Quails : లాభసాటిగా క్వయిల్స్ పక్షుల పెంపకం! పోషకవిలువల నేపధ్యంలో మార్కెట్లో పెరిగిన డిమాండ్

క్వయిల్స్ బ్రూడింగ్ వ్యవధి 10 రోజులు. బ్రూడింగ్ సమయంలో సరైన వెచ్చదనం,  మేత, నీరు ఇవ్వాలి. 10 రోజుల తరువాత క్వయిల్ను బ్రూడింగ్ నుండి కేజ్ లకు మార్చాలి.

Quails : లాభసాటిగా క్వయిల్స్ పక్షుల పెంపకం! పోషకవిలువల నేపధ్యంలో మార్కెట్లో పెరిగిన డిమాండ్

Profitable breeding of quails! Increased demand in the market in the context of nutritional values

Updated On : December 3, 2022 / 8:00 PM IST

Quails : కోళ్ల పెంపకంలాగానే ఇటీవలి కాలంలో క్వయిల్స్ పక్షుల పెంపకం పై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. పోషక విలువల దృష్ట్యా, క్వయిల్ గుడ్డు, కోడి గుడ్డుకు దాదాపు సమానం కావటంతో వివిధ రకాల వంటకాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. 5 వారాల్లో మాంసం కోసం విక్రయించ వచ్చు. వీటి పెంపకానికి స్ధలం పెద్దగా అవసరం లేదు. కొద్దిపాటి ప్రదేశం లో సైతం వీటి పెంపకం చేపట్టవచ్చు. ఒక కోడి పిల్లను వుంచే స్థలంలో 8-10 క్వయిల్ పక్షులను ఉంచవచ్చు.

100 క్వయిల్ పక్షులకు రెండు కేజీల లోపు క్వయిల్ దాణా సరిపోతుంది. క్వయిల్స్ ఆరు, ఏడు వారాల వయసులో గుడ్లు పెట్టటం ప్రారంభిస్తే 10వ వారం ఆఖరుకల్లా 85 శాతం గుడ్లు పెడతాయి. 7 వారాల వయసుకే ఇవి గుడ్లకు వస్తాయి. గుడ్డు పరిమాణంలో చిన్నగా ఉండటం వలన అంత ఆదరణ పొందలేదు. క్వయిల్ మాంసం ధర కిలో రు. 90 నుండి రు. 110లకు అమ్ముతున్నారు.

క్వయిల్స్ పెంపకంలో మెళుకువలు ;

పొదిగించే గుడ్లన్నీ ఒకే పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. దుమ్ము, ధూళి లేని పరిశుభ్రమైన గదిలో, చల్లని వాతావరణం కల్పించి గుడ్లను పొదిగించాలి. గది ఉష్ణోగ్రత 14-17 డిగ్రీ సెంటీగ్రేడ్ సంబంధిత తేమ 80 శాతం వుండాలి. ఇంక్యుబేషన్ గదిలో గుడ్లను వుంచేటప్పుడు, గుడ్డు వెడల్పు భాగం పైకి వుండేలా పెట్టాలి. ఏడు రోజుల కంటే ఎక్కువ నిలువ లేని గుడ్లను మాత్రమే ఇంక్యుబేషన్కు వినియోగించాలి. గుడ్లు పరిశుభ్రంగా వుండాలి. ఇంక్యుబేషన్ చేసే గుడ్లను కడగకూడదు.

క్వయిల్స్ బ్రూడింగ్ వ్యవధి 10 రోజులు. బ్రూడింగ్ సమయంలో సరైన వెచ్చదనం,  మేత, నీరు ఇవ్వాలి. 10 రోజుల తరువాత క్వయిల్ను బ్రూడింగ్ నుండి కేజ్ లకు మార్చాలి. ఇతర పక్షుల బ్రూడింగ్ లాగానే బ్యాటరీ బ్రూడర్స్ను క్వయిల్స్టలో సైతం వాడవచ్చు. అయితే కొన్ని మార్పులు చేసుకోవాల్సి వుంటుంది. తొలి వారంలో క్వయిల్ పిల్లల కాళ్ళు విరిగిపోకుండా, వైర్ పైన మందంగా వుండే పేపర్ను చుట్టాలి. పిల్లలు బయటకు వెళ్ళి పోకుండా గార్డ్ ఏర్పాటు చెయ్యాలి.

ఈకలు వచ్చే వరకు క్వయిల్ పిల్లలకు అదనంగా వెచ్చదనం కావాలి. పొదిగిన క్వయిల్ పక్షి పిల్లలను ఆన్ ఇంక్యుబేటర్ నుండి సరాసరి బ్రూడర్కి తీసుకురావాలి. ప్రతి బ్రూడర్లో కొంత ప్రదేశం వేడి లేకుండా ఉండాలి. మేత, నీరు, వేడి ప్రదేశం వెలుపల ఏర్పాటు చెయ్యాలి. పిల్లలు మేత కోసం, నీటి కోసం వేడి లేని ప్రాంతానికి తప్పనిసరిగా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విధంగా అవి తక్కువ ఉష్ణోగ్రతను అలవాటు చేసుకుంటాయి.