Water Bottle Germs: అమ్మ బాబోయ్.. మీ వాటర్ బాటిల్‌లో కోట్ల క్రిములు..! అసలు బ్యాక్టీరియా ఎలా చేరుతుంది, బాటిల్‌ను క్లీన్ చేయడం ఎలా..
వాటర్ బాటిల్ అపరిశుభ్రత స్థాయిని ఇతర మురికి వస్తువులతో పరిశోధకలు పోల్చగా.. వణుకు పుట్టించే విషయాలు తెలిశాయి. (Water Bottle Germs)

Water Bottle Germs: వాటర్ బాటిల్ పై కోట్ల క్రిములు ఉంటాయని తెలిసి షాక్ అయ్యారు కదూ. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ, ఇది నిజమే అంటున్నారు పరిశోధకులు. వారి అధ్యయనంలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. నీళ్ల సీసాపై కోట్ల క్రిములు ఉంటాయని తేలింది. అసలు వాటర్ బాటిల్ లోకి బ్యాక్టీరియా ఎలా చేరుతుంది? ఎటువంటి నీళ్ల బాటిల్ వాడాలి? ఆరోగ్యానికి ఏది మంచిది? అసలు వాటర్ బాటిల్ ను శుభ్రంగా ఉంచుకోవడం ఎలా? ఈ సందేహాలకు పరిశోధకులు చెప్పే పరిష్కారాల గురించి తెలుసుకుందాం..
అధ్యయనంలో వణుకు పుట్టించే విషయాలు..
అమెరికాలోని ‘వాటర్ ఫిల్టర్ గురు’ అనే స్పెషలిస్ట్ వాటర్ క్వాలిటీ కంట్రోల్ కంపెనీ వాటర్స్ బాటిల్స్ పై ఒక అధ్యయనం చేసింది. వారి అధ్యయనంలో విస్తుపోయే విషయాలు కనుగొన్నారు. టాయ్ లెట్ సీటు కంటే వాటర్ బాటిల్‌లో 40వేల రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని బాంబు పేల్చారు పరిశోధకులు. నీళ్ల బాటిళ్లను సరిగా శుభ్రం చేయకపోతే వాటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి అనేక సూక్ష్మజీవులు పేరుకుపోతాయన్నారు. అవి ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు.
ఒక్క రీయూజబుల్ డ్రింకింగ్ బాటిల్‌లో దాదాపు 2.08 కోట్ల కాలనీ ఫార్మింగ్ యూనిట్ల (సీఎఫ్‌యూ) సూక్ష్మజీవులు ఉండొ అధ్యయనం చెబుతోంది. సీఎఫ్‌యూ అంటే.. ల్యాబ్ వాతావరణంలో సూక్ష్మజీవుల సంఖ్యను గణించేందుకు ఉపయోగించే ప్రమాణం.
వాటర్ బాటిల్ అపరిశుభ్రత స్థాయిని ఇతర మురికి వస్తువులతో పరిశోధకలు పోల్చగా.. వణుకు పుట్టించే విషయాలు తెలిశాయి. టాయ్ లెట్ సీటు ఉపరితలం సగటున 515 సీఎఫ్‌యూలను కలిగి ఉంటుంది. ఆ ప్రకారం టాయ్ లెట్ సీటు కంటే వాటర్ బాటిల్‌లో 40వేల రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంది. ఇక పెట్ ఫుడ్ డిష్‌లు లేదా పాత్రలు (సగటు 14 లక్షల సీఎఫ్‌యూ), కంప్యూటర్ మౌస్ (40 లక్షలు), కిచెన్ సింక్ (కోటి 10 లక్షలు) కూడా బాటిల్‌తో పోలిస్తే తక్కువ బ్యాక్టీరియాను కలిగున్నాయి.
మంచి నీటి బాటిళ్లలో భారీ సంఖ్యలో బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని మరో అధ్యయనంలో తేలింది. ఒక్కో మిల్లీలీటర్ నీటిలో సగటున 75వేల బ్యాక్టీరియా ఉంటుందని అంచనా. ఈ సూక్ష్మ జీవులు 24 గంటల్లో మిల్లీలీటర్‌కు 20 లక్షల వరకు వృద్ధి చెందుతాయని చెప్పారు.
మంచి నీళ్ల సీసాలోకి బ్యాక్టీరియా ఎలా చేరుతుంది?
