Wardhannapet Food Poison : వర్ధన్నపేట ఫుడ్ పాయిజన్ ఘటన.. తప్పిన ప్రాణాపాయం.. కోలుకుంటున్న విద్యార్థులు

వర్ధన్నపేట ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు.

Wardhannapet Food Poison : వర్ధన్నపేట ఫుడ్ పాయిజన్ ఘటన.. తప్పిన ప్రాణాపాయం.. కోలుకుంటున్న విద్యార్థులు

Wardhannapet Food Poison : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు. తాము భోజనం చేస్తున్న సమయంలో బల్లి కనిపించిందని, ఇదే విషయాన్ని వార్డెన్ కు చెప్పినా అదే భోజనాన్ని అందరికీ వడ్డించారని పిల్లలు వాపోయారు. భోజనం తిన్నప్పట్టి నుంచే అందరికీ వాంతులు అయ్యాయని, కళ్లు తిరిగాయని చెప్పారు.

వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 60మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వరంగల్‌ ఎంజీఎంకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 5 నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. సోమవారం రాత్రి భోజనంలో ఓ విద్యార్థినికి చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే కుక్‌ అన్నంలోని బల్లిని తీసేశాడు. ఇంతలో ఆ అన్నం తిన్న ఇతర విద్యార్థినులు కొందరు వాంతులు, విరేచనాలు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వెంటనే వారిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించి కొందరిని తిరిగి హాస్టల్‌కు పంపించారు. మరికొందరిని మాత్రం ఆస్పత్రిలోనే ఉంచారు. 13 మందిని మెరుగైన చికిత్స కోసం వరగల్‌ ఎంజీఎంకు తరలించారు. హాస్టల్ సిబ్బంది.. పిల్లలకు బల్లి పడిన ఆహారాన్నే వడ్డించిన ఘటన కలకలం రేపుతోంది.

ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధుల అవస్థలు, సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన ధ్వజమెత్తారు. హాస్టల్ సిబ్బంది, కుక్‌పైనా విమర్శలు వెల్లువెత్తాయి. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరిస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పిల్లల తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

మరోవైపు బల్లి పడిన భోజనం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీనిపై విచారణ జరిపారు. అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా వార్డెన్, కుక్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.