సూర్యాపేట పాత బస్టాండ్‌ జంక్షన్‌ కు సంతోష్‌బాబు పేరు : మంత్రి జగదీశ్ రెడ్డి 

  • Published By: bheemraj ,Published On : June 22, 2020 / 09:42 PM IST
సూర్యాపేట పాత బస్టాండ్‌ జంక్షన్‌ కు సంతోష్‌బాబు పేరు : మంత్రి జగదీశ్ రెడ్డి 

సూర్యాపేట పాత బస్టాండ్‌ సమీపంలోని కోర్టు చౌరస్తాను జంక్షన్‌గా అభివృద్ధి చేసి దానికి సంతోష్‌బాబు పేరు పెడతామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సంతోష్‌బాబు కాంస్య విగ్రహాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ పర్యటన అనంతరం సంతోష్‌బాబు కుటుంబసభ్యులతో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. త్యాగధనుల కుటుంబాలకు సమాజంలోని అన్నివర్గాలు  అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. 

సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విధంగా సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వసాయం అందజేశామని వెల్లడించారు. ప్రభుత్వ సాయంలోనూ కుటుంబసభ్యుల అభిప్రాయాలను గౌరవిస్తూ సీఎం కేసీఆర్‌ తన గొప్పతనాన్ని మరోసారి చాటుకున్నారన్నారు. దేశంలో సంతోష్‌బాబుతోపాటు అమరులైన ఇతర జవాన్ల కుటుంబాలకు కూడా కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించి తన ఔదార్యాన్ని ప్రదర్శించారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ పర్యటన అమరవీరుల కుటుంబాలకు ఎంతో మనోధైర్యం కల్పించిందని మంత్రి అన్నారు.

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో కల్నల్‌ సంతోష్‌బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. సంతోష్‌బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్‌ సోమవారం (జూన్ 22, 2020)  పరామర్శించారు. సూర్యాపేటలోని విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి రోడ్డు మార్గంలో వెళ్లిన సీఎం కేసీఆర్‌ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్‌, భార్య సంతోషిని పరామర్శించారు.