అసలు మంచి నీళ్ల సీసాలోకి బ్యాక్టీరియా ఎలా చేరుతుంది? ఇలా అపరిశుభ్రమైన బాటిల్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు అవసరం? అనే వివరాలు తెలుసుకుందాం..
సూక్ష్మజీవులు మన నీటి బాటిల్‌లోకి అనేక రకాలుగా ప్రవేశిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. నీరు తాగడానికి నోటిని బాటిల్‌కు తాకించగానే చర్మం, పెదవులు, చిగుళ్ళు, దంతాలు, నాలుకపై ఉండే కొన్ని సూక్ష్మజీవులు సీసాలోకి ప్రవేశిస్తాయని, నీటిలో వృద్ధి చెందడం మొదలు పెడతాయని వివరించారు. బాటిల్‌ని తీయడానికి లేదా బాటిల్ మూతను తెరిచేందుకు మన చేతి వేళ్లను వాడినప్పుడు ఇలానే జరుగుతుంది.
బాటిల్ పెట్టేందుకు వాడే బ్యాగులు, స్కూల్ లాకర్లు, డెస్క్‌లు, కిచెన్ సింక్‌లలో బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకే బాటిల్‌ను తరచుగా శుభ్రం చేయాలి. లేదంటే ఈ సూక్ష్మజీవులు అందులోకి ప్రవేశించడం, అనంతరం విపరీతంగా వృద్ధి చెందడం జరుగుతాయి. కేవలం 24 గంటల్లో మిల్లీలీటర్‌కు 75 వేల నుంచి 20 లక్షల వరకు సంఖ్య పెరుగుతుందని అధ్యయనంలో తేలింది.
తేమ, వెచ్చని, చీకటి వాతావరణం (ప్లాస్టిక్ లేదా అల్యూమినియం సీసాలలో) అనేక శిలీంధ్ర జాతులకు అనువైన నివాసం అని పరిశోధకులు తెలిపారు.
వాటర్ బాటిల్ లోని బ్యాక్టీరియాతో కలిగే హాని ఇదే..!
* బాటిల్‌లో సూక్ష్మజీవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వికారం, వాంతులు వంటి కొన్ని తేలికపాటి లక్షణాలు కలగొచ్చు.
* అలర్జీతో బాధ పడే వారిలో ముక్కు మూసుకుపోవడం, వికారం, తలనొప్పి, అలసట, ఇతర అసౌకర్యాలు కలగొచ్చు.
* పిల్లలు, వృద్ధులు లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వారు ఎక్కువగా ప్రభావితమవుతారు. అందుకే వ్యక్తిగతంగా ఉపయోగించే వస్తువుల పరిశుభ్రతపై మరింత శ్రద్ధ వహించాలని పరిశోధకులు తేల్చి చెప్పారు.
వాటర్ బాటిల్‌ను క్లీన్ చేయడం ఎలా?
* యూజ్ చేసినప్పుడల్లా కడగడం ఉత్తమం.
* రోజుకొకసారి శుభ్రం చేస్తే సరిపోతుంది.
* బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడానికి.. ఆహార పాత్రలను కడిగేందుకు వాడే సబ్బు, నీటిని ఉపయోగించాలి.
* సూక్ష్మజీవులను తొలగించడానికి బ్రష్‌లను వాడటం చాలా ముఖ్యం.
* శుభ్రం చేశాక తాగునీటిని మళ్లీ నింపే ముందు కాసేపు ఆరనివ్వడం కూడా మంచిది.
* మీ వాటర్ బాటిల్ ను ఇతరులతో పంచుకోవద్దు.
* పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలు వంటి ఇతర ద్రవాలతో బాటిల్ నింపొద్దు. అటువంటి ద్రవాలలో సూక్ష్మజీవులను ప్రేరేపించే పోషకాలు ఉంటాయి.
* అల్యూమినియంతో తయారు చేసిన బాటిళ్ల కంటే గాజు సీసాల్లో సూక్ష్మజీవులు తక్కువ.
* ఇంకా ముఖ్యమైన విషయం గాజు లేదా అల్యూమినియం ఏదైనా కావొచ్చు.. క్లీన్ చేయడానికి ఈజీగా ఉండే బాటిల్స్ కొనాలి.
Also Read: స్పెర్మ్ కౌంట్ లక్షల్లో పెరుగుతుంది.. మగమహారాజులకు గొప్ప వరం.. రోజు ఇలా చేయండి చాలు!