ష పార్టీలు పోటాపోటీ సభలతో హోరెత్తిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రజాదీవెన పేరుతో మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీలపై నిప్పులు చెరిగారు. ఈడీనా బోడీనా… ఏం పీక్కుంటావో, పీక్కో అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టే బీజేపీ కావాలో, మీటర్లను వ్యతిరేకించే టీఆర్ఎస్ కావాలో తేల్చుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మునుగోడులో బీజేపీకి ఓటు పడిందంటే బాయి కాడ మీటర్ పడ్డటే అన్నారు కేసీఆర్.

ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. మునుగోడులో బీజేపీ బహిరంగ సభలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై అమిత్ షా నిప్పులు చెరిగారు. కుటుంబ పాలన వల్ల తెలంగాణ నష్టపోతోందన్న అమిత్ షా.. కేసీఆర్ పాలనను పడగొట్టడానికి ఇది ప్రారంభమని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ సీఎం ఉంటారని షా ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వచ్చారని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో కేసీఆర్ మాట తప్పారని షా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు.

అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని, దళితులను మోసం చేశారని అమిత్ షా ఆరోపించారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే దళితుడు ముఖ్యమంత్రి కాడని, కేటీఆర్ సీఎం అవుతాడని అమిత్ షా అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అబద్ధం చెప్పారని విమర్శించిన షా.. బీజేపీ అధికారంలోకి వస్తే దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించినప్పటికీ… కేసీఆర్ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదని అన్నారు. ప్రధాని రైతు బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదని చెప్పారు.

మునుగోడు బహిరంగ సభలో కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు అమిత్ షా. జిల్లాకో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిని నిర్మాస్తామని కేసీఆర్ చెప్పారని… నల్గొండకు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి వచ్చిందా అని ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామన్నారు. అందరికీ వచ్చాయా? అని అడిగారు. గిరిజనులకు భూములు ఇస్తామని కేసీఆర్ చెప్పారని… ఒక్క ఎకరా అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు అమిత్ షా.