నేరస్తుల ఆటలు సాగవ్.. వరంగల్ కోర్టుల్లో ఎక్కువ ఉరిశిక్షలు!

  • Published By: sreehari ,Published On : October 30, 2020 / 06:44 PM IST
నేరస్తుల ఆటలు సాగవ్.. వరంగల్ కోర్టుల్లో ఎక్కువ ఉరిశిక్షలు!

Warangal courts : కోర్టు కేసులంటే ఏళ్లకు ఏళ్లు సాగుతుంటాయనే విమర్శలను పటాపంచలు చేస్తున్నాయి వరంగల్‌ కోర్టులు. నేరాలు చేయాలనే వారి గుండెల్లో దడ పుట్టిస్తూ .. బాధితులకు నేనున్నాను.. అనే భరోసా ఇస్తున్నాయి న్యాయస్థానాలు. ఏడాది వ్యవధిలో వరంగల్‌ కోర్టులు .. ఇద్దరు నేరస్తులకు ఉరి శిక్ష విధించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హట్‌టాపిక్‌గా మారింది.



నేరము – శిక్ష విషయంలో వరంగల్ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు వెలువరిస్తున్న తీర్పులు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతున్నాయి.

చట్టాన్నిఅతిక్రమించి నేరాలు చేస్తే దండించేందుకు సిద్ధంగా ఉన్నామనే సందేశాన్ని కోర్టులు సమాజానికి అందించాయి.

మత్తుమందు ఇచ్చి 9 మందిని పాశవికంగా హత్య చేసిన గొర్రెకుంట కేసులో మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేసి నేరస్థుడిని కఠినంగా శిక్షించింది. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని వేగంగా సాక్షులను విచారించింది.

పోలీసులు సమర్పించిన 485 పేజీల చార్జీషీట్‌ను, 173 పత్రాలను పూర్తిగా పరిశీలించింది.

చివరకు అతడు చేసిన నేరానికి ఉరే సరి అని తీర్పు ఇచ్చింది. అంతకు ముందు శ్రీహిత కేసులో కోర్టు ఇలాగే స్పందించింది.

తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం చేసి చంపడంతో.. ఈ కేసులో సున్నితత్వాన్ని కోర్టు గుర్తించింది.



పోలీసులు ఛార్జీ షీట్‌ సమర్పించిన తర్వాత 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చింది. ఈ వ్యవధిలో ఏడు సార్లు ఈ కేసుపై కోర్టు వాదోపవాదాలు విన్నది. 30 సాక్షులను విచారించింది.

చివరికి నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష ఖరారు చేసింది. నేరం జరిగిన తర్వాత కేవలం 48 రోజుల్లోనే బాధితురాలి కుటుంబానికి చట్టపరంగా న్యాయం జరిగింది.

ఉరి శిక్షలు విధించడంలోనే కాదు బాధితులకు న్యాయం చేయడంలోనూ వరంగల్‌ న్యాయస్థానాలు ముందున్నాయి.

2017 డిసెంబరులో జయశంకర్‌ జిల్లా భూపాలపల్లిలో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి, చంపేసిన శివకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది వరంగల్‌ కోర్టు.

ఈ కేసుపై 21 నెలల పాటు విచారణ జరిగింది. పోలీసులు సమర్పించిన ఆధారాలు, సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడు నేరం చేసినట్టు రుజువైంది.

దీంతో నిందితుడు శివకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేశారు. దీనికి ముందు జరిగిన రాజకీయ హత్యల విషయంలో నిష్పక్షపాతంగా తీర్పులు ఇచ్చారనే పేరును వరంగల్‌ కోర్టులు తెచ్చుకున్నాయి.



2012లో వరంగల్‌ నగరంలో బీజేపీ నేత గౌరు అశోక్‌రెడ్డిని నడిరోడ్డుపై కుటుంబ సభ్యుల ముందే హత్య చేశారు.

ఈ కేసులో 24 మంది సాక్షులను విచారించిన న్యాయ స్థానం ఏకంగా 16 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షను విధించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఈ కేసులో రాజకీయ పలుకుబడి ఉన్నవారికి శిక్షలు పడటం గమనార్హం. చట్టం ముందు అంతా సమానమే ఐనప్పటికీ.. అదే చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని చాలా మంది శిక్షలు లేకుండా తప్పించుకుంటున్నారు.

కానీ వరంగల్‌ కోర్టు ముందు నేరస్తుల ఆటలు సాగవ్‌. గడిచిన ఇరవై ఏళ్లలో ఇక్కడ ముగ్గురికి ఉరి శిక్షలు విధించడం న్యాయస్థానాల పనితీరుకు నిదర్శనం. ఒకప్పుడు వరంగల్‌ అంటే ఎన్‌కౌంటర్లకు ప్రసిద్ధి.

చట్టాన్ని పోలీసులు చేతుల్లోకి తీసుకుంటున్నారనే అపవాదు ఉండేది ఇక్కడి పోలీసులపై. ఇప్పుడలా అనేందుకు ఆస్కారం లేకుండా చేశారు వరంగల్‌ పోలీసులు.

నేరం జరిగిన తర్వాత నెల రోజుల లోపే అన్ని ఆధారాలు సేకరించి చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తున్నారు. నేరస్తులకు గరిష్ట శిక్షలు కోర్టులు విధించేలా పని చేస్తోంది పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌.



కోర్టుల్లో న్యాయం జరగాలంటే పోలీసులు సేకరించే ఆధారాలు, సాక్షులు కీలకం. పోలీసులు ఆధారాలు ఎంత త్వరగా సంపాదిస్తే అంత త్వరగా నేరస్థున్ని చట్టం ఎదుట నిలబెట్టొచ్చు.

వరంగల్‌ పోలీసులు ఈ పని చేయడంలో మిగితా వారికి ఆదర్శంగా నిలస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట 9 హత్యల కేసులో పోలీసులు వేగంగా స్పందించారు.

నేరం జరిగిన తర్వాత కేవలం 25 రోజుల్లోనే అన్ని ఆధారాలతో కోర్టులో ఛార్జీషీట్‌ దాఖలు చేశారు.

అంతకు ముందు తొమ్మిది నెలల పసికందు శ్రీహితపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో 25 రోజుల్లోనే ఛార్జీషీట్‌ దాఖలు చేశారు.



నేరానికి సంబంధించి బలమైన ఆధారాలను సకాలంలో సేకరించడం, లోపాలు లేకుండా వాటిని కోర్టులో సమర్పించడంలో వరంగల్‌ పోలీసులు ముందున్నారు.

దీంతో చట్టం తన పని తాను చేసుకుపోతున్నాయి. అందువల్లే ఏడాది వ్యవధిలోనే ఇద్దరు నిందితులకు చట్ట ప్రకారం.. గరిష్ట శిక్ష అయిన ఉరిని కోర్టులు విధించాయి.

హైదరాబాద్‌లో దిశ అత్యాచారం జరిగిన రోజే వరంగల్‌లో మానస అనే యువతిని అత్యాచారం చేశాడు సాయికుమార్‌ అనే యువకుడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ దశలో ఉంది.

సంచలన తీర్పులు వెలువరిస్తున్న వరంగల్‌ కోర్టులు మానస కేసు విషయంలో ఏ తీర్పు ఇస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.