Mahesh Goud: బండి సంజయ్ బీసీ కాదు.. ఆయన గెలుపుపై అనుమానాలు.. బీఆర్ఎస్ పనైపోయింది- టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ మూడు ముక్కలైందన్న ఆయన.. నాలుగో ముక్క కోసం ఇంకొకరు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

Mahesh Goud: కరీంనగర్ జిల్లాలో టీపీసీసీ జనహిత యాత్రలో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. దొంగ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారన్న అనుమానం కలుగుతోందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దొంగ ఓట్లతో ఎంపీగా గెలిచారనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బయటపెట్టిన ఓటర్ లిస్ట్ చూస్తుంటే బీజేపీ నేతల గెలుపుపై అనుమానాలు కలుగుతున్నాయని మహేశ్ గౌడ్ చెప్పారు. బీసీల గురించి మాట్లాడకుండా బండి సంజయ్ ఢిల్లీలో దాక్కున్నారని ఆయన మండిపడ్డారు.
బండి సంజయ్ బీసీ కాదు.. దేశ్ ముఖ్, ఒక దొర అని ఆయన ఆరోపించారు. కులం, మతం, దేవుడు పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు బీజేపీ నేతలు అని విమర్వించారు. ఎన్నికలప్పుడు మాత్రమే బీజేపీ నేతలకు దేవుడు గుర్తుకొస్తాడని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పైనా మహేశ్ గౌడ్ విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోందని చెప్పారు. బీఆర్ఎస్ మూడు ముక్కలైందన్న ఆయన.. నాలుగో ముక్క కోసం ఇంకొకరు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు తప్ప వేరే పార్టీకి అవకాశమే లేదని స్పష్టం చేశారు.
బీహార్ లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు మహేశ్ గౌడ్. బీసీ నాయకుడిని అని చెప్పుకునే బండి సంజయ్ ఏనాడైనా బీసీ నేతల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా ఢిల్లీలో దాక్కున్నారని బండి సంజయ్ పై విమర్శలు గుప్పించారు.
ఓట్ల చోరీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతివ్వాలని, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న టీపీసీసీ జనహిత పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గం మల్యాల నుంచి యాత్ర ప్రారంభమైంది. తొలి రోజు మల్యాల నుంచి గంగాధర వరకు యాత్ర కొనసాగింది.
Also Read: పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి.. త్వరలోనే ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు:కేటీఆర్