Hybrid Bottle Gourd : హైబ్రిడ్ సొర రకాలు – సాగు యాజమాన్యం

Hybrid Bottle Gourd : తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పందిరి కూరగాయలలో ఒకటి.  ఇది తీగజాతి వార్షిక పంట సొర తీగలను నేలపై, పందిరిమీద ప్రాకించి పండించవచ్చును. ఈ పంట బెట్టను బాగా తట్టుకుంటుంది.

Hybrid Bottle Gourd : హైబ్రిడ్ సొర రకాలు – సాగు యాజమాన్యం

Hybrid Bottle Gourd Varieties Cultivation Techniques

Hybrid Bottle Gourd : ఖరీఫ్‌లో తీగజాతి కూరగాయలైన సొర , బీర కు మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని సాగుచేస్తే.. మంచి ఆదాయం పొందవచ్చు. అందుకే సొరను పందిళ్లకు పాకించి ఖరీఫ్ పంటగా జూన్, జులై నెలలో దఫ దఫాలుగా సాగుచేస్తూ ఉంటారు. విత్తిన 50 రోజుల నుండే కాయలు అందివస్తాయి. సొర సాగులో సమస్యలు కూడా తక్కువే. అయితే కాయలు మంచి సైజు, ఆకర్షనీయంగా ఉండే విధంగా దిగుబడి రావాలంటే  రకాల ఎంపిక, యాజమాన్య పద్ధతులు కీలకం. మరి ఖరీఫ్ సొరసాగులో ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం..

Read Also : Sunflower Cultivation Tips : ప్రొద్దుతిరుగుడు సాగులో సమగ్ర యాజమాన్యం

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పందిరి కూరగాయలలో ఒకటి.  ఇది తీగజాతి వార్షిక పంట సొర తీగలను నేలపై, పందిరిమీద ప్రాకించి పండించవచ్చును. ఈ పంట బెట్టను బాగా తట్టుకుంటుంది. సొరకాయను కూరగాయగా, స్వీటు తయారీ లోను వాడుతారు. దాదాపు 6 నుండి 7 వేల ఎకరాల్లో సాగువుతుంది. సరాసరి ఎకరాకు దిగుబడి 14 టన్నులు వస్తోంది. అయితే ఈ పంట సాగుకు తేమతో కూడిన పొడి వాతావరణం అనుకూలం. ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటిగ్రేట్స్ ఉన్నట్లయితే పెరుగుదల బాగా ఉండి పూత, పిందె బాగా పడుతుంది. పూత, పిందె సమయంలో అధిక వర్షపాతం ఉన్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. ఈ పంటను వివిధ రకాలైన నేలలలో పండించవచ్చును. ఉదజని సూచిక 6 నుండి 7 మధ్య ఉన్నట్లయితే ఈ పంట సాగుకు చాలా అనుకూలము. అయితే ఇందులో రకాల ఎంపిక కీలకం . చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే హైబ్రీడ్ రకాలను దేశంలోని పలు ఉద్యాన పరిశోధనా స్థానాలు రూపొందించాయి.

అందులో మేలైన రకాలు పూసా సమ్మర్‌ ప్రాలిఫిక్‌ లాంగ్‌, పూసా సమ్మర్‌ ప్రొలిఫిక్‌ రౌండ్‌, పూసా మేఘధూత్‌, పూసా మంజరి, పూసా నవీన్‌, ఆర్కబహార్‌ , సామ్రాట్‌, పూసా సందేశ్‌  ఉన్నాయి. ఇవేగాక  పలు ప్రైవేట్‌ హైబ్రిడ్‌ రకాలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. కాలానుగుణంగా వీటిని వేసుకుంటే మంచిది. ఖరీప్‌ పంటగా సాగుచేసేటప్పుడు ఎకరాకు 1 నుండి కిలో 200 గ్రాముల విత్తన సరిపోతుంది. అయితే విత్తే ముందు తప్పని సరిగా విత్తనశుద్ది చేయాలి. ఇందుకోసం  కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ మందును బాగా పట్టించి ఆ తర్వాత ట్రైకోడెర్మా విరిడి 5 గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వరుసల మధ్య దూరం 3 మీ. పాదుల మధ్య దూరం 90 సెం. మీ. ఉండే విధంగా విత్తుకోవాలి. ప్రతి పాదుకు 3,4 విత్తనములను 1 నుండి 2 సెం. మీటర్ల లోతులో విత్తి నీరు పెట్టాలి.  3 నుండి 7 రోజులలో విత్తనాలు మొలకెత్తుతాయి. పాదుకు రెండు బలమైన మొక్కలు ఉంచి మిగిలినవి తీసివేయాలి.

