Mulching Method : మల్చింగ్ విధానంతో.. మెట్టపంటలసాగు

సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కల మీద పడకుండా మల్చింగ్ చేయటం వల్ల కిరణ జన్య సంయోగక్రియ జరగక కలుపు మొక్కలు వచ్చేందుకు అస్కారం ఉండదు.

Mulching Method : మల్చింగ్ విధానంతో.. మెట్టపంటలసాగు

Mulching

Updated On : August 18, 2021 / 3:42 PM IST

Mulching Method  : మెట్టపంటల సాగులో ప్రస్తుతం నూతన పద్దతులను రైతులు పాటిస్తున్నారు. అన్ని ప్రతికూల వాతావరణ పరిస్ధితుల్లోనూ పంటలను కాపాడుకునేందుకు వీలుగా మల్చింగ్ సాగు విధానం రైతులకు ఎంతగానో ఉపకరిస్తుంది. తక్కువ నీటి వసతితో ఎక్కవ పంట సాగు చేసి అధిక లాభాలను పొందేందుకు ప్రస్తుతం రైతులు మల్చింగ్ సాగు వైపు దృష్టిసారిస్తున్నారు.

మొక్కల చుట్టూ ఉండే ప్రాంతం మొత్తాన్ని ప్లాస్టీక్ షీట్ వంటి కవర్లతో కప్పిఉంచటాన్ని మల్చింగ్ పద్దతిగా పిలుస్తారు. నీటి లభ్యత తక్కువగా ఉండి వేడి వాతావరణం ఉన్న భూముల్లో ప్లాస్టీక్ షీటు మల్చింగ్ చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. మొక్కచుట్టూ ఈ షీటు ఉండటం వల్ల భూమిలోపల ఉండే తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు.

సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కల మీద పడకుండా మల్చింగ్ చేయటం వల్ల కిరణ జన్య సంయోగక్రియ జరగక కలుపు మొక్కలు వచ్చేందుకు అస్కారం ఉండదు. వర్షపు నీరు నేరుగా భూమి మీదపడకుండా నివారించటం వల్ల భూసారాన్ని రక్షించుకోవచ్చు. మల్చింగ్ పద్దతిలో ఒక పంట కాలం పూర్తయిన తరువాత మరో పంట వేసేందుకు భూమిని సిద్ధం చేసుకునేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు మల్చింగ్ పద్దతి సాగు మంచి ఫలితాలనిస్తుంది.

మల్చింగ్ విధానంలో సాగు చేపట్టటం వల్ల దిగుబడులు సైతం పెరిగినట్లు పలువురు రైతులు చెబుతున్నారు. పంట నాణ్యత పెరగటంతోపాటు, చీడపీడల ఉదృతి కూడా తగ్గించుకోవచ్చని అంటున్నారు. మొక్కకు అందించిన ఎరువులు భూమిలోపల పొరల్లోకి వెళ్ళకుండా నివారించటం ద్వారా ఇతర కలుపు మొక్కల పెరుగుదలకు అవకాశం ఉండదు.