Munugode Bypoll Counting: మునుగోడు ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ విజయఢంకా!

రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ఉదయం 8గంటలకు  ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లను లెక్కించిన అనంతరం 8:30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కింపు ప్రారంభించారు. తుది ఫలితాలు వచ్చాయి.

Munugode Bypoll Counting: మునుగోడు ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ విజయఢంకా!

రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ఉదయం 8గంటలకు  ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లను లెక్కించిన అనంతరం 8:30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కింపు ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు రెండు టేబుళ్లు, ఈవీఎంల లెక్కింపునకు మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 15 రౌండ్లలో (14పూర్తిగా, 15వ రౌండ్లో నాలుగు టేబుళ్లు) లెక్కించారు. అనంతరం డ్రా పద్దతిన అయిదు పోలింగ్ బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలలోని వీవీ స్లిప్‌లను లెక్కించి సరిచూశారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 06 Nov 2022 05:23 PM (IST)

    టీఆర్ఎస్ గెలుపు

    మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 14వ రౌండ్ ముగిసేసరికి 10191 ఓట్ల మెజారిటీ సాధించిన టీఆర్ఎస్.. బీజేపీపై విజయం సాధించింది. పూర్తి మెజారిటీ తేలేందుకు మరో రౌండ్ లెక్కించాల్సి ఉంది. కాగా, ఈ ఎన్నికలో ఓటమి ద్వారా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయినట్లైంది.

  • 06 Nov 2022 04:42 PM (IST)

    కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

    మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి కనీస ఓట్లు కూడా రాకపోవడంతో డిపాజిట్ కోల్పోయింది. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినప్పటికీ ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమైంది. టీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. టీఆర్ఎస్ గెలుపు దిశగా సాగుతుండగా, బీజేపీ గౌరవప్రదమైన ఓట్లు దక్కించుకుంది.

  • 06 Nov 2022 04:36 PM (IST)

    13వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌దే ఆధిక్యం

    మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతోంది. 13వ రౌండ్లోనూ టీఆర్ఎస్ పార్టీకే ఆధిక్యం దక్కింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 6,691 ఓట్లు రాగా, బీజేపీకి 5,406 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్లో టీఆర్ఎస్‌కు 1,285 ఓట్ల మెజారిటీ లభించింది. 13 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 9,128 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మరో రెండు రౌండ్లలో పూర్తి ఫలితం వెలువడుతుంది.

  • 06 Nov 2022 03:56 PM (IST)

    12వ రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

    మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. 12వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 7,440 ఓట్లు, బీజేపీకి 5,398 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 2042 ఓట్ల మెజారిటీ దక్కింది. 12 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 7836 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తం ఇప్పటివరకు లెక్కించిన 12 రౌండ్లు కలిపి టీఆర్ఎస్ పార్టీకి 82,038 ఓట్లు పోలవగా, బీజేపీకి 74,198 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఫలితం తేలాలంటే మరో 3 రౌండ్లు లెక్కించాల్సి ఉంది.

  • 06 Nov 2022 03:19 PM (IST)

    కొనసాగుతున్న 12వ రౌండ్ కౌంటింగ్

    మునుగోడు ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన 11 రౌండ్లు కలిపి టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 11 రౌండ్లు కలిపి టీఆర్ఎస్ పార్టీకి 74,594 ఓట్లు పోలవగా, బీజేపీకి 68,800 ఓట్లు పోయ్యాయి. మొత్తంగా టీఆర్ఎస్ 5,774 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 12వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది.

  • 06 Nov 2022 03:12 PM (IST)

    11వ రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

    మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో వరుస రౌండ్లలో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. 11వ రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 7,235 ఓట్లు, బీజేపీకి 5,877 ఓట్లు పోలయ్యాయి. 11వ రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 1,358 ఓట్ల ఆధిక్యం దక్కింది. మొత్తం 11 రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ 5,774 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 06 Nov 2022 02:55 PM (IST)

    10వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌ ఆధిక్యం

    మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతోంది. 10వ రౌండ్‌లోనూ ఆధిక్యం ప్రదర్శించింది. 10వ రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 7,499, బీజేపీకి 7,015 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ 484 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఇప్పటివరకు పూర్తైన పది రౌండ్లు కలిపి టీఆర్ఎస్ మొత్తం 4,416 ఓట్ల ఆధిక్యం సాధించింది.