ఎరువుల యాజమాన్యం కీలకం. చివరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24 నుండి 32 కిలోల భాస్వరము, 20 నుండి 24 కిలోల పొటాష్‌ను కలుపుకొని సమానంగా పొలమంతా వేసుకోవాలి. నత్రజనిని 32 నుండి 40 కిలోలు రెండు సమపాళ్ళుగా చేసి రెండు దఫాలుగా వేసుకోవాలి. మొదటి సగభాగం విత్తిన 25 రోజులకు, రెండో దఫా పూత పిందె దశలో అంటే విత్తిన 45 రోజులకు వేయాలి. ఎరువులను మొక్కకు 10 నుండి 15 సెంటీమీటర్ల  ఎడంలో గుంట త్రవ్వి, ఎరువు వేసి మట్టిని కప్పి నీరు పెట్టాలి.

సొరతోటల్లో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తీసివేయాలి. మొక్కలు బలంగా పెరగడానికి 1 నుండి 2 సార్లు తేలికగా మట్టిని పాదుచుట్టూ గుల్లచేయాలి. కలుపు నివారణకు అలాక్తోర్‌ 400 గ్రాములు లేదా బ్యూటాక్లోర్‌ 600 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 నుండి 3 రోజులలో నేల మీద పిచికారి చేయడం ద్వారా నెల రోజుల వరకూ కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించవచ్చు. సొర పంటలో అధిక దిగుబడులు సాధించి కాయ నాణ్యత బాగుండాలంటే పై పందిరి పద్ధతిని ఎంచుకోవడం మంచిది. దీని ద్వారా కాయ నాణ్యత బాగుంటుంది.

కాయల ఎదుగుదల బాగుంటుంది. కాయ యొక్క ఆకృతి కూడా బాగుంటుంది. నేల మీద పండించడం వల్ల కాయలు వంకరలు తిరిగి ఉండటం జరుగుతుంది. అలాగే కాయలు నేల మీద పెరగడం వల్ల కాయ నేల మీద తగిలిన వైపు తెల్లగా ఉండటం జరుగుతుంది. దీనివల్ల కాయ నాణ్యతపై పై ప్రభావం పడి మార్కెట్లో రేటు తక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి  పై పందిరి పద్ధతిని వినియోగించుకొని పండించడం వల్ల రెట్టింపు దిగుబడులు రావడమే కాకుండా కాయ నాణ్యత బాగుండడం వల్ల మార్కెట్లో మంచి ధర వచ్చే అవకాశాలున్నాయి. మార్కెట్ కు తరలించుప్పుడు కాయలను సంచులలో కాకుండా ప్లాస్టిక్ ట్రేలలో తరలించడం మంచిది. సంచులలో తీసుకేల్లడం ద్వారా మార్గమద్యంలో కాయలు దెబ్బతినడం జరుగుతుంది.  ట్రేలలో తీసుకుపోవడం ద్వారా కాయలు మంచి నాణ్యత కలిగి ఉండి అధిక ధర పలుకుతాయి.

Read Also : Foxtail Millet Cultivation : అధిక దిగుబడినిచ్చే కొర్ర రకాలు- సాగు యాజమాన్యం