150కిలోమీటర్లు నడిచి ప్రసవించిన గర్భిణీ వలస కార్మికురాలు 

  • Published By: Subhan ,Published On : May 13, 2020 / 04:03 AM IST
150కిలోమీటర్లు నడిచి ప్రసవించిన గర్భిణీ వలస కార్మికురాలు 

గర్భిణీగా ఉన్న వలస కార్మికురాలు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ లోని తన ఇంటికి వెళ్లడానికి 150కిలోమీటర్లు నడిచింది. బిడ్డను కనేందుకు 2గంటల విరామం తీసుకున్న మహిళ మరో 150కిలోమీటర్లు నడిచేందుకు బయల్దేరింది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి గర్భిణీ మహిళ కుటుంబంతో సహా మధ్యప్రదేశ్ లోని సత్నాకు ప్రయాణం మొదలుపెట్టింది. 

మార్గం మధ్యలో పురిటినొప్పులు రావడంతో ఆగారు. ‘తను ప్రసవించిన తర్వాత 2గంటలు రెస్ట్ తీసుకున్నాం. మిగిలి ఉన్న 150కిలోమీటర్లు నడిచేందుకు మళ్లీ బయల్దేరాం’ అని ఆమె భర్త అంటున్నాడు. సత్నా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఏకే రే మాట్లాడుతూ.. ‘అధికారులు సరిహద్దు వద్ద ఓ బస్సు ఏర్పాటు చేశారు. వాళ్లు ఉంచెర్రా వచ్చేసరికి మేం వారిని ఇక్కడకు తీసుకువచ్చాం. అన్ని చెకప్ లు పూర్తి అయిన తర్వాత తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు’ అని చెప్పారు.

ప్రభుత్వం కార్మికుల కోసం శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసినప్పటికీ వారి ప్రాణాలు పణంగా పెట్టి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. నిరుపేదలైన కార్మికులు టిక్కెట్లకు డబ్బులు ఇచ్చుకోలేక హైవేలపైనే పోరాటం చేస్తున్నారు. కొందరు ట్రక్కులు ఎక్కి వెళ్తుంటే మరి కొందరు సైకిళ్లపై వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు. మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోతున్న వారు ఉన్నారు. 

మధ్యప్రదేశ్ నుంచి బయల్దేరిన 16మంది వలస కార్మికులు మహారాష్ట్ర చేరుకునే లోపే చనిపోయారు. రైలు పట్టాలపై పడుకుని ఉన్న వాళ్లను గూడ్స్ ట్రైన్ తొక్కేసి వెళ్లిపోయింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని, హైవేలకు బదులుగా రైల్వే పట్టాలపై ప్రయాణం చేయాలనుకుని అనుకున్న వారి ఆశలు అర్ధాంతరంగానే ముగిసిపోయాయి. 

Read Here>> 55 రోజులుగా ఎయిర్‌పోర్టులోనే ఉన్న జర్మన్ ప్రయాణికుడు