  • 06 Nov 2022 02:28 PM (IST)

    9వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ దూకుడు

    మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో 9వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతోంది. 9వ రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 7,497, బీజేపీకి 6,665 ఓట్లు పోలయ్యాయి. 9వ రౌండ్‌లో టీఆర్ఎస్ 832 ఓట్ల ఆధిక్యం సాధించింది. 9 రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ మొత్తం 3,936 ఓట్ల ఆధిక్యం సాధించింది. మరోవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జ్‌గా పని చేసిన చోట మాత్రం బీజేపీ స్వల్ప ఆధిక్యం సాధించింది. ఇక్కడ బీజేపీకి 1,668 ఓట్లు పోలవగా, టీఆర్ఎస్ పార్టీకి 1,630 ఓట్లు పోలయ్యాయి. దీంతో బీజేపీ 38 ఓట్ల ఆధిక్యాన్ని సాధించినట్లైంది.

  • 06 Nov 2022 02:20 PM (IST)

    పని చేయని మల్లారెడ్డి మంత్రం

    మంత్రి మల్లారెడ్డి ఇంచార్జ్‌గా ఉన్న రెడ్డి బావి, కాట్రేవు, ఆరె గూడెంలలో టీఆర్ఎస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ గ్రామాల పరిధిలో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉండగా, నాలుగు చోట్లా బీజేపీనే అధిక ఓట్లు సాధించింది. ఇక్కడ బీజేపీకి 1,466, టీఆర్ఎస్‌కు 1,015, కాంగ్రెస్ పార్టీకి 159 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా మంత్రి మల్లారెడ్డి బాధ్యతలు తీసుకున్న చోట బీజేపీ 451 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అత్తగారి గ్రామం పలివేలలో బీజేపీ 400 ఓట్లకుపైగా మెజారిటీ సాధించింది. ఇదే గ్రామానికి టీఆర్ఎస్ తరఫున ఇంచార్జ్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

  • 06 Nov 2022 01:58 PM (IST)

    8వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం..

    మునుగోడు ఉపఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. రౌండ్ రౌండ్‌కు ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మెజార్టీ పెరుగుతోంది. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి 6,624 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 6,088 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థికి 536 ఓట్ల ఆధిక్యం లభించింది. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థికి 3,104 ఓట్ల మెజార్టీ లభించింది.

  • 06 Nov 2022 01:52 PM (IST)

    మునుగోడులో బీజేపీ బొక్కా‌బొర్లా పడింది.. టీఆర్ఎస్ నేత శ్రవణ్

    మునుగోడు ప్ర‌జ‌లు కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నారు. బీజేపీ తెలంగాణ‌కు ప‌నికిరాదని ప్ర‌జ‌లు తేల్చేశారంటూ టీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. 18‌వేల కోట్ల కాంట్రాక్టుల క‌మీష‌న్లు తీసుకున్న వారికి మునుగోడు ప్ర‌జ‌లు చ‌ర‌మ‌గీతం పాడారు. ఓట‌మిని త‌ట్టుకోలేక బీజేపీ తప్పుడు విమర్శలు చేస్తోంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ అడ్డ‌దిడ్డంగా ప‌ని చేస్తుంద‌ని బీజేపీ నాయ‌కులు మాట్లాడ‌టం స‌రికాదు. బ‌ట్టకాల్చి మీదవేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నైతికంగా నేను గెలిచాన‌ని రాజ‌గోపాల్ రెడ్డి చెప్ప‌డమంటే ఓడిపోయాన‌ని ఒప్పుకోవ‌డ‌మే అని పేర్కొన్నారు.

  • 06 Nov 2022 01:45 PM (IST)

    ఎన్నికల్లో ప్రచారం చేసిన పోలీస్ అధికారి‌పై వేటు ..

    గద్వాల్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్‌పై వేటు పడింది. రాములు నాయక్‌ను డీజీపీ కార్యాలయం‌కు అటాచ్ చేస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సంస్థాన్ నారాయణ్ పూర్‌లో బీజేపీ లోకల్ లీడర్‌తో కలిసి ప్రచారం చేసినట్లు రాములు నాయక్‌పై అభియోగాలు ఉన్నాయి.

  • 06 Nov 2022 01:34 PM (IST)

    7వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌దే ఆధిక్యం..

    మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. రెండు, మూడు రౌండ్లు మినహా మిగిలిన అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. 7వ రౌండ్ లో కూడా ఆధిక్యం సాధించాడు. ఈ రౌండ్ లో టీఆర్ఎస్‌కు 7189 ఓట్లురాగా, బీజేపీకి 6803 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీఆరెఎస్ 386 ఓట్ల మెజార్టీ సాధించింది. ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ పార్టీ  అభ్యర్థి  2,555 ఓట్ల మెజార్టీతో ముందజంలో ఉన్నాడు.

  • 06 Nov 2022 01:03 PM (IST)

    ఏడో రౌండ్ కౌంటింగ్.. టేబు‌ల్‌పైకి ఈవీఎంలు

    మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఏడో రౌండ్ ఈవీఎంలు కౌంటింగ్ టేబుల్ పైకి కౌంటింగ్ సిబ్బంది తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు.

  • 06 Nov 2022 12:49 PM (IST)

    కౌంటింగ్ పూర్తయ్యేసరికి రాత్రి 7.30 అవుతుంది - సీఈవో వికాస్ రాజ్

    మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందని ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. 4వ, 5వ రౌండ్‌కు 20 నిమిషాలు లేట్ అయిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల మాదిరి కాదు... ఇక్కడ ఫలితాలు కొద్దిగా లేట్ అవుతాయన్నారు. కౌంటింగ్ కేంద్రంలో అధికారులు, ఏజెంట్లు, మీడియా ఉంది. వారి సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. నాతో బీజేపీ నేత కిషన్ రెడ్డి, ఇతర నేతలు మాట్లాడారు.. ప్రతి రౌండ్‌కు అరగంట పడుతుందని వారికి క్లియర్ గా చెప్పా అని తెలిపారు. పూర్తిస్థాయిలో ఫలితాలు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని, దాదాపు రాత్రి 7.30 గంటల వరకు పడుతుందని సీఈవో వికాస్ రాజ్ అన్నారు.

  • 06 Nov 2022 12:40 PM (IST)

    ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తి.. 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్..

    మునుగోడు ఉప‌ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ ఆధిక్యం 2వేలు దాటింది. ఆరవ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 6,016 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 5,378 ఓట్లు వచ్చాయి. దీంతో ఆరవ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి 638 ఓట్ల మెజార్టీ సాధించాడు.  ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి 2,169 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు.

  • 06 Nov 2022 12:29 PM (IST)

    కూసుకుంట్ల స్వగ్రామంలో టీఆర్‌ఎస్‌కు 340 ఓట్ల మెజార్టీ

    మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ 1430 ఓట్ల మెజార్టీ సాధించింది. అయితే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామం లింగంవారిగూడెంలో ఆ పార్టీకి 340ఓట్ల మెజార్టీ వచ్చింది.

  • 06 Nov 2022 12:22 PM (IST)

    ఎక్కువ మంది పోటీలో ఉండటం వల్లే ఫలితాల వెల్లడి ఆలస్యం - సీఈవో

    మునుగోడు ఉప‌ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతుందని, టీఆర్ఎస్‌కు లీడింగ్ వస్తేనే ఫలితాలు వెంటనే వెల్లడిస్తున్నారని, లేకుంటే జాప్యం చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించిన విషయం విధితమే. సంజయ్ వ్యాఖ్యలకు సీఈవో  వికాస్ రాజ్ స్పందించారు. ఫలితాల అప్ లోడ్ విషయంలో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగడం లేదన్నారు. కౌంటింగ్ పారదర్శకంగా జరుగుతోందని, కౌంటింగ్‌లో ఎలాంటి అవకతవకలు జరగడం లేదన్నారు. ప్రతీ రౌండ్‌కు అరగంటకుపైగా సమయం పడుతోందని, ఆర్‌వో సంతకం చేశాకే ఫలితాలు విడుదల చేస్తున్నామని సీఈవో తెలిపారు.

