SilkWorms Farming : పట్టుపురుగులతో పసిడి పండిస్తున్న గిరిజన రైతులు

గత ఐదారేళ్లుగా పట్టు పరిశ్రమతో దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి జిల్లా రైతుల విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం.

SilkWorms Farming : పట్టుపురుగులతో పసిడి పండిస్తున్న గిరిజన రైతులు

High Profits In SilkWorms

Updated On : October 24, 2024 / 2:47 PM IST

SilkWorms Farming : వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో పట్టు పరిశ్రమ రైతులకు అన్నివిధాలా చేయూతనిస్తోంది. కేవలం ఒకటి రెండు ఎకరాల భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతు కూడా ఈ పరిశ్రమలో మంచి ఫలితాలు సాధిస్తూ నెలకు రూ. 80 వేలకు తగ్గకుండా నికర లాభం సాధిస్తున్నారంటే అతిశయోక్తికాదు. పట్టుపురుగుల పెంపకంలో ప్రతి దశలోను పట్టుశాఖ రైతుకు అందిస్తున్న ప్రోత్సాహం ఈ రంగంలో రాణించేందుకు దోహదపడుతోంది.  గత ఐదారేళ్లుగా పట్టు పరిశ్రమతో దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి జిల్లా రైతుల విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇదిగో ఇక్కడ చూడండీ… చుట్టూ గుట్టలు ఉండి మధ్యలో ఉన్నా.. ఈ తండాలను . రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం, కోరింతల కుంట గ్రామ పంచాయితీలోనివి. ఒకప్పుడు తలకొండపల్లి మండలంలోని  తండావాసులు సంప్రదాయ పంటలను సాగుచేసేవారు. వర్షాలు సకాలంలో కురవకపోవడం… కురిసినా వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు పెరిగిపోవడం… వాటిని నివారించేదుకు అధిక మొత్తంలో ఖర్చుచేసి రసాయన మందులు పిచికారి చేసేవారు. ఒక అయినా పంట చేతికి రావాలంటే  ప్రకృతిపైనే ఆధారపడి ఉండేది. సహకరిస్తే.. పంట చేతికి వచ్చేది. లేదంటే పంట కోల్పోయేవారు. పంట వచ్చిన సమయంలో మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర రాక.. చాలా మంది రైతులు ఈ తండాలను వదిలి హైదరాబాద్ నగరానికి చేరుకొని జీవనోపాధికి చిన్న చిన్న పనులు చేసేవారు.  ఇప్పుడు పట్టుగుళ్ళ ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్ గా మారాయి.

చిన్న సన్నకారు రైతులు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమగా విరాజిల్లుతోంది పట్టు పరిశ్రమ. పట్టు దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైతాంగానికి, పట్టు శాఖ ద్వారా అనేక ప్రోత్సహకాలు, రాయితీలు అందిస్తోంది.  మల్బరీ తోటల పెంపకం నుంచి షెడ్డు నిర్మాణం వరకు, పట్టు పురుగుల పెంపకం దశనుంచి మార్కెటింగ్ వరకు ఈ రాయితీలు అడుగడుగునా రైతుకు లభిస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని  అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు కోరింతల కుంట గ్రామ పంచాయితీలోని బల్సుల పల్లి , దాశ్య , కోరింతల కుంట తండాల గిరిజన రైతులు.

రైతులు ప్రధానంగా ఏడాదికి రెండు మూడు పంటలు మాత్రమే పండిస్తుంటారు. నీటి వసతినిబట్టి ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లో పంటలు వేస్తారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు దెబ్బ తింటే ఆ ఏడాదంతా రైతులు అప్పుల్లో కూరుకపోయి నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అయితే పట్టు సాగులో ఈ పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేదు. పట్టుపురుగుల పెంపకంలో కీలకమైన చాకీ పురుగుల పెంపకాన్ని మొదటి రెండు జ్వరాల వరకు జాగ్రత్తగా చూసుకుంటే  రైతుకు రిస్కు తగ్గిపోయింది. దీనివల్ల ప్రతి 25 రోజులకు ఒక పంట చొప్పున, ఏడాదికి 7 నుంచి 8 పంటలను రైతులు తీసే వీలు ఏర్పడింది.

అందుకే రైతు ముడావత్ శకృ తన గ్రామంలో మొట్టమొదటగా పట్టుగూళ్ళ పెంపకం చేపట్టారు. లాభాలు బాగుండటంతో… చుట్టుప్రక్కల రైతులు కూడా వీటి పెంపకానికి ముందుకొచ్చారు. వారందరికి పట్టుపురుగుల పెంపకం పట్ల అవగాహన కల్పించి ప్రభుత్వ సబ్సిడీలను చేరే విధంగా అధికారులతో మాట్లాడి చుట్టుప్రక్క గ్రామాల్లోని గిరిజన రైతుల చేత పట్టుపురుగుల పెంపకాన్ని చేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  అయితే తెలంగాణ మార్కట్ లో పోటీతత్వం లేకపోవడంతో తక్కువ ధరకే గూళ్ళను అమ్ముకోవాల్సి వస్తోంది… ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సకాలంలో సబ్సిడీలను అందిస్తే… ఇక పట్టు పరిశ్రమకు తిరుగే ఉండదంటున్నారు రైతులు.

వస్త్ర ప్రపంచంలో పట్టుకు ఎనలేని విలువ ఉంది. పట్టు తయారీ శ్రమతో కూడుకున్నా రైతులకు మంచి నికరాదాయం అందించే రంగం ఇది. నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి, రెండెకరాల మల్బరీ తోటతో సంవత్సరం పొడవునా పట్టుపురుగులను పెంచి జీవనోపాధి పొందవచ్చు.  రిస్కు తక్కువ, నెలనెలా ఆదాయం, ఉద్యోగస్థులకంటే మెరుగైన జీవనం ఇవన్నీ పట్టుపరిశ్రమతో సాధ్యం.

అందుకే తెలంగాణలో పట్ట పురుగుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు అధికారులు .  మల్బరీలో అభివృద్ధి చేసిన రకాలను రైతులకు అందించటంతోపాటు, కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టే వారికి, ఎటువంటి ఆర్ధిక ఇబ్బంది కలగకుండా పట్టుశాఖ అన్నివిధాలుగా చేయూతనందిస్తోందని తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా సెరికల్చర్ డిపార్ట్ మెంట్ అడిషనల్ డైరెక్టర్, ముత్యాలు.

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించే కుటీర పరిశ్రమ పట్టు పరిశ్రమ . ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే… పట్టు పరిశ్రమతో తక్కువ వ్యవధిలో  ఆదాయం సమకూరుతుంది. పెట్టుబడికోసం వెతుక్కోవాల్సిన పని లేదు.  గ్రామీణులు పట్టణాలకు వలసపోకుండా ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు నిరోధించేందుకు పట్టు పరిశ్రమ చక్కటి అవకాశం. చిన్న రైతు నుంచి పెద్దరైతు వరకు స్వయంసమృద్ధితో ఆర్థికోన్నతి సాధించేందుకు లభించిన వరం ఈ రంగం.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు