నల్లమల అడవిపై అక్రమార్కుల కన్ను..టూరిజం పేరుతో గుప్త నిధుల వేట

నల్లమల అడవిపై అక్రమార్కుల కన్ను..టూరిజం పేరుతో గుప్త నిధుల వేట

Illegal excavations in Amrabad Reserve Forest : నల్లమల అడవి అంటేనే నిధులకు నిక్షేపాలు నిలయం. అలాంటి అడవిని అక్రమార్కులు టార్గెట్ చేశారా… గుప్తనిధుల తవ్వకాలు జరుగుతున్నాయా.. టూరిజం పేరుతో గుప్తనిధుల వేట జరుగుతోందా.. అంటే అవుననే అంటున్నారు స్థానికులు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ సమీపంలో నల్లమల అడవిలో 14వ శతాబ్దంలో కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన కోట ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతం వెంబడి నల్లమల అడవిలో దాదాపు 300 కిలోమీటర్ల పోడవున ప్రతాపరుద్రుని కోట ఉంది. ఆ కోట ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు మార్గం ఏర్పాటు చేసింది. టూరిజం పేరుతో కోట మరమ్మత్తు పనులు చేపట్టారు అధికారులు.

అభివృద్ధి చేయడం వరకు బానే ఉంది కానీ… ఆ ముసుగులో గుప్త నిధుల తవ్వకాలకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోకి అడుగు పెట్టాలంటే అటవీశాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అంత సులువుగా అనుమతులు లంభించవు. మేతకోసం పశువులను అడవిలోకి తీసుకెళ్తేనే రైతులపై అటవీశాఖ అధికారులు కేసులు పెడతారు. స్థానికులు వంట చేయడానికి కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్లినా వదిలిపెట్టకుండా భారీ జరిమానాలు విధిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో… చాలా ప్లేసుల్లో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదంతా గుప్త నిధుల కోసమే చేశారంటున్నారు స్థానికులు.

సామాన్యుల పట్ల కఠినంగా వ్యవహరించే అధికారులు.. అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడుతున్న వారిపట్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం అంతా కొందరు రాజకీయ నాయకుల అండదండలతో జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పొలిటికల్‌ సపోర్ట్‌తో గుప్తనిధులు స్వాహా చేసే కుట్ర జరుగుతోందని స్థానికులంటున్నారు.

నల్లమలలో గుప్తనిధుల తవ్వకాలు కొత్తేమీ కాదు. గతంలోనూ చాలాసార్లు జరిగాయి. అడవిలోని దేవాలయాలు, విగ్రహాలు నేలమట్టం చేసిన సందర్భాలూ ఉన్నాయి. గతంలో భౌరపూర్‌లో అమ్మవారి గుడిలో కూడా గుప్తనిధుల తొవ్వకాలు నిర్వహిస్తుండగా.. స్థానికంగా ఉండే చెంచులు పట్టుకొని అటవీశాఖ అధికారులకు అప్పటించారు. నల్లమలలో వజ్రాలు, బంగారం ఉన్నాయని ఎక్కడో ఒక చోట తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, టూరిజం పనుల పేరుతో.. గుప్తనిధుల కోసం జేసీబీతో తవ్వకాలు చేపట్టారని అంటున్నారు స్థానికులు. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.