  • 06 Nov 2022 12:07 PM (IST)

    ఐదు రౌండ్లు కౌంటింగ్ పూర్తి.. రౌండ్ల వారిగా ఓట్ల వివరాలు ..

    మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఐదు రౌండ్లు పూర్తికాగా 1430 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

    మొదటి రౌండ్ ..
    టీఆర్ఎస్ - 6317
    బీజేపీ - 5127
    టీఆర్ఎస్ ఆధిక్యం - 1190

    2వ రౌండ్ ..
    టీఆర్ఎస్ - 7781
    బీజేపీ  - 8623
    రెండు రౌండ్లకు టీఆర్ఎస్ ఆధిక్యం : 348

    3వ రౌండ్:
    టీఆర్ఎస్ - 7387
    బీజేపీ - 7426
    మూడు రౌండ్లకు టీఆర్ఎస్ ఆధిక్యం - 309

    4వ రౌండ్:
    టీఆర్ఎస్ - 4855
    బీజేపీ - 4560
    నాలుగు రౌండ్లకు టీఆర్ఎస్ ఆధిక్యం - 604

    5వ రౌండ్:
    టీఆర్ఎస్ - 6062
    బీజేపీ - 5245
    ఐదు రౌండ్లకు టీఆర్ఎస్ ఆధిక్యం - 1430

  • 06 Nov 2022 11:58 AM (IST)

    బీజేపీ కార్యాలయంకు బండి సంజయ్, లక్ష్మణ్.. ఫలితాల సరళిపై చర్చ ..

    మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు రౌండ్ల వారిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు ఐదు రౌండ్లు పూర్తికాగా. మూడు, నాలుగు రౌండ్లు మినహా మిగిలిన రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి అధిక్యాన్ని ప్రదర్శించాడు. బీజేపీకి మెజార్టీ ఓట్లు తెచ్చిపెడుతుందనుకున్న చౌటుప్పల్ మండలంలోకూడా టీఆర్ఎస్ హవానే కొనసాగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు చేరుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ఫలితాలను టీవీలో చూస్తూ మెజార్టీ తగ్గిపోవటానికి కారణం, వచ్చే రౌండ్లలో ఎక్కడ పుంజుకొనే అవకాశం ఉందనే  విషయాలపై చర్చిస్తున్నారు.

  • 06 Nov 2022 11:49 AM (IST)

    ఐదవ రౌండ్‌ ముగిసే సరికి 1,430 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ..

    మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఐదవ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 917 ఓట్ల ఆధిక్యం సాధించాడు. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ కు 6,162 ఓట్లురాగా, బీజేపీకి 5245 ఓట్లు వచ్చాయి. ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థిపై టీఆరెఎస్ అభ్యర్థి 1,430ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నాడు.

  • 06 Nov 2022 11:39 AM (IST)

    ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా సీఈవో వైఖరి : బండి సంజయ్

    మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని సంజయ్ అన్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తేతప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదు బండి సంజయ్ సీఈవోను ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 06 Nov 2022 11:33 AM (IST)

    ఫలితాల వెల్లడిలో జాప్యమెందుకు? రాష్ట్ర ఎన్నికల అధికారిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి

    మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్లు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫలితాలు తారుమారవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి జాప్యంచేస్తుందని బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఎప్పటికప్పుడు ఫలితాలు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. అయితే, కిషన్‌రెడ్డి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే నాల్గో రౌండ్ ఫలితాలను అధికారులు అప్‌డేట్ చేశారు.

