Vegetables Boil: కూరగాయలను బాగా ఉడికిస్తే ఏమవుతుంది? పోషకాలు తగ్గుతాయా? అసలు ఏ వెజిటబుల్స్ పచ్చిగా తినడం మంచిది..

బ్రోకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, గుమ్మడికాయ, పాలకూర, బఠానీల్లో పోషకాలు మంచి పరిమాణంలో లభిస్తాయి. (Vegetables Boil)

Vegetables Boil: కూరగాయలను బాగా ఉడికిస్తే ఏమవుతుంది? పోషకాలు తగ్గుతాయా? అసలు ఏ వెజిటబుల్స్ పచ్చిగా తినడం మంచిది..

Updated On : August 24, 2025 / 10:12 PM IST

Vegetables Boil: కూరగాయలను బాగా ఉడికిస్తే ఏమవుతుంది? అందులోని పోషకాలు (ఖనిజాలు, విటమిన్లు) తగిపోతాయా? అసలు కూరగాయలను ఉడికించకుండా తినొచ్చా? ఉడికించి తినడం మంచిదా? పచ్చివి తినడం మేలా? ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది.. ఇలాంటి ధర్మ సందేహాలు నిత్యం అందరిలోనూ ఉంటాయి. మరి పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

వెజిటబుల్స్ ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గుతాయి. ఇది నిజమే అంటున్నారు నిపుణులు. అదే సమయంలో కొన్నిసార్లు వండిన కూరగాయలలోని పోషకాలను మన శరీరం ఈజీగానే గ్రహిస్తుందని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేని వెజిటబుల్స్ చాలానే ఉన్నాయని, వేడి వల్ల వాటిలోని పోషకాలు చెడిపోతాయని వివరించారు. కూరగాయల్లోని పోషకాలన్నీ మనకు అందాలంటే తినే విధానం భిన్నంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇంతకీ ఏ వెజిటబుల్స్ ను వండకుండా తినడం మంచిది? వాటిని తప్పనిసరిగా ఎప్పుడు వండి తినాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కూరగాయలు పచ్చివే తినాలి..

ఉడికించడం కారణంగా కూరగాయల పోషక విలువలను తగ్గించవచ్చని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాలు.. ఉడికించినప్పుడు నీటిలో కరిగిపోతాయి. అయితే సూప్‌ వంటి వాటిలో ఇది మంచిదే అంటున్నారు. ఎందుకంటే, కూరగాయలతో పాటు నీటిని తాగుతాము. కానీ, ఆ నీటిని పారబోస్తేనే సమస్య.

బ్రోకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, గుమ్మడికాయ, పాలకూర, బఠానీల్లో పోషకాలు మంచి పరిమాణంలో లభిస్తాయి. వేడి ఈ పోషకాలను బలహీనపరుస్తుంది. కాబట్టి ఇలాంటి వెజిటబుల్స్ ను నెమ్మదిగా, తక్కువ నీటిలో ఉడికించాలని పోషకాహార నిపుణులు సూచించారు. వాటిని నీటిలో వేసి ఉడకబెట్టడం కంటే ఆవిరి మీద ఉడికించడం లేదా మైక్రోవేవ్‌లో ఉడికించడం మంచిదన్నారు.

* క్యారెట్ ఉడికించకుండానే తినొచ్చు. వృద్ధులకు కాస్త ఆవిరి మీద ఉడికించిన క్యారెట్ ఇవ్వడం మంచిది.
* టమోటాలను వేడి నీటిలో వేసి తొక్క తీయచ్చు. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్న వారు లేదా రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉన్న వారు టమోటా విత్తనాలను తీసేయాలి.
* వంట చేసేటప్పుడు చివరలో టమోటాలు వేయాలి. దీనివల్ల అందులో ఉండే లైకోపీన్ (యాంటీ ఆక్సిడెంట్) పూర్తిగా కోల్పోకుండా ఉంటుంది.

కొన్ని వెజిటబుల్స్ మాత్రం చాలా స్పెషల్. ఉడికించిన తర్వాత వాటిలో మరింత పోషకాలు చేరతాయి. బాయిల్ చేయడం వల్ల వాటి కణాలు విచ్ఛిన్నమవడమే ఇందుకు కారణం. అప్పుడు మన శరీరం వాటిలో ఉండే పోషకాలను సులభంగా గ్రహించగలదు.
* పిండి పదార్ధాలు, ప్రోటీన్లు కలిగిన వెజిటబుల్స్ ను బాయిల్ చేశాకే ఈజీగా డైజస్ట్ అవుతాయి.
* బంగాళాదుంప వంటి కొన్ని పిండి పదార్ధాలు ఉండే కూరగాయలను మాత్రం పచ్చిగా తినలేము.

వేడెక్కడం వల్ల కొన్ని కూరగాయల్లో విటమిన్లు పూర్తిగా పోతాయి. విటమిన్ సి ఉన్న కూరగాయల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఉసిరి ఎక్కువ వేడిని తట్టుకోలేదు. ఎక్కువ ఉడికించడం వల్ల అందులోని విటమిన్లన్నీ పోతాయి. ఉసిరి రక్తస్రావాన్ని ఆపుతుంది. కాబట్టి ఉసిరిని ఆవిరిలో ఉడికించాకే తినడం మంచిది.
* క్యారెట్, ముల్లంగి, దోసకాయ, బీట్‌రూట్, ఉల్లిగడ్డ వంటి వెజిటబుల్స్ ను బాయిల్ చేయకుండానే తినొచ్చు. అందువల్ల వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి పూర్తిగా అందుతాయి.
* సొరకాయ, బీరకాయ, పాలకూర వంటి కూరగాయలను మామూలుగా ఉడికించి తినాలి.
* కూరగాయలను ఎక్కువసేపు ఉడికిస్తే అందులో ఉండే విటమిన్లు మొత్తం పోయి మనకు ఫైబర్ మాత్రమే లభిస్తుంది.
* క్యాబేజీని ఎక్కువసేపు ఉడికించడం వల్ల అందులోని పోషకాలు పోతాయి. అదే ఆవిరిపై ఉడికిస్తే 100శాతం కాకపోయినా కనీసం 70శాతం పోషకాలు అలాగే ఉంటాయి.
* భూమి లోపల పెరిగే వెల్లుల్లి, ఉల్లిపాయ, అల్లం వంటి వాటిని చాలా మంది ఫ్రిజ్‌లో ఉంచుతారు. దీనివల్ల అవి తాజాగా కనిపిస్తాయి. కానీ ఆ సమయంలో వాటిలో ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది. ఇది వ్యాధులకు దారితీస్తుంది.

పచ్చి ఆహారం తినడం వల్ల కలిగే నష్టాలు..

* మనం తీసుకునే ఆహార పదార్థాలను పరిమితం చేస్తుంది. అనేక రకాల పదార్థాలు లేకపోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడతుంది.
* పచ్చి ఆహారంలో తగినంత స్థాయిలో ప్రోటీన్, విటమిన్ బి12, ఐరన్ ఉండవు.
* చాలామంది శరీరం పచ్చి ఆహారాన్ని జీర్ణం చేసుకోలేదు. అందువల్ల దానిలోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించదు.
* కొన్ని వెజిటబుల్స్ తరిగినప్పుడు లేదా రుబ్బినప్పుడు ఎక్కువ పోషకాలు చేరతాయి.
* కొన్ని వండినప్పుడు వాటిలో మరిన్ని పోషకాలు చేరతాయి.

ఏ కూరగాయలు తింటే ఆరోగ్యానికి ప్రయోజనం?
* అన్ని వెజిటబుల్స్ లో పూర్తి పోషకాలు ఉంటాయని చెప్పలేము అంటున్నారు నిపుణులు. అదే సమయంలో కూరగాయలతో పెద్ద ప్రమాదం వాటిలో ఉండే పురుగు మందులు లేదా రసాయనాలు.
* పొట్లకాయ లేదా బొప్పాయి వంటివి పెద్దవిగా పెరగడానికి ఆక్సిటోసిన్ ఇంజెక్ట్ చేస్తారు.
* స్థానికంగా పండించిన కూరగాయలను మాత్రమే కొనాలి. దీని వల్ల వాటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు. వీటికి ఎలాంటి రసాయనాలు ఉపయోగించరు.
* కూరగాయలను కనీసం 15 నిమిషాలు నీటిలో నానబెట్టడం మంచిది. కూరగాయలను కడిగేందుకు బేకింగ్ సోడాను కూడా వాడొచ్చు.
* కూరగాయలను కోశాక వాటిని కడగటం మంచిది.
* వానా కాలంలో ఆకుకూరలు తినకపోవడమే మంచిది. మురికి నీళ్ల వల్ల వాటిలో వ్యాధికారక క్రిములు లేదా బ్యాక్టీరియా చేరడమే ఇందుకు కారణం.
* కూరగాయలను వండటం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. వాటి టేస్ట్ పెరుగుతుంది. అలాంటి తింటే మనకు సంతృప్తిగా అనిపిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Also Read: అమ్మ బాబోయ్.. మీ వాటర్ బాటిల్‌లో కోట్ల క్రిములు..! అసలు బ్యాక్టీరియా ఎలా చేరుతుంది, బాటిల్‌ను క్లీన్ చేయడం ఎలా..