Intercropping : మిశ్రమ పంటల సాగుతో భూసార పరిరక్షణతోపాటు, చీడపీడల నుండి పంటల రక్షణ సాధ్యమేనా?

పప్పు ధాన్యాల సాగుతో భూసారాన్నియ మరింత పెంచుకోవచ్చు. అంతర పంటలతో ప్రధాన పంటలను ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు. అంతర పంటలు సాగు విధానం ద్వారా నేలకోత తగ్గుతుంది.

Intercropping : మిశ్రమ పంటల సాగుతో భూసార పరిరక్షణతోపాటు, చీడపీడల నుండి పంటల రక్షణ సాధ్యమేనా?

intercropping

Updated On : September 26, 2022 / 11:17 AM IST

Intercropping : ఒకే పంట వేస్తూ వాతావరణ పరిస్ధితులు, చీడపీడల బెడదతో రైతులు తీవ్రనష్టాలను చవి చూడాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన రైతులు అందుకు తగిన ఫలసాయం అందకపోవటంతో అప్పులపాలవుతున్నారు. అయితే ప్రధాన పంటతోపాటు ఇతర పంటలను కూడా ఒకే భూమిలో సాగు చేసే విధానం రైతులకు లాభసాటిగా ఉంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతరపంటలు సాగు చేయడం. వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు. ప్రధాన పంటలను చీడపీడల నుంచి కాపాడుకోవటంతోపాటు, కలుపు మొక్కల బెడదను నివారించుకోవచ్చు.

అంతర పంటల విధానం వలన ప్రయోజనాలు :

1. ప్రతికూల పరిస్థితి ఏర్పడితే ఒక పంట ద్వారా అయినా లాభాలు గడించవచ్చు. అంతర పంటలు సాగుచేయడం ద్వారా ప్రధాన పైరు మొక్కల మధ్య వున్న స్థలం వృధా కాకుండా ఉంటుంది. అంతేకాకుండా మొక్కలు సూర్యరశ్మి,నీరు పోషకాలు కూడా బాగా ఉపయోగించుకుంటాయి.

2. ప్రకృతి వైపరీత్యాల వలన ఒక పైరు దెబ్బతిన్న మరో పైరు ఎంతో కొంత దిగుబడి నిచ్చి రైతును కష్టకాలంలో ఆదుకుంటుంది లేదా రెండు పైర్ల నుండి కూడా అధిక దిగుబడులను పొందవచ్చును.

3. పప్పు ధాన్యాల సాగుతో భూసారాన్నియ మరింత పెంచుకోవచ్చు. అంతర పంటలతో ప్రధాన పంటలను ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు. అంతర పంటలు సాగు విధానం ద్వారా నేలకోత తగ్గుతుంది. ప్రధాన పంటలకు కొంత మేర నత్రజని అందే అవకాశం వుంది.

4. అంతర పంటలు సాగు ద్వారా కీటకాలు ,తెగుళ్ళు,కలుపు మొక్కల బెడద కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయి. చిరుధాన్యాలు,నూనె గింజలు,పప్పుధాన్యాలు మొదలైన పంటల ఉత్పత్తి పెంచుకోవచ్చును.

5. అంతర పంటల సాగుతో భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. పంటలకు ఎరువులు వాడాల్సిన అవసరమూ తగ్గుతుంది. రెండు పంటలు వేస్తే ఒక పంట దెబ్బతిన్నా రెండో పంట ద్వారా ఆదాయం పొందవచ్చు. అంతర పంటగా ఎన్నుకున్న పంటలు వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకుని కొంత దిగుబడి నిచ్చేవిగా ఉండాలి.

6.అంతర పంటలుగా వేరుశనగలో అలసంద, పొద్దు తిరుగుడు సాగు చేస్తే ఆకుముడత తెగులు ఉధృతి తగ్గించవచ్చు. పత్తిలో వేరుశనగ, ఆలసంద, పెసర, సోయా చిక్కుళ్లు సాగు చేస్తే మిత్రపురుగుల సంఖ్య పెరిగి శనగ పచ్చ పురుగును కట్టడి చేయవచ్చు. సజ్జ సాగు చేయటం ద్వారా మొవ్వకుళ్లు తెగులు బెడదను అరికట్టవచ్చు. వేరుశనగలో ధనియాలు వేస్తే శనగ పచ్చ పురుగు ఉధృతి తగ్గుతుంది. అంతర పంటగా కందిని వేయటం వల్ల మొక్కల వేర్లు లోతుగా భూమిలోకి చొచ్చుకుపోతాయి. తేమను, పోషకాలను లోపలి పొరల నుంచి తీసుకుంటాయి.