  • 06 Nov 2022 11:11 AM (IST)

    చౌటుప్పల్ ఫలితం‌పై నిరాశ‌లో బీజేపీ శ్రేణులు.. కౌంటింగ్ కేంద్రం బయటకొచ్చిన రాజగోపాల్ రెడ్డి

    మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. మొదటి, నాల్గో రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యాన్ని ప్రదర్శించగా, రెండు, మూడు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి 714 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అయితే నాలుగు రౌండ్లు చౌటుప్పల్ మండలంతో పాటు సంస్థాన్ నారాయణపురం మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి సుమారు 6వేల మెజార్టీ వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావించారు. కానీ బీజేపీ శ్రేణుల అంచనాలు తలకిందులయ్యాయి. మెజార్టీ రాకపోగా నాల్గో రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి వెనుకబడిపోయారు. ఈ ఫలితాల ప్రకారం చూస్తే తాము ఆశించినట్లు ఓట్లు పడలేదని బీజేపీ నేతలు అంటున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రస్తావించారు. చౌటుప్పల్ మండలంలో నేను ఆశించిన ఓట్లు రాలేదని అన్నారు. ఈ క్రమంలో ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోవటం ఛర్చనీయాంశంగా మారింది. అయితే టిఫిన్ చేసి వస్తానని రాజగోపాల్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

  • 06 Nov 2022 10:59 AM (IST)

    టీఆర్ఎస్ అభ్యర్థి ఇలాకాలో రాజగోపాల్ రెడ్డికి ఆధిక్యం..

    నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామంలో బీజేపీ ఆదిత్యం ప్రదర్శించింది. బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి కంటే 34 ఓట్లు ఆదిక్యం లభించింది.

  • 06 Nov 2022 10:51 AM (IST)

    హోరాహోరీ పోటీ తప్పదు.. బీజేపీ గెలుస్తుందని నమ్మకం ఉంది - రాజగోపాల్ రెడ్డి

    రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయి. చివరికి హోరా హోరీ పోటీ తప్పదు. బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలంలో, చౌటుప్పల్ రూరల్ ప్రాంతంలో, నారాయణపూర్‌లో బీజేపీకి నేను అనుకున్న మెజార్టీ రాలేదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

  • 06 Nov 2022 10:45 AM (IST)

    నాలుగు రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తి.. 714 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ..

    మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఫలితాలు తారుమారవుతున్నాయి. మొదటి, నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగగా, రెండు, మూడు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 714 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    మొదటి రౌండ్‌లో..

    టీఆర్ఎస్ - 6,418
    బీజేపీ - 5,126
    కాంగ్రెస్ - 2,100

    రెండవ రౌండ్‌లో..

    టీఆర్ఎస్ - 7,781
    బీజేపీ - 8,622
    కాంగ్రెస్ - 1,537

    మూడవ రౌండ్‌లో ..

    టీఆర్ఎస్ - 7,390
    బీజేపీ - 7,426
    కాంగ్రెస్ - 1926

    నాలుగో రౌండ్‌లో..

    టీఆర్ఎస్ - 4,854
    బీజేపీ - 4,555
    కాంగ్రెస్ - 1,817

  • 06 Nov 2022 10:19 AM (IST)

    కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి..

    మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొదటి రౌండ్ నుంచి నాలుగు రౌండ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి వారు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

  • 06 Nov 2022 10:17 AM (IST)

    నాలుగు రౌండ్లు ముగిసేసరికి స్వల్ప ఆధిక్యంలో టీఆర్ఎస్

    మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాలుగు రౌండ్ల ఫలితాల్లో  రెండు, మూడు రౌండ్లలో బీజేపీ అధిక్యాన్ని ప్రదర్శించగా, ఒకటి, నాలుగు రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీ ఓట్లు సాధించారు.

  • 06 Nov 2022 10:09 AM (IST)

    మూడు రౌండ్లు ముగిసే సరికి 35ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్..

    మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా మూడు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. మూడవ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యాన్ని కొనసాగించారు. మూడు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కేవలం 35 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 06 Nov 2022 09:53 AM (IST)

    మొదటి రౌండ్‌లో కేఏ పాల్‌కు 34ఓట్లు ..

    మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ పక్రియ కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శించగా.. రెండు, మూడు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో గెలుపు తనదేనంటూ చెప్పుకుంటూ వచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మునుగోడు ఉప ఎన్నిక స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్‌కు తొలిరౌండ్లో కేవలం 34ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి పాల్ వంద ఓట్లు కూడా దాటలేదని తెలుస్తోంది.

  • 06 Nov 2022 09:49 AM (IST)

    మూడో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం..

    మునుగోడు ఉప ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తికాగా తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. రెండు , మూడు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శించారు.

  • 06 Nov 2022 09:21 AM (IST)

    రెండో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం..

    Munugode ByPoll counting

    Munugode ByPoll counting

    మునుగోడు ఉప ఉన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యాన్ని ప్రదర్శించగా.. రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 789 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెఢ్ఢి 563 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 06 Nov 2022 09:12 AM (IST)

    తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం..

    మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. టీఆర్ఎస్ అభ్యర్థి 1,352 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి 6,478 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 5,126 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 2,100 ఓట్లు పోలయ్యాయి.

  • 06 Nov 2022 09:02 AM (IST)

    పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్‌ ఆధిక్యం ..

    ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత కౌంటింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శించారు.

  • 06 Nov 2022 08:08 AM (IST)

    పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

    ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత కౌంటింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. వీటి లెక్కింపునకు రెండు టేబుళ్లు ఏర్పాటు చేశారు.

  • 06 Nov 2022 07:54 AM (IST)

    తెరుచుకున్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్..

    ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. స్ట్రాంగ్ రూమ్‌ని అభ్యర్థులు, పార్టీ ఏజెంట్ల సమక్షంలో అధికారులు తెరిచారు. ఈవీఎంలను కౌంటింగ్ టేబుళ్ల వద్దకు తీసుకెళ్లారు. అయితే, తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు.

  • 06 Nov 2022 07:46 AM (IST)

    తొలుత చౌటుప్పల్‌ మండలం ఓట్లు లెక్కింపు..

    ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం 15 రౌండ్లలో సాగనుంది. తొలి నాలుగు  రౌండ్లలో చౌటుప్పల్ మండలంకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. ఆ తరువాత 4,5,6 రౌండ్లలో సంస్థాన్ నారాయణపురం మండలం ఓట్లు.  6, 7, 8 రౌండ్లలో మునుగోడు మండల పరిధిలోని ఓట్లు.  8, 9, 10 రౌండ్లలో చండూరు మండల పరిధిలోని ఓట్లు. 10, 11 రౌండ్లలో గట్టుప్పల మండల పరిధిలోని ఓట్లు.  11, 12, 13 రౌండ్లలో మర్రిగూడ, 13, 14, 15 రౌండ్లలో నాంపల్లి మండలానికి సంబంధించిన ఓట్లను కౌంటింగ్ చేయనున్నారు.

  • 06 Nov 2022 07:38 AM (IST)

    కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నకాంగ్రెస్ అభ్యర్థి..

    కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆమె అన్నారు.

  • 06 Nov 2022 07:36 AM (IST)

    కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న బీజేపీ అభ్యర్థి ..

    బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. విజయం పట్ల ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

  • 06 Nov 2022 07:18 AM (IST)

    కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో పటిష్ట భద్రత ..

    ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రం జిల్లా కేంద్రంలోని వేర్ హౌజింగ్ గోదాం వద్ద ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 470 మంది సివిల్, ఏఆర్ పోలీస్ సిబ్బంది, మూడు కంపనీల కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

  • 06 Nov 2022 07:14 AM (IST)

    అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 47మంది అభ్యర్థులు ..

    మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 47మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య తీవ్రపోటీ నెలకొంది. ఈ మూడు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారపర్వాన్ని కొనసాగించారు.

  • 06 Nov 2022 07:07 AM (IST)

    ఉదయం 9గంటలకు తొలి ఫలితం..

    మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాల‌బావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేష‌న్ గోదాములో చేపట్టనున్నారు. ఒకే హాల్‌లో 21 టేబుళ్ల‌ను ఏర్పాటు చేశారు. 15రౌండ్ల‌లో ఓట్ల‌ను లెక్కించి, ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఉద‌యం 8 గంట‌ల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించి, ఆ త‌ర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కించనున్నారు. తొలి ఫ‌లితం ఉద‌యం 9 గంట‌ల‌కు వెలువ‌డ‌నుంది. చివ‌రి ఫ‌లితం మధ్యాహ్నం 3గంటలలోపు వెలువ‌డ‌నుంది.