తెలంగాణ సీఎంతో దర్శకులు, నిర్మాతలు భేటీ.. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదన్న రేవంత్ రెడ్డి
"సినీ కార్మికులను, నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుంది. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరం. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందాం" అని అన్నారు.

Revanth Reddy: సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సినీ నిర్మాతలు, దర్శకులతో ఆయన ఇవాళ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడతా. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుంది. పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి.
పరిశ్రమలో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం.
Also Read: Best Phones: రూ.20 వేలలోపే అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..
తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను. పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరం.
కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వం తో వ్యవహరించాలి. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుంది. (Revanth Reddy)
సినీ కార్మికులను, నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుంది. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరం. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందాం. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు.
అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందే. పరిశ్రమ విషయంలో నేను న్యూట్రల్ గా ఉంటా. హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోంది.
తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే నా ధ్యేయం” అని అన్